Advertisement

Advertisement


Home > Politics - Andhra

అనగనగా జోగయ్య: ఆశలావు.. పీక సన్నం!

అనగనగా జోగయ్య: ఆశలావు.. పీక సన్నం!

ఆశలావు.. పీక సన్నం అని ఒక సామెత ఉంటుంది. అత్యాశకు పోయే వారి గురించిన సామెత ఇది. తిరుమల శ్రీవారి కైంకర్యాల్లోని కల్యాణోత్సవం లడ్డూ (పెద్దలడ్డూ)ను ఒక్క గుటకలో నోట్లో పెట్టుకుని మింగేయాలని మనకు కోరిక ఉండొచ్చు. కానీ.. అది మన నోట్లో పడుతుందా? మన పీకలోంచి కడుపులోకి జారుతుందా? కుదరదు కదా? అలాంటి కోరికల గురించే ఈ సామెత చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఏపీ కాపు బలిజ సంక్షేమ సేన పేరుతో తెరవెనుక రాజకీయ సూత్రధారిలాగా కీర్తి గడించాలని అనుకుంటున్న మాజీ మంత్రి హరిరామజోగయ్య మాటలు ఈ సామెతను గుర్తుకు తెస్తున్నాయి.

ఎన్డీయే కూటమి ప్రభుత్వమే ఏర్పడుతుందని, రాష్ట్రంలోని కాపు, బలిజ, తెలగ కులాలన్నీ కూడా ఎన్డీయే అభ్యర్థుల విజయానికే పాటుపడాలని పిలుపు ఇస్తున్న జోగయ్య.. గెలవగానే ప్రభుత్వం ఏర్పాటులో పవన్ కల్యాణ్ కీలక భూమిక పోషించాలని అంటున్నారు.

జోగయ్యకు అలాంటి ఆశలు ఎన్నయినా ఉండవచ్చు. కానీ.. పవన్ కల్యాణ్ కీలక భూమిక పోషించడం ఎలా సాధ్యం అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం. యాభైనుంచి పెద్దసంఖ్యలో సీట్లు కావాలని బేరాలాడుతూ.. ముప్ఫై దాకా వచ్చి.. చివరికి 21 సీట్లు ముష్టిలాగా చంద్రబాబు విదిలిస్తే మారుమాటాడకుండా తీసుకున్న బలహీన నాయకుడు పవన్ కల్యాణ్.

పోనీ 21 దక్కిన తర్వాత అయినా.. ఆయనకు అభ్యర్థులను పోటీకి నిలిపే దిక్కుందా అంటే అది కూడా లేదు. వైసీపీ నుంచి చివరికి తెలుగుదేశం నుంచి నేతల్ని తమ పార్టీలో చేర్చుకుని వారికి టికెట్లు కట్టబెట్టి.. జనసేన యొక్క గతిలేనితనాన్ని బయటపెట్టుకున్న నేత రేపు గెలిచినంత మాత్రాన కీలక భూమిక ఎలా పోషించగలరు?

నిజానికి పవన్ కల్యాణ్ మీద హరిరామజోగయ్యకు ఇలాంటి అత్యాశల కోరికలు చాలానే ఉంటాయి. సీట్ల పంపకానికి ముందు జనసేన ఏకం 60 సీట్లు పుచ్చుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. అలాగే.,. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కుర్చీని పంచుకోవాలని కూడా సలహా ఇచ్చింది ఈయనే. తొలి రెండున్నరేళ్లు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండేలా, ఆ తర్వాత చంద్రబాబుకు ఇచ్చేలా ఒప్పందం చేసుకోవాలని హరిరామ జోగయ్య ఉచిత సలహాలు అనేకం ఇచ్చారు. అవేవీ పవన్ కనీసం పట్టించుకోలేదు.

ఇప్పటికి చంద్రబాబు ఇచ్చినవి చాలు, రేపు గెలిచిన తర్వాతనైనా సరే.. చంద్రబాబు ఏవి విదిలిస్తే అవి చాలు అనుకునే స్థితిలో పవన్ కల్యాణ్ రాజకీయం నడుస్తోంది. జోగయ్య మాత్రం ఆశలావు పీకసన్నం అన్నట్టుగా ‘కీలకభూమిక పోషించాలని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?