తెలంగాణలో రోజురోజుకూ రాజకీయ పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారుతున్నాయి. తెలంగాణలో వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది అధికారాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. దీంతో ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోవద్దని బీజేపీ అధిష్టానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లోని అసంతృప్తులను గుర్తించి, తమ పార్టీలో చేర్చుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. బీజేపీ తెలంగాణ ఇన్చార్జ్ తరుణ్‌చుగ్‌ను ఢిల్లీలో బండి సంజయ్ వెంట వెళ్లి శ్రవణ్ కలిశారు. ఈ సందర్భంగా తరుణ్‌చుగ్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం చేరికలు కేవలం ట్రైలర్ మాత్రమే అని, సినిమా వేరే ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోతోందన్నారు. టీఆర్ఎస్కు కాంగ్రెస్ బీటీమ్‌గా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో బీజేపీలో మరిన్ని చేరికలుంటాయన్నారు. బీజేపీలో చేరే వారి జాబితా చాలా పెద్దదన్నారు.
కాంట్రాక్టుల ఆశ చూపి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని చేర్చుకుంటున్నారనే ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదంతా కాంగ్రెస్,టీఆర్ఎస్ సంస్కృతి అని స్పష్టం చేశారు. ఆ సంస్కృతి బీజేపీది కాదన్నారు. సోనియాను తిట్టినవారే ఇప్పుడు పీసీసీ చీఫ్ అయ్యారని బండి గుర్తు చేశారు.