తమకు నమ్మకంగా ఉద్యోగులు ఓట్లు వేసి వుంటారని కూటమి భావిస్తోంది. తాజాగా పోస్టల్ బ్యాలెట్లపై కూటమిలో టెన్షన్ మొదలైంది. గెజిటెడ్ అధికారి సంతకం వుంటేనే పోస్టల్ బ్యాలెట్‌ను కౌంటింగ్ అధికారులు పరిగణలోకి తీసుకుంటారు. సంతకం లేకపోతే చెల్లని ఓటు కింద పక్కన పడేస్తారు. పోస్టల్ బ్యాలెట్‌పై అవగాహన లేకపోవడంతో గెజిటెడ్ అధికారి సంతకం లేకుండానే చాలా మంది ఓట్లు వేసి వుంటారనే చర్చకు తెరలేచింది.
దీంతో గెజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా, ఆ ఓటును పరిగణలోకి తీసుకోవాలంటూ ఈసీకి కూటమి నేతలు విన్నవించారు. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్లపై వారి భయం బయటపడింది. తమకు పోస్టల్ బ్యాలెట్లలో అనుకూలత వుంటుందనే ఆత్రుతతోనే గెజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా చెల్లే ఓటుగా చూడాలని విన్నించారనే చర్చకు తెరలేచింది.
పోస్టల్ బ్యాలెట్ల ఓట్లకు సంబంధించి గతానికి, ఇప్పటికీ తేడా వుంటుంది. అందుకే ఈ దఫా ఎక్కువగా చెల్లుబాటు అయ్యే అవకాశాలు లేవనే ఆందోళన కూటమిలో నెలకుంది. 2019లో 2.95 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటిలో 56,545 ఓట్లు చెల్లలేదు. అంటే 20 శాతం ఓట్లు మరుగున పడ్డాయి.
ఈ దఫా 4.44,218 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేశారు. గతంలో చాలా మంది ఉద్యోగులు రాజకీయ నాయకులకు పోస్టల్ బ్యాలెట్‌ను అమ్ముకునేవారు. దీంతో రాజకీయ నాయకుల చేతికే పోస్టల్ బ్యాలెట్ ఇచ్చేవారు. నాయకులే ఆ ఓట్లను చెల్లుబాటు అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ ఈ దఫా ఉద్యోగులే నేరుగా నిర్దేశించిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓట్లు వేయాల్సి వచ్చింది. ఉద్యోగులు గెజిటెడ్ అధికారి సంతకం గురించి ఆలోచించి వుండరని కూటమి నేతల భయం. పోస్టల్ బ్యాలెట్లన్నీ తమకు అనుకూలంగా వుంటాయనే నమ్మకంతో, ఒకవేళ సంతకం లేకపోయినా పరిగణలోకి తీసుకోవాలంటూ అభ్యర్థించడం చర్చనీయాంశమైంది.
ఈ దఫా ఉద్యోగులు తమ ఓటు తామే వేసుకోవడం వల్ల చాలా వరకు చెల్లకుండా పోయే అవకాశాలే ఎక్కువని అంటున్నారు. అదే జరిగితే ఉద్యోగులు నవ్వులపాలు కావడం ఖాయం. ఎందుకంటే ఓటు వేసుకోవడం కూడా చేతకాని వారు… ప్రజలకు ఏం సేవలందిస్తారనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈసీకి పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై వినతి నేపథ్యంలో సరికొత్త చర్చకు దారి తీసింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఈసీ నిర్ణయం తీసుకునే అవకాశం వుండదు. ఒక పార్టీకి అనుకూలత లేదా వ్యతిరేకత కారణాలతో ఈసీ తన నిబంధనలను తానే ఉల్లంఘిస్తుందని ఎవరూ అనుకోవడం లేదు.