Advertisement

Advertisement


Home > Politics - Opinion

జగన్: నాలుగేళ్లలో వెలుగు కిరణాలు.. చీకటి మరకలు !

జగన్: నాలుగేళ్లలో వెలుగు కిరణాలు.. చీకటి మరకలు !

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా పదవీస్వీకార ప్రమాణం చేసి నేటికి నాలుగేళ్లు పూర్తవుతున్నాయి. జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడిగా రాజకీయ రంగప్రవేశం చేసినప్పటికీ.. ఆయన దివంగతులైన తర్వాత, ఆయన నీడలోనే మిగిలిపోకుండా, తన వ్యక్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని, తండ్రికి ఉన్న ప్రజాభిమానాన్ని కాపాడుకోవడానికి సొంత పార్టీ పెట్టుకుని తన రెక్కల కష్టంతో పార్టీ నిర్మాణం సాగించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 

2014 ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని ఆమోదించి.. తన విధానాలను మార్చుకుని, జనమనోగతాన్ని తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అప్పటికి కనీవినీ ఎరుగనంత సుదీర్ఘమైన పాదయాత్ర చేసి.. జనం ప్రేమాభిమానాలను గెలుచుకున్నారు. 175 సీట్లున్న ఏపీ శాసనసభలో 151 సీట్లు సాధించి తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. పరిపాలనలో డెబ్భయ్యేళ్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎరుగని రీతిలో తనదైన ముద్ర చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి ఆశావహుడైన రాజకీయ నాయకుడు. అందరు నాయకులకు ఉన్నట్లే ఆయనకు కూడా సుదీర్ఘకాలం తాను ముఖ్యమంత్రిగా పనిచేయాలనే కోరిక ఉంది. ప్రజలు తనను ఎప్పటికీ మరచిపోనంత, విస్మరించలేనంత గొప్ప నాయకుడిగా వారందరి ప్రేమను సొంతం చేసుకోవాలనే అత్యాశ కూడా ఉంది. 

నలభయ్యారేళ్లకు ముఖ్యమంత్రి అయిన జగన్.. తన పార్టీ శ్రేణులకు నాయకులకు చేసే దిశానిర్దేశం ఒక్కటే. బాగా కష్టపడి రెండోసారి కూడా విజయం సాధిద్దాం. మళ్లీ 30 ఏళ్ల పాటూ వెనుదిరిగి చూసుకోనక్కర్లేదు. మరో ముప్పయ్యేళ్లు మనదే పాలన అంటుంటారు. మరి అంత సుదీర్ఘకాలం జననేతగా చెలామణీ కాగల స్థాయిలో ఆయన పాలన ఉన్నదా? నాలుగేళ్లలో ఆ విషయాన్ని ఆయన ఎలా నిరూపించుకుంటున్నారు. ఆయన పాలనలో వెలుగుకిరణాలు ఏమిటి? చీకటి మరకలు ఏమిటి? అనే దిశగా విశ్లేషణ ఈ కథనం.

వెలుగు కిరణాలు

జగన్మోహన్ రెడ్డి సింగిల్ పాయింట్ ఎజెండా పేద ప్రజలు మాత్రమే. అందుకే ఆయన సింగిల్ పేజీ మేనిఫెస్టోతో 2019 ఎన్నికల్లో ప్రజల ముందుకు వచ్చారు. పేదల సంక్షేమం ఒక్కటే ఆయన తన పాలన లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో తన పాలనలో ఏ ఒక్క పేద కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందుల వలన వెనుకబడకూడదని, కన్నీళ్లు పెట్టుకోకూడదని ఆయన సంకల్పించారు. అందుకే తన మేనిఫెస్టోలో చెప్పినవి, చెప్పనివి కూడా ఆయన పాలనాలో పథకాలుగా రూపుదిద్దుకున్నాయి.

వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ వంటివి ఆయన సంకల్పంలోంచి జనించిన కొన్ని అద్భుతమైన విషయాలు. నిరుపేదలు అనారోగ్యం బారినపడితే చావు ఒక్కటే శరణ్యం అనుకునే దుస్థితులకు వైఎస్సార్ చరమగీతం పాడేశారు.

