ఏమో.. కుప్పంలో వైసీపీ గుర్రం ఎగ‌రావ‌చ్చు!

కుప్పంలో చంద్ర‌బాబునాయుడు, పులివెందుల‌లో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఓడిపోతారంటే అతిశ‌యోక్తిగా వుంటుంది. అయితే కుప్పంలో ఏదో తేడా కొడుతోంద‌ని టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అనుమానిస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి కుప్పంపై ప్ర‌త్యేక…

కుప్పంలో చంద్ర‌బాబునాయుడు, పులివెందుల‌లో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఓడిపోతారంటే అతిశ‌యోక్తిగా వుంటుంది. అయితే కుప్పంలో ఏదో తేడా కొడుతోంద‌ని టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అనుమానిస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి కుప్పంపై ప్ర‌త్యేక దృష్టి సారించారు. వై నాట్ కుప్పం, వై నాట్ 175 అనే నినాదాన్ని సాకారం చేసుకునేందుకు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు. వై నాట్ 175ను కాసేపు ప‌క్క‌న పెడితే, కుప్పంలో చంద్ర‌బాబును ఓడించి చ‌రిత్ర సృష్టించాల‌ని సీఎం జ‌గ‌న్ చాలా సీరియ‌స్‌గా ప‌ని చేశారు.

ఈ క్ర‌మంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీని ఘోరంగా ఓడించారు. దీంతో చంద్ర‌బాబును కూడా ఓడించొచ్చ‌నే ధైర్యం, స్ఫూర్తి వైసీపీ శ్రేణుల్లో క‌లిగాయి. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి నేతృత్వంలో ఆప‌రేష‌న్ కుప్పం చేప‌ట్టారు. ఇందులో భాగంగా కుప్పంలో చంద్ర‌బాబు బ‌లం, బ‌ల‌హీన‌త‌ల‌పై ప్ర‌త్యేక‌ దృష్టి సారించారు. చంద్ర‌బాబుకు న‌లుగురు పీఏలు ఉండ‌డం టీడీపీకి బ‌ల‌హీన‌త‌గా మారింది. 

అలాగే కుప్పంలో 35 వేల దొంగ ఓట్ల‌ను చేర్చుకోవ‌డం చంద్ర‌బాబు బ‌ల‌మ‌ని మంత్రి పెద్దిరెడ్డి గుర్తించారు. వాటి ఏరివేత‌లో మంత్రి స‌క్సెస్ అయ్యారు. ఇదే సంద‌ర్భంలో ముల్లును ముల్లుతోనే తీయాల‌ని వైసీపీ చంద్ర‌బాబును స్ఫూర్తిగా కొత్త ఓట్ల చేర్చ‌డంపై పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు చేసింది. ఎన్నిక‌ల నాటికి కుప్పంలో చంద్ర‌బాబును ఓడిస్తామ‌నే వైసీపీ ధీమా వెనుక బ‌ల‌మైన కార‌ణం లేక‌పోలేదు. అయితే కుప్పంలో చంద్ర‌బాబు ఓడిపోతార‌నే ప్ర‌చారం చూసి, బ‌య‌టి స‌మాజం, అలాగే వైసీపీ నాయ‌కుల‌తో స‌హా న‌వ్వుకుంటున్నారు.

కానీ కుప్పంలో బాబును ఓడించాల‌నే ప్ర‌య‌త్నంలో మాత్రం ఎలాంటి లోపం లేదు. వైసీపీకి అభ్య‌ర్థి భ‌ర‌త్ మైన‌స్‌. లేదంటే చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపించే వారు. అయిన‌ప్ప‌టికీ కుప్పంలో చంద్ర‌బాబు సేఫ్ జోన్‌లో ఉన్నారా? అంటే టీడీపీ జ‌వాబు చెప్ప‌లేని ప‌రిస్థితి.

ఒక‌వేళ బాబు బ‌య‌ట ప‌డినా, చావు త‌ప్పి క‌న్ను లొట్ట పోయిన చందమ‌వుతుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. లేదంటే సీఎం జ‌గ‌న్ అనుకున్న‌ట్టే జ‌రిగినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. వైసీపీ పెద్ద‌లు మాత్రం కుప్పంలో చంద్ర‌బాబునాయుడు ఓడిపోతాడ‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు. ఏమో… కుప్పంలో వైసీపీ గుర్రం ఎగ‌రావ‌చ్చామో! ఏ పుట్ట‌లో ఏ పాముందో ఎవ‌రికెరుక‌.