తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఓ స్థానం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయంగా వారికి మంచి పట్టు వుంది. దివంగత వైఎస్సార్ హయాంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ వెలుగు వెలిగారు. రాష్ట్ర విభజనతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభ తగ్గింది. అధికారానికి దూరమై, అంతర్గత కలహాలతో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలహీనపడుతోంది. కాంగ్రెస్‌కు వీర విధేయులుగా చెప్పుకునే కోమటిరెడ్డి బ్రదర్స్ చివరికి ఆ పార్టీ నుంచి బయటపడే పరిస్థితి.
ఈ విషయమై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇక ఎంపీ వెంకటరెడ్డి సంగతే తేలాల్సి వుంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు విమర్శల దాడి మొదలు పెట్టారు. ప్రజాశాంతిపార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌తో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పోల్చారు.
కేఏ పాల్, రాజగోపాల్‌రెడ్డి ఇద్దరూ ఇద్దరే అని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్లిద్దరూ ఏం మాట్లాడ్తారో వాళ్లకే తెలియదని తప్పు పట్టారు. రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ ఎన్నో అవకాశాలు కల్పించిం దన్నారు. కేంద్రమంత్రి అమిత్‌షాను అన్నదమ్ములిద్దరూ ఒకేసారి కలిశారంటే త్వరలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా బీజేపీలో చేరుతారన్నారు.
ఎంపీ కోమటిరెడ్డి చండూరు సభకు ఎందుకు రాలేదో, అలాగే అమిత్‌షాతో ఎందుకు భేటీ అయ్యారో చెప్పాలని రాంరెడ్డి దామోదర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇదిలా వుండగా ఈ నెల 21న బీజేపీలో చేరనున్నట్టు రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి వ్యతిరేకుల అడ్డు తొలగించే కార్యక్రమాన్ని వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. అయితే కేఏ పాల్‌తో తమ నాయకుడిని పోల్చడంపై రాజగోపాల్‌రెడ్డి అనుచరులు మండిపడుతున్నారు.