Advertisement

Advertisement


Home > Politics - Andhra

మంత్రి ఆశలతో కొణతాల!

మంత్రి ఆశలతో కొణతాల!

ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి. అప్పుడే ఆయన మంత్రి కావాలని అనుచరులు నినాదాలు చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో కచ్చితంగా కొణతాల రామక్రిష్ణ మంత్రి అవుతారు అని వారు చెప్పడం విశేషం.

అనకాపల్లి అసెంబ్లీ సీటుకు ఎందరో పోటీదారులు ఉన్నారు. రాజకీయంగా చూస్తే దాదాపుగా నాలుగున్నరేళ్ల పాటు అజ్ఞాతవాసం చేసిన కొణతాల లేట్ గా వచ్చినా లేటెస్ట్ అన్నట్లుగా అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ సాధించారు. అసంతృప్తులు అలకలు కూటమి చాటున సర్దుబాటు కాగా ఆయన ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేశారు.

కొణతాల నామినేషన్ దాఖలు చేయడం పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేయడం వరకూ బాగానే ఉంది. కానీ అపుడే పెద్ద ఆశలతో ఊహల పల్లకిలో ఊరేగడం మీదనే చర్చ సాగుతోంది. మా నేత మంత్రి అవుతారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడమేంటి మంత్రి ఆయనే అని జోస్యం చెబుతున్నారు.

అనకాపల్లిలో చూస్తే పోటీ గట్టిగానే ఉంది అని అంటున్నారు. మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సాఫీగా సాగాల్సి ఉంది. అన్నీ జరిగి ఎమ్మెల్యే అయినా కూటమి రావాలి. ఆ మీదట జనసేన వాటాలో ఎన్ని మంత్రి పదవులు వస్తాయో చూడాలి. అవి కూడా విశాఖ జిల్లాలో టీడీపీ కాకుండా ఇవ్వరు అన్నది గుర్తుంచుకోవాలి.

సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మంత్రి రేసులో తప్పకుండా ఉంటారు. అదే జిల్లాకు చెందిన పక్క నియోజకవర్గం వారిని మంత్రి పదవి ఎందుకు ఇస్తారు. ఇవన్నీ రాజకీయ సమీకరణలలో ఉంటాయి. ఏమీ కాకుండా మంత్రి అవుతారు అని కొణతాల వర్గీయులు ప్రచారం చేసుకోవడం ద్వారా అసలుకే ఎసరు తెచ్చేలా ఉన్నారని అంటున్నారు.

ఏ మాటకు ఆ మాట చెప్పుకుంటే మాత్రం కొణతాల రాజకీయ సిరి ఉన్న నాయకుడు అని అంటారు. ఆయన 1989లో కేవలం తొమ్మిది ఓట్ల తేడాతో కాంగ్రెస్ నుంచి అనకాపల్లి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు కూడా చూస్తే రాజకీయంగా రిటైర్ అయిపోయారు అనుకున్న తరుణంతో తలుపు తట్టి మరీ పవన్ టికెట్ ఇచ్చారు. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్లుగా లక్ కలిస్తే ఏమైనా అవుతారు అని ఆయన వర్గం బల్ల గుద్ది మరీ చెబుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?