Advertisement

Advertisement


Home > Politics - Andhra

గోడమీది పిల్లి.. ఇప్పుడైనా డిసైడవుతుందా?

గోడమీది పిల్లి.. ఇప్పుడైనా డిసైడవుతుందా?

పవన్ కల్యాణ్ తెలుగుదేశాన్ని గెలిపించిన పట్టభద్రులను అభినందించారు. తెలుగుదేశం తరఫున గెలిచిన వారికి, తెలుగుదేశాన్ని గెలిపించడానికి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ కూడా పవన్ కల్యాణ్ పేరుపేరునా అభినందనలు తెలిపారు. మొత్తానికి తెలుగుదేశం విజయం పట్ల పవన్ కల్యాణ్ పండగ చేసుకుంటున్నారు. 

ఇంకా నయ్యం.. చంద్రబాబు నాయుడును గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు కూడా తెలియజేయలేదు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. ఈ ప్రకటనను జాగ్రత్తగా గమనిస్తే , పవన్ కల్యాణ్ లోని గోడమీది పిల్లి వైఖరికి ఇకనైనా తెరపడుతుందనే అభిప్రాయం మనకు కలుగుతుంది.

పవన్ కల్యాణ్ ప్రకటనలో ఒక మాట చెప్పారు. ‘‘సందిగ్దంలో ఉన్నవారికి ఈ ఎన్నిక ద్వారా పట్టభద్రులు దారిచూపారు’’ అని అందులో పేర్కొన్నారు. ఆయన దృష్టిలో-- సందిగ్ధంలో ఎవరున్నారు? ఈ వాక్యం స్వయంగా ఆయన గురించి ఆయన రాసుకున్నదే. సందిగ్ధంలో ఉన్నది పవన్ కల్యాణే. గోడమీది పిల్లిలాగా అటు దూకాలా, ఇటు దూకాలా తేల్చుకోలేకుండా సతమతం అవుతున్నది స్వయంగా పవర్ స్టార్ మాత్రమే. అందుకే ఈ ఎన్నికల ఫలితాలు తనకు దారిచూపించినట్లుగా ఆయన సంబరపడుతున్నట్టుంది. 

పవన్ కల్యాణ్ కేంద్రంలో అత్యంత బలమైన భారతీయ జనతా పార్టీ కూటమితో జట్టు కట్టి ఉన్నారు. అలాగని భాగస్వామి పార్టీకింద వారినుంచి ఎలాంటి మర్యాదను పొందలేకపోతున్నారు. వారు బలమైన పార్టీ కావడం వలన.. చటుక్కున వారిని విడిచిపెట్టి రావాలంటే భయం. 

మరో వైపు తనను దత్తత తీసుకున్న చంద్రబాబునాయుడు మీద అపారమైన ప్రేమ, గౌరవం, ఆయన పరిపాలన సామర్థ్యాల మీద నమ్మకం! ఆయనను మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి తన శక్తివంచన లేకుండా ప్రయత్నించాలనే కోరిక. ఈ రెండు విరుద్ధ భావనల మధ్య పాపం పవన్ కల్యాణ్ ఇన్నాళ్లుగా ‘సందిగ్ధం’లో ఉన్నారు. 

ఇప్పుడు పట్టభద్రుల తీర్పు మళ్లీ మళ్లీ సార్వత్రిక ఎన్నికల్లో కూడా పునరావృతం కాగల మ్యాజిక్ అని ఆయన నమ్ముతున్నారు. అందుకే  ఈ పలితం తనకు దారిచూపిందని ఆయన భావిస్తున్నారు. అన్నిచోట్ల డిపాజిట్లు కోల్పోయిన బిజెపి తో కలిసి ఉండడం వృథా అనుకుంటున్నారు. 

ఇకనైనా పవన్ కల్యాణ్ లోని గోడమీది పిల్లి వాటం ఒక నిర్ణయం తీసుకుంటుందని, బహిరంగంగా ప్రకటించి తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకుంటుందని అనుకోవచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?