Advertisement

Advertisement


Home > Politics - Andhra

బీజేపీకి డిపాజిట్ గల్లంతు... పాపమెవరిది...?

బీజేపీకి డిపాజిట్ గల్లంతు... పాపమెవరిది...?

ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటులో సిట్టింగ్ ఎమ్మెల్సీ బీజేపీ నేత అయిన పీవీఎన్ మాధవ్ పోటీ చేస్తే డిపాజిట్ గల్లంతు అయింది. 2017లో ఇదే సీటు ఆయనను ఎమ్మెల్సీగా చేసింది. అయితే అదంతా ఊరకే ఒక్క బీజేపీతో కాలేదు. ఆనాడు కేంద్రమంత్రిగా ఉన్న పెద్దాయన  కాలికి బలపం కట్టుకుని బీజేపీ గెలుపు కోసం తిరిగారు.

ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పూర్తి దన్నుగా నిలిచింది. అలా బీజేపీ గెలిచింది. గిర్రున ఆరేళ్ళు తిరిగేసరికి బీజేపీ ఒంటరిది అయిపోయింది. పేరుకు మిత్రపక్షంగా ఉన్న జనసేన మద్దతుగా ఒక్క ప్రకటన చేయలేదు. సోము వీర్రాజు జనసేన మద్దతు మాకే అని ఎన్ని సార్లు గొంతెత్తి మాట్లాడినా ఆ వైపు నుంచి నో సౌండ్.

పైగా వైసీపీని ఓడించండి అంటూ ఒక స్టేట్మెంట్ జనసేన వైపు నుంచి వచ్చింది. ఇక్కడ జనసేనను తప్పు పట్టాల్సింది లేదు. మిత్రపక్షంతో సఖ్యత నెరపలేని బీజేపీని అనుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ గా జనసేన బీజేపీల మధ్య పొత్తు ఉంటే ఒక్క ఓటు కూడా ఇటు వైపు బదిలీ కాలేదు. కానీ ఏ పొత్తు లేకపోయినా జనసేన నుంచి టీడీపీ అభ్యర్ధికి ఓట్లు బాగా పడ్డాయని ప్రచారం అయితే సాగుతోంది.

ఇంతలా రెండు పార్టీల మధ్య గ్యాప్ రావడానికి కారణాలను కమలనాధులు ఇపుడు విశ్లేషించుకున్నా ధరావత్తు గల్లంతు అయిన తరువాత చేసేది ఏమీ ఉండదు. చెల్లని ఓట్లు ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పన్నెండు వేల దాకా వస్తే దాన్ని సైతం దాటలేని అవస్థలో బీజేపీ కేవలం పదకొండు వేల దగ్గరే ఆగిపోయిందంటే అయ్యో పాపం అనిపించకమానదు.

తెలుగుదేశం రాజకీయం ముందు  వైసీపీనే తట్టుకోలేకపోయిన వేళ బీజేపీ సిట్టింగ్ సీటుని పోగొట్టుకోవడం పెద్ద విషయం కాదు. చివరి నిముషంలో అభ్యర్ధిని మార్చి మరీ జనసేన వైపు నుంచి సానుకూలత ఉండేలా చూసుకున్న టీడీపీ వ్యూహాలే విజయాన్ని అందిస్తే డిపాజిట్టు కూడా దక్కించుకోలేని దైన్యంలో కమలాన్ని నెట్టేశాయి. రాజకీయాల్లో పాపం పుణ్యం ఉండవు కానీ అయ్యో పాపం అని అనుకున్నా ఓదార్పు మాటలే అవుతాయి. ఎవరుకి వారు చేజేతులా చేసుకున్నదే ఇదంతా అనుకుంటేనే రేపటి రోజున ఓడిన చోట విజయం దక్కుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?