అంతటి స్థాయిలో చరిత్ర ఉన్నంత కాలం నిరుపేదలు నిశ్చింతతో కూడిన విద్యాభ్యాసం సాగించడానికి జగన్ తీసుకువచ్చిన ‘అమ్మ ఒడి’ పథకం ఒక అద్భుతం. ప్రెవేటు పాఠశాలల్లో చదివే సంపన్న వర్గాలకు కూడా దీనిని వర్తింపజేయడం పట్ల కొన్ని విమర్శలున్నప్పటికీ.. ఆర్థిక ఇబ్బంది వల్ల తన పాలనలో ఏ ఒక్క బిడ్డకు కూడా చదువులు దూరం కాకూడదని జగన్ తీసుకున్న సంకల్పం మహత్తరమైనది. విద్యాదీవెన, వసతి దీవెన అన్నీ దీనికి అనుబంధ విషయాలే.

ఇదొక్కటే కాదు.. రాష్ట్రంలో పేద వర్గానికి చెందిన ఏ ఒక్కరు కూడా ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో అనేకానేక పథకాలు తీసుకువచ్చారు జగన్. టైలర్లకు, ఆటోవాళ్లకు, జూనియర్ లాయర్లకు అందరికీ నెలవారీగా కాస్త ఆర్థిక చేయూత అందించే పథకాలను తెచ్చారు. ఏ ఒక్క కుటుంబం కూడా ఇల్లు గడవడానికి వెతుకులాట పడే దుస్థితిలో ఇవాళ రాష్ట్రంలో లేదంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి పథకాల ఫలితమే. 

నవరత్నాలు అంటూ జగన్ ప్రకటించిన పథకాలు పేదల సంక్షేమాన్ని కాంక్షించేవి. ఏ రంగాన్ని కూడా ఆయన విస్మరించలేదు. రైతుల అభ్యున్నతికి పథకాలు తీసుకువచ్చారు. పెట్టుబడి సాయం అందిస్తున్నారు. డ్వాక్రా మహిళలకు పథకాలు తీసుకువస్తున్నారు. అన్నిరకాలుగానూ వారికి చేయూత అందిస్తూ.. వారి వారి వ్యక్తిగత జీవితాల్లో తర్వాత ఉన్నత దశకు చేరుకోవడానికి తాను సహకరిస్తున్నారు.

తండ్రి వైఎస్సార్ లాగానే జగన్ కూడా జనాన్ని ప్రేమించే వ్యక్తి. జనం ప్రేమను కోరుకునే వ్యక్తి. ఆయన ఏ పథకం తీసుకువచ్చినా, ఏ పనిచేసినా, ఏ మాట మాట్లాడినా అందులో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుంది.

అభివృద్ధి అనే పదం కింద చాలా మంది నిర్వచించే చాలా విషయాలు.. ‘జనం’ తర్వాతి ప్రాధాన్యంలోనే జగన్ కు కనిపిస్తాయి. అభివృద్ధి ముసుగులో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు పార్టీ శ్రేణులకు పంచిపెడితే.. ఎక్కడికక్కడ కోట్లాదిరూపాయలను దండుకోవడం చాలా సులువు. కానీ.. జగన్ కేవలం ప్రజలే ఎజెండాగా సంక్షేమ పథకాలకే పెద్దపీట వేశారు. అందించే ప్రతిరూపాయి.. నేరుగా వారి ఖాతాలకే వెళ్లేలా బటన్ నొక్కి ప్రారంభిస్తూ మధ్యలో దళారీలు కాజేయడానికి అవకాశం లేకుండా చేశారు. వృద్ధులకు, వితంతువులకు అందించే పెన్షన్లను ఒకటో తారీఖు నాటికే వారి ఇళ్ల వద్దనే అందజేయాలనే సంకల్పాన్ని ఆయన ఒక యజ్ఞంలాగా పాటిస్తున్నారు. ఆ వర్గాల ప్రేమను చూరగొనగలుగుతున్నారు.

ఉద్యోగాల కల్పన, పరిశ్రమల రాక విషయంలో విశాఖలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఒక ప్రత్యేక అధ్యాయం. నిజానికి జగన్ ఇలాంటి సమ్మిట్ ను ఆలస్యంగా నిర్వహించారు. అయినా అద్భుత స్పందన లభించింది. వందల పరిశ్రమలు రాష్ట్రానికి రానున్నాయి. అయితే.. ఎన్నికల మీద ప్రభావం చూపేలాగా, ఎన్నికలకు ముందే ఆ పరిశ్రమలన్నీ గ్రౌండింగ్ అవుతాయా లేదా? అనేది ప్రశ్న! రెండేళ్ల ముందే ఇలాంటి సమ్మిట్ నిర్వహించి ఉంటే పరిస్థితి ఇంకా గొప్పగా ఉండేది.

