మహానాడు వేదికగా నారా చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ మేనిఫెస్టోపై టీడీపీలో తీవ్ర అసంతృప్తి నెలకుంది. ఈ మేనిఫెస్టో టీడీపీకి గుదిబండగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ ఓటు బ్యాంక్‌కు ఈ మేనిఫెస్టో భారీగా గండి కొడుతుందనే అనుమానం, భయం టీడీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్రాప్‌లో చంద్రబాబు పడి, మరోసారి రాజకీయంగా నష్టపోవడానికి సిద్ధమయ్యారనే అభిప్రాయాలు టీడీపీ సీనియర్ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి.
గత నాలుగేళ్లుగా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఏపీలో మరే అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని, కూచొని ఊరికే తినవాళ్లకు అప్పనంగా ప్రభుత్వ సొమ్మును కట్టబెడుతున్నారని, అలాగే రాష్ట్రం శ్రీలంక, వెనుజలా, పాకిస్తాన్ అవుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే జగన్ కంటే రెండింతలు సంక్షేమ పథకాల్ని అమలు చేస్తామంటూ, మొదటి విడత మేనిఫెస్టోను విడుదల చేయడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు షాక్‌కు గురి అవుతున్నారు.
సంక్షేమానికి వైఎస్సార్, ఆయన తనయుడు వైఎస్ జగన్ చాంపియన్లగా నిలిచారు. చంద్రబాబును అభివృద్ధి చేసే పాలకుడిగా జనం చూస్తున్నారు. రాష్ట్రానికి ఆర్థికంగా సంక్షేమ పథకాలు భారంగా మారిన నేపథ్యంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే కొంత ఉపశమనం వుంటుందని కొన్ని వర్గాలు భావిస్తూ వచ్చాయి. వీళ్లంతా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వ్యతిరేకిస్తున్నారు. జగన్ ప్రధానంగా నమ్ముకున్నది కూడా సంక్షేమ పథకాలు లబ్ధిదారులు, దళితులు, గిరిజనులు, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు, బీసీల్లో మెజార్టీ ప్రజానీకం, రెడ్లు తదితరులుగా చెప్పుకోవచ్చు.
అయితే రెడ్ల నుంచి కూడా జగన్‌పై వ్యతిరేకత కనిపిస్తోంది. కానీ జగన్ తన ఓటు బ్యాంక్‌గా భావిస్తున్న వర్గాల్లో సంక్షేమ పథకాల లబ్ధి, అలాగే అధికారంలో వాటా తదితర అంశాలు సానుకూల వైఖరిని ఏర్పరిచాయి. ఇక చంద్రబాబుకు మిగిలిందల్లా సంక్షేమ పథకాలను వ్యతిరేకిస్తున్న మధ్య తరగతి, తటస్థులు, విద్యావంతులు, ఆలోచనాపరులు, ఉద్యోగులు, మేధావుల వర్గాలు.
మేనిఫెస్టో విడుదలతో జగన్‌ను వ్యతిరేకిస్తున్న, అలాగే చంద్రబాబు వస్తే అద్భుతం ఏదో చేస్తారని ఆశించిన వాళ్లందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. జగన్ ఒక్క చేత్తో బటన్ నొక్కి సంక్షేమ లబ్ధిదారులకు సొమ్ము జమ చేస్తున్నారని, ఇక చంద్రబాబును అధికారంలోకి తీసుకొస్తే రెండు చేతులూ సరిపోవనే విమర్శ మొదలైంది. ఇలాగైతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌కు గ్యారెంటీ ఏంటని టీడీపీ ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’పై విమర్శలు గుప్పిస్తున్నారు.
చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోను చూసిన తర్వాత టీడీపీ అనుకూల ఓటర్లంతా దొందు దొందే అని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి జగన్, చంద్రబాబు పోటీ పడుతున్నారంటూ మండిపడుతున్నారు. వీళ్లకు ఓట్లు వేయడం కంటే, బహిష్కరించడం ఉత్తమమనే ఆలోచనకు రావడం గమనార్హం. చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోతో టీడీపీకి లాభం సంగతేమోగానీ, భారీ నష్టం మాత్రం తప్పదనే అభిప్రాయం సొంత పార్టీ నేతల నుంచే రావడం విశేషం. సుదీర్ఘ రాజకీయ అనుభవశాలి అయిన తమ నాయకుడు ఇంత అధ్వానంగా మేనిఫెస్టో తీసుకొస్తారని అసలు ఊహించలేదని టీడీపీ నేతలు వాపోతున్నారంటే, ఎంత అసంతృప్తి వుందో అర్థం చేసుకోవచ్చు.
ఇది చాలదన్నట్టు దసరాకు మరింతగా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పథకాలు తీసుకొస్తామని ప్రకటించడంపై ఆగ్రహిస్తున్నారు. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వచ్చినా సంక్షేమ పథకాల అమలుకు ఏడాదికి రూ. 2 లక్షల కోట్లకు తక్కువ కాకుండా బడ్జెట్ అవసరమని, ఎక్కడి నుంచి తెస్తారనే నిలదీతలు ఎదురవుతున్నాయి.
తన ఓటు బ్యాంక్‌ను కాపాడుకునేందుకు మేనిఫెస్టోను తీర్చిదిద్దాల్సింది పోయి, జగన్ ట్రాప్‌లో పడి ఆయనలాగే పాలిస్తానని చెప్పడం అంటే… వైసీపీ పాలనకు ఆమోద ముద్ర వేసినట్టైందని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఈ మాత్రం దానికైతే మళ్లీ జగన్‌ను కాకుండా, మనల్ని ఎందుకు ఎన్నుకోవాలని అనుకుంటారనే ప్రశ్న ఆలోచించతగ్గదే. మరి బాబుకు అర్థమవుతున్నదో? లేదో?