ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు వైసీపీ నుంచే ఆదినారాయణరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లి మంత్రి పదవిని దక్కించుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కడప పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌తో టీడీపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి తలపడ్డారు. చివరికి ఓటమిపాలయ్యారు.
టీడీపీ అధికారం నుంచి దిగిపోగానే ఆదినారాయణరెడ్డికి భయం పట్టుకుంది. దీంతో ఆయన బీజేపీని ఆశ్రయించారు. ఆదినారాయణరెడ్డి అన్నదమ్ములు మాత్రం టీడీపీలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు నుంచి పోటీపై కూడా ఆయన సవాల్ విసరడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు.
ఏడాదిలో స్టీల్ ప్లాంట్ పనులు మొదలు పెడతామని సీఎం వైఎస్ జగన్ చెప్పారన్నారు. కానీ మూడేళ్లు దాటుతున్నా పునాదులు కూడా వేయలేదని ఆయన విమర్శించారు. జగనన్న తుపాకి తుప్పు పట్టిందని ఎద్దేవా చేశారు. జగన్ గన్ గోరంట్ల, అంబటి, అవంతికి ఇచ్చారని ఆదినారాయణరెడ్డి వెటకారం చేశారు. జమ్మలమడుగులో పోటీ చేస్తానని, దమ్ముంటే ఎవరైనా పోటీకి రావాలని ఆయన సవాల్ విసిరారు.
జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి వైఎస్సార్ హయాం నుంచి ఓ పెద్ద ప్రహసనం జరుగుతోంది. వైఎస్సార్ మరణానం తరం బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ అటకెక్కింది. రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రాకు స్టీల్ ప్లాంట్ హామీ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో జమ్మలమడుగులో మొక్కుబడిగా స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత జగన్ వచ్చినా, అదే దుస్థితి.