ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు మ‌న‌శ్శాంతి క‌ర‌వు!

కేంద్ర ప‌రిపాల‌న ట్రైబ్యున‌ల్ (క్యాట్‌) ఉత్త‌ర్వులు సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు (ఏబీవీ)కు అనుకూలంగా రావ‌డంతో, ఇక ఆయ‌న‌కు ఇబ్బందులు తొల‌గిన‌ట్టే అనుకున్నారు. ఏదో ఒక‌శాఖ‌లో ఆయ‌న‌కు పోస్టింగ్ ఇస్తార‌ని భావించారు. అయితే…

కేంద్ర ప‌రిపాల‌న ట్రైబ్యున‌ల్ (క్యాట్‌) ఉత్త‌ర్వులు సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు (ఏబీవీ)కు అనుకూలంగా రావ‌డంతో, ఇక ఆయ‌న‌కు ఇబ్బందులు తొల‌గిన‌ట్టే అనుకున్నారు. ఏదో ఒక‌శాఖ‌లో ఆయ‌న‌కు పోస్టింగ్ ఇస్తార‌ని భావించారు. అయితే ఏబీవీ, ఆయ‌న్ను వెన‌కేసుకొచ్చే రాజ‌కీయ పార్టీల‌కు మింగుడుప‌డ‌ని విధంగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంది. త్వ‌ర‌లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తున్న ఏబీవీ… క‌నీసం ఉద్యోగ చివ‌రి రోజుల్లో అయినా కాస్త మ‌న‌శ్శాంతిగా గ‌డుపుదామ‌ని అనుకున్న‌ప్ప‌టికీ, అది వీలు కావ‌డం లేదు.

ఏబీవీకి నిద్ర‌లేని రాత్రులే మిగిలాయి. క్యాట్ ఉత్త‌ర్వుల‌ను స‌వాల్ చేస్తూ ఏపీ స‌ర్కార్ హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో క‌థ మ‌ళ్లీ మొద‌టికొచ్చిన‌ట్టైంది. రెండోసారి ఏబీవీని స‌స్పెండ్ చేస్తూ తామిచ్చిన ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేయ‌డంతో పాటు ఆయ‌న్ను విధుల్లోకి తీసుకోవాల‌ని క్యాట్ ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను కొట్టి వేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హైకోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌లో కోరారు. క్యాట్ ఉత్త‌ర్వులు చ‌ట్ట విరుద్ధంగా ఉన్నాయ‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. 

ఏబీవీ సస్పెన్షన్‌కు తగిన ఆధారాలున్నాయ‌ని, వాటిని గుర్తించ‌డంలో క్యాట్ విఫ‌ల‌మైంద‌ని ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న‌పై క్రిమిన‌ల్ కేసులున్నాయ‌ని, ఆయ‌న్ను విధుల్లోకి తీసుకుంటే దర్యాప్తు  ప్ర‌భావం చూపుతుంద‌ని కోర్టు దృష్టికి ఏపీ స‌ర్కార్ తీసుకెళ్లింది. కావున ఆయ‌న‌కు సంబంధించి క్యాట్ ఉత్త‌ర్వుల‌ను నిలుపుద‌ల చేయాలంటూ పిటిష‌న్‌లో ఏపీ ప్ర‌భుత్వం కోర‌డం విశేషం. ఈ పిటిష‌న్ 23న విచార‌ణ‌కు రానుంది. 

తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే … ఏబీవీ స‌స్పెన్ష‌న్‌లోనే ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే అవ‌కాశం వుంది. ఏబీవీకి పోస్టింగ్ ఇచ్చే ఉద్దేశం ప్ర‌భుత్వానికి లేద‌ని తాజా పిటిష‌న్‌తో స్ప‌ష్ట‌మైంది. దీంతో ఏబీవీకి న్యాయం చేయాలంటూ ఆన్‌లైన్ ఉద్య‌మం మొద‌లు పెట్టిన వారికి తీవ్ర నిరాశే ఎదురైంది. చంద్ర‌బాబు హ‌యాంలో ప‌రిధికి మించి, అన్నీ తానే అన్న‌ట్టు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీవీ చేయ‌రాని త‌ప్పుల‌న్నీ చేసి, ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నార‌ని ఆయ‌న్ను వ్య‌తిరేకించే వాళ్లు అంటున్నారు.