కమలదళానికి రాష్ట్రానికి ఒక దేవుడు కావాలా!?

రాముడుని తమ రాజకీయ అవసరాల కోసం వాడుకోగల పరిస్థితి ఇప్పుడు ముగిసిపోయింది. రామాలయం నిర్మాణం కూడా జరిగిపోయిన తర్వాత ఆ ఘనత మొత్తం తమదే అని చెప్పుకోగలరు తప్ప- రాముడు పేరుతో ప్రజలలో భావోద్వేగాలను…

రాముడుని తమ రాజకీయ అవసరాల కోసం వాడుకోగల పరిస్థితి ఇప్పుడు ముగిసిపోయింది. రామాలయం నిర్మాణం కూడా జరిగిపోయిన తర్వాత ఆ ఘనత మొత్తం తమదే అని చెప్పుకోగలరు తప్ప- రాముడు పేరుతో ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధి పొందడం అనేది ఇకమీదట అంత ఈజీ కాదు. ఐతే ప్రజలను రెచ్చగొట్టడానికి దేవుడిని వాడుకోకుండా ఎన్నికలు ఎదుర్కొనే ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి లేనట్లు ఆ విషయాన్ని పలుచోట్ల వారు ఇప్పటికే నిరూపించుకున్నారు.

మధుర, సోమనాథ్ తదితర ఆలయాల పరిరక్షణ పేరుతో వివాదాస్పద వ్యవహారాలను తిరగతోడి రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నారు. అదే క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్న మాటలను గమనిస్తే ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క కొత్త దేవుడిని వారు వెతుక్కుంటారా అనుమానం కలుగుతోంది. ఒరిస్సాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ అక్కడ బిజూ జనతాదళ్‌ని నిందించడానికి జగన్నాథుడి ఆలయం సురక్షితంగా లేదు అనే ప్రస్తావన తెచ్చారు నరేంద్ర మోడీ!

కొన్నేళ్లుగా ఒరిస్సాలోని ప్రజలందరూ కూడా జగన్నాధుని ఆలయంలోని రత్నభాండాగారం గురించి ఆందోళన చెందుతున్నారని నరేంద్ర మోడీ అంటున్నారు. దీనికి సంబంధించిన తాళం చెవులు కనిపించడం లేదని ఆయన చెబుతున్నారు. మిస్టరీని బయట పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నాట్లు గా నరేంద్ర మోడీ ఆవేదన చెందుతున్నారు. పనిలో పనిగా ఈ తాళం చెవులు తమిళనాడుకు వెళ్లిపోయాయని ఇంకో వివాదానికి బీజం వేశారు.

అయితే ఈ తాళంచెవులు కనిపించడం లేదనే మాటను కూడా ముఖ్యమంత్రికి ముడి పెట్టడం గమనార్హం. నవీన్ పట్నాయక్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారి నమ్మకాలు విశ్వాసాలతో ఆడుకుంటున్నారని నకిలీ తాళాలు ఎవరు చేశారని నరేంద్ర మోడీ ప్రశ్నిస్తున్నారు. మోడీ తీరు చూస్తే ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లాలంటే, ప్రతి రాష్ట్రంలోనూ కమలదళం పట్ల ప్రజలలో అభిమానం ఏర్పడాలంటే ఏదో ఒక దేవుడిని అడ్డు పెట్టుకోవడం అత్యవసరం అని వారు నమ్ముతున్నట్లుగా ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్నికల ప్రచార సమయంలో ఆలయాలలో ఏదో ద్రోహం జరిగిపోతున్నట్లుగా కూటమిని గెలిపిస్తే ఆలయాల రక్షణ బాధ్యత చూసుకుంటామని మాయమాటలు చెప్పిన సంగతి ప్రజలకు గుర్తుండే ఉంటుంది. దేవుడిని ప్రచారాస్త్రంగా వాడుకునే ఇలాంటి అలవాట్లను భాజపా ఎప్పటికి మానుకుంటుందో ఏమో అని ప్రజలు అనుకుంటున్నారు.