ఈ పాటికి పరిశ్రమలు, ఉద్యోగావకాశాలు కూడా వచ్చేసి ఉండేవి. ఆ దిశగా జగన్ ను పల్లెత్తు మాట అనే అవకాశం ఉండేది కాదు. ముందే చెప్పుకున్నట్టు ఆయన ప్రయారిటీ పేద ప్రజలు.. వారికి తొలిప్రాధాన్యం ఇచ్చి, ఇలాంటి వాటన్నింటికీ ద్వితీయ ప్రాధాన్యం ఇచ్చారని, పాలన నాలుగేళ్ల ద్వితీయ భాగంలో అభివృద్ధి అని చెప్పగల అలాంటి వాటిపై దృష్టి సారించారని అనుకోవాలి. 

చీకటి మరకలు

జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో.. తప్పులు కూడా ఉన్నాయి. ఆయనను అభిమానించే ప్రజలు మాత్రమే కాదు కదా.. ఆయన సొంత పార్టీ వారు కూడా సహించలేనివి. తటస్థులు ఖచ్చితంగా ఖండించేవి. కానీ.. ప్రత్యర్థి పార్టీ పట్ల, తనకు కిట్టని వారి పట్ల ఉండే అసహనంతో జగన్మోహన్ రెడ్డి అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. సమరంలో ఉండేప్పుడు.. ఈ అసహనం పరవాలేదు. కానీ నాయకుడిగా ప్రజలు ఆమోదించిన తర్వాత.. అసహనాన్ని వదిలించుకోవాలి. ఈ పని జగన్ చేయలేకపోయారు. అందువల్ల ఆయన చరిత్ర ఎప్పటికీ మరచిపోని కొన్ని విమర్శలను మూటగట్టుకోవాల్సి వచ్చింది.

జగన్ నాలుగేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన వెంటనే.. తొలిరోజుల్లో చేసిన పని ఉండవిల్లిలో చంద్రబాబునాయుడు నివసించే ఇంటి  సమీపంలో ఉన్న ప్రజావేదికను కూల్చేయడం. ఈ ‘కూల్చివేత’ల మీద జగన్ ఎందుకు మనసుపడ్డారో ఎవ్వరికీ అర్థం కాని సంగతి. అందువల్ల ఆయన విధ్వంసక సీఎంగా విమర్శలు పడాల్సి వచ్చింది. 

నాలుగేళ్లలో అనేకమంది తెలుగుదేశం నాయకులకు చెందిన ఆస్తులు నిబంధనలు అతిక్రమించి ఉన్నా, ఆక్రమణలు సాగించి ఉన్నా వాటిని జగన్ కూల్చివేయించారు. వాటన్నింటినీ కూడా ప్రజలు సహిస్తారు. తెలుగుదేశం నాయకులు తాము అధికారంలో ఉన్న రోజుల్లో నిబంధలన్ని తోసిరాజని చెలరేగితే.. వారికి బుద్ధిచెప్పే రోజు ఒకటి వస్తుందని జగన్ నిరూపించారు. 

ఇవాళ వైసీపీ వాళ్లయినా ఆ పాఠం గమనిస్తుంటారు. తమ ప్రభుత్వం ఉందని చెలరేగితే.. రేపు మరోపార్టీ అధికారంలోకి వచ్చాక.. నిబంధనల అతిక్రమణలన్నీ నేలమట్టం అవుతాయని వారు కూడా గ్రహిస్తారు. ఇవాళ జగన్ కూల్చివేతల వల్ల ఆయన సొంత పార్టీ వాళ్లు కూడా అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.

అదంతా మంచి పనే.. కానీ ప్రజావేదికను ఎందుకు కూల్చేశారు? అందులో ఆయనకు లభించిన సంతృప్తి ఏమిటి? అది చంద్రబాబునాయుడు సొత్తు కాదు. ఆయన హయాంలో నిర్మించి ఉండవచ్చు గాక.. కానీ రాష్ట్రం సొత్తు. దానిని ఏ ప్రజా సమావేశ మందిరంగానో.. పేదల హాస్టలుగానో మార్చి వినియోగంలో పెట్టి ఉండొచ్చు. కానీ జగన్ దానిని కూల్పించారు.

అమరావతి రాజధాని విషయంలో జగన్ అనుసరించిన విధానం కూడా సమర్థించలేనిది. ఎందుకంటే.. రైతులు సుమారు 50 వేల ఎకరాలను నగరం నిర్మాణం కోసం ఇచ్చిన తరువాత.. ఆ ప్రాంతంలో ప్రాథమికంగా మౌలిక వసతుల పనులు మొదలైన తరువాత.. తిరిగి వాటిని సేద్యానికి వెనక్కివ్వడం అనేది సాధ్యం కాదు.

