Advertisement

Advertisement


Home > Politics - Andhra

మునుగోడు గెలుపు బాధ్యతలు కేటీఆర్ కు ...?

మునుగోడు గెలుపు బాధ్యతలు కేటీఆర్ కు ...?

తెలంగాణలో ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా ఆ బాధ్యతలు అప్పగించేది ఇద్దరు నాయకులకే. కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు లేదా కుమారుడు కేటీఆర్ ఆ బాధ్యతలు తీసుకుంటారు. శక్తివంచన లేకుండా పనిచేస్తారు. చాలాసార్లు విజయం సాధించారు కూడా. ఇద్దరూ మంచి మాటకారులు కూడా. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడుకు ఉప ఎన్నిక జరగాలి. కానీ మరోపక్క కేసీఆర్ ముందస్తు ఎన్నికల ఆలోచన కూడా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

కేసీఆర్ ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తున్నట్లు ఇవాళ ఓ ప్రధాన పత్రిక రాసింది కూడా. బీజేపీ, కాంగ్రెస్ మునుగోడు ఉప ఎన్నిక ఏర్పాట్లలో, వ్యూహాల్లో నిమగ్నమై ఉన్న సమయంలో హఠాత్తుగా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చు కూడా. కేసీఆర్ వ్యూహాలు అనూహ్యంగా ఉంటాయనే సంగతి తెలిసిందే కదా. 

సరే ....ఆ విషయం అలా ఉంచితే, కేసీఆర్ ఇప్పుడైతే మునుగోడు మీదనే దృష్టి పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. మునుగోడు నాయకులతో మాట్లాడుతున్నారు. నివేదికలు తెప్పించుకొని స్టడీ చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఖాయమైనప్పటి నుంచి విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్వర రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కేసీఆర్ ఆయన్ని తరచూ పిలిపించి మాట్లాడుతున్నారు. మంత్రి కూడా నియోజకవర్గ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. 

మునుగోడులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే, నల్గొండ జిల్లా టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ ను కలిసినప్పుడు మునుగోడుకు ఎన్నికల ఇన్ చార్జిగా మంత్రి కమ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ ను నియమించాలని కోరారు. 

అంటే బాధ్యతలన్నీ ఆయనకు అప్పగించాలని అడిగారన్నమాట. దీనిపై ఆలోచిస్తానని కేసీఆర్ కూడా నాయకులకు హామీ ఇచ్చారు. కేటీఆర్ ను పెడితే అక్కడ టీఆర్ఎస్ గెలుస్తుందని నాయకులకు నమ్మకం కావొచ్చు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ బాధ్యతలు హరీష్ రావుకి అప్పగిస్తూ ఉండటం తెలిసిందే. 

తెలంగాణా ఏర్పడ్డప్పటి నుంచి ఇదే జరుగుతోంది. 2016 లో నారాయణ్ ఖేడ్ ఉపఎన్నిక, 2020 లో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరిగాయి. నారాయణ్ ఖేడ్ గెలుచుకున్న టీఆర్ఎస్ మిగతా రెండు చోట్ల ఓడిపోయింది. 2016 , 2020 లో జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల బాధ్యత మంత్రి కేటీఆర్ కు అప్పగించారు. 2016 జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్ సూపర్ మెజారిటీ సాధించింది. కానీ తరువాతి ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన స్థానాలు సాధించి టీఆర్ఎస్ కు సవాల్ విసిరింది.

అప్పుడు గులాబీ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అంటే మెజారిటీ దాదాపు సగానికి సగం తగ్గిపోయిందన్నమాట. దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు హారీష్ రావుకుగానీ, కేటీఆర్ కు గానీ బాధ్యతలు అప్పగించలేదు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలప్పుడు పూర్తి బాధ్యతలు మంత్రి జగదీశ్ రెడ్డికి అప్పగించారు. ఆ ఎన్నికలో కాంగ్రెస్ దిగ్గజం జానారెడ్డిని ఓడించగలిగారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికకు కూడా జగదీశ్ రెడ్డి చురుగ్గానే పనిచేస్తున్నారు. కానీ మునుగోడు టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ను ఇంఛార్జిగా కోరుకుంటున్నారు.

గతంలో ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికకు కేటీఆర్ ఇంచార్జ్ గా పనిచేశారు. అప్పుడు అక్కడ తుమ్మల నాగేశ్వరరావు గెలిచారు. కేటీఆర్ ఆధ్వర్యంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లలో టీఆర్ఎస్ విజయం సాధించింది. కాబట్టి మునుగోడు కూడా కేటీఆర్ కు అప్పగిస్తే విజయం దక్కవచ్చని అనుకుంటున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?