జగన్ రాజధానిని విశాఖకు మార్చదలచుకుంటే.. పాలకుడిగా ఆయన ఇష్టం. కానీ అందుకోసం అమరావతిని శిథిలం చేయాల్సిన అవసరం లేదు. అమరావతిలో సగం పూర్తయిన నిర్మాణాల్ని అలా వదిలేయాల్సిన అవసరం లేదు.

ఉదాహరణకు సెక్రటేరియేట్ కోసం చంద్రబాబు అనుకున్న నిర్మాణాన్ని ప్రెవేటు సంస్థల కోసం అప్పగించి ఉంటే ప్రభుత్వానికి లాభం కూడా కలిగి ఉండేది. రాజధాని విశాఖలో ఉండడానికి, అమరావతి నగర నిర్మాణాన్ని పూర్తిచేయడానికి సంబంధం లేదు. చంద్రబాబునాయుడు గ్రాఫిక్స్ అతిశయ వేషాలకు చెల్లుచీటీ ఇచ్చి.. నాణ్యమైన నగరాన్ని ప్రెవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఆయన చేసి ఉండవచ్చు. అలా జరిగి ఉంటే రైతుల వ్యతిరేకత కోర్టు కేసులుకూడా ఉండేవి కాదు. ఆయన కలల మేరకు రాజధాని విశాఖకు ఎప్పుడో తరలిపోయి ఉండేది. ఇప్పుడు అన్నీ సందిగ్ధంలో పడ్డాయి.

జగన్ నాలుగేళ్లలో తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత ఘోరమైనది అన్న క్యాంటీన్లను మూసివేయడం. గతిలేని పేదవాడికి, చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వారికి ఎందరికో అన్న క్యాంటీన్లు కడుపు నింపుతూ వచ్చాయి. ఆ పథకం చంద్రబాబునాయుడు మేథోజనితం ఎంతమాత్రమూ కాదు. ఆయన ఇతర రాష్ట్రాలనుంచి కాపీచేసి అన్న క్యాంటీన్లు మొదలెట్టారు. అదేదో చంద్రబాబు మీద కక్ష తీర్చుకోవడం అన్నట్లుగా జగన్ వాటిని మూసేయించారు. ఆకలి తీర్చుకుంటున్న పేదల ఆక్రోశానికి ఆ రకంగా ఆయన గురయ్యారు. 

ఏకంగా వాటిని మూసేయకుండా.. అవసరమైతే వైఎస్సార్ పేరు పెట్టుకుని పేదలకు అన్నం పెట్టి ఉంటే జగన్ పేరు చెప్పుకుని పేదలు కడుపు నింపుకుంటుండే వాళ్లు. కానీ, చంద్రబాబు మీద ఉన్న ద్వేషం.. ఇలాంటి ఆలోచన రహితమైన నిర్ణయాలు తీసుకునేలా జగన్ ను ప్రేరేపించిందని అనుకోవాలి.

జగన్.. నాలుగేళ్ల పాలనను చాలా సమర్థంగా పూర్తిచేశారు. ఇది ఎన్నికల ఏడాది. ప్రజలను ఎన్నికల దిశగా ఆకర్షించడానికి మరిన్ని సంక్షేమ పథకాలు ఈ ఏడాదిలో పురుడుపోసుకోవచ్చు. ఆల్రెడీ తెలుగుదేశం మహానాడులో చంద్రబాబునాయుడు అలవిమాలిన హామీలతో జగన్ సర్కారుకు సవాలు విసిరారు. చంద్రబాబుకు ప్రజల్లో ఉన్న విశ్వసనీయత తక్కువే అయినప్పటికీ.. వీటిని జగన్ ఉపేక్షించడానికి వీల్లేదు. మంచి పాలనకు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అనే సంగతిని కూడా ఆయన గ్రహించాలి. అభివృద్ధి దిశగా కూడా ఈ ఏడాదిలో ఒకింత శ్రద్ధ పెట్టాలి.

వందిమాగధులు, భజన పరుల మాటలకు పొంగిపోకుండా.. ప్రజల్లో వాస్తవంగా తన పాలన పట్ల ఎలాంటి అసంతృప్తులు వెల్లువెత్తుతున్నాయో వాటిని తెలుసుకునే తత్వాన్ని జగన్ అలవాటు చేసుకోవాలి. వాటిని తీర్చేలా పాలన తీరులో మార్పుచేర్పులు చేసుకోవాలి. అప్పుడు ఆయన కలగంటున్నట్టుగా మరో ముప్పయ్యేళ్లు ప్రజాసేవ చేస్తుండే అవకాశం తప్పకుండా లభిస్తుంది.

.. వెంకట్ అరికట్ల

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?