Advertisement

Advertisement


Home > Politics - Andhra

ప‌వ‌న్ క‌ల్యాణ్ కు క‌మ్మ నేత ఆఫ‌ర్.. ఓకేనా!

ప‌వ‌న్ క‌ల్యాణ్ కు క‌మ్మ నేత ఆఫ‌ర్.. ఓకేనా!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ మ‌ధ్య తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు వ‌ద్ద‌కు వెళ్లిన‌ప్పుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌదరి ఒక ప్ర‌తిపాద‌న చేశార‌ట‌. మ‌రి ఆ ప్ర‌తిపాద‌న స‌ర‌దాగా చేసిందే అయినా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయం గురించి టీడీపీ వాళ్లు ఎలా ఆలోచిస్తున్నార‌నే విష‌యంపై అది స్ప‌ష్ట‌త‌ను ఇస్తుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేస్తే, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే త‌ను గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన సీటును త్యాగం చేయ‌డానికి రెడీ అన్నార‌ట ప్ర‌భాక‌ర్ చౌద‌రి. ఈయ‌న అనంత‌పురం మాజీ ఎమ్మెల్యే. 2014 ఎన్నిక‌ల్లో ఒక‌సారి ఈయ‌న నెగ్గారు. 2019లో అక్క‌డే పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. ఇదీ ప్ర‌భాక‌ర్ చౌద‌రి చ‌రిత్ర‌. మరి ఈ మాత్రం దానికి ఆయ‌న అనంత‌పురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ కు త్యాగం చేస్తార‌ట‌. మ‌రి ఇలాంటి త్యాగ‌ధ‌నులు ప‌వ‌న్ క‌ల్యాన్ కు రాజ‌కీయ భ‌విత‌వ్యాన్ని ఇవ్వాల‌న‌మాట‌!

ప్ర‌త్యేకించి అనంత‌పురం అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గ‌మే ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యంలో ఎందుకు ప్ర‌తిపాద‌న‌లోకి వ‌స్తుందంటే అక్క‌డ బ‌లిజ‌ల జ‌నాభా గ‌ట్టిగా ఉంటుంది. అనంత‌పురం టౌన్లో బ‌లిజ‌లవి దాదాపు అర‌వై వేల ఓట్ల వ‌ర‌కూ ఉంటాయి. ఇదీ ప‌వ‌న్ క‌ల్యాణ్ కూ అనంత‌పురం అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉన్న అనుబంధం! గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడూ ఇలాంటి విశ్లేష‌ణ‌లే సాగాయి. అనంత‌పురం అర్బ‌న్ లో బ‌లిజ ఓట్లు ఎక్కువ కావ‌డంతో ఈ సామాజిక‌వ‌ర్గం నుంచి ప్ర‌జారాజ్యం పార్టీ త‌ర‌ఫున ఉత్సాహంగా పోటీ చేశారొక‌రు. అయితే అర‌వై వేల బ‌లిజ‌ల ఓట్లు ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జారాజ్యం పార్టీ అభ్య‌ర్థికి 28 వేల ఓట్లు ప‌డ్డాయి. ప్రజారాజ్యానికి కేవ‌లం బ‌లిజ‌లే ఓట్లు వేసి ఉండ‌రు క‌దా! చిరంజీవి అభిమానగ‌ణం, చిరంజీవి ని రాజ‌కీయ నేత‌గా చూసిన అన్ని సామాజిక‌వ‌ర్గాల వారివి క‌లిపి 28 వేల ఓట్లు ప్ర‌జారాజ్యం పార్టీ అభ్య‌ర్థికి వ‌చ్చాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ సీట్లో విజ‌యం సాధించింది.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో అనంత‌పురం అర్బ‌న్ లో జ‌న‌సేన‌కు ప‌ది వేల ఓట్లు వ‌చ్చాయి! క‌మ్యూనిస్టు పార్టీలు, బీఎస్పీ ల‌తో క‌లిసి గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేసింది. అనంత‌పురం అర్బ‌న్ లో క‌మ్యూనిస్టుల‌కూ స్థిరంగా నాలుగైదు వేల ఓట్లు ఉండ‌నే ఉంటాయి. క‌మ్యూనిస్టు కాల‌నీలే ఉన్నాయి టౌన్లో. ఇలా క‌మ్యూనిస్టుల బ‌లం క‌లిసి రావ‌డంతో జ‌న‌సేన‌కు ప‌ది వేల ఓట్లు వ‌చ్చాయ‌ప్పుడు. గ‌త ఎన్నిక‌ల‌ప్పుడూ టౌన్లో బ‌లిజ‌ల ఓట్లు అర‌వై వేల స్థాయిలోనే ఉన్నాయి. అయితే జ‌న‌సేన‌కు వ‌చ్చిన ఓట్లు ప‌ది వేలు, అది కూడా అన్ని కులాల‌వీ క‌లిపి!

మ‌రి ఇందు మూలంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. బ‌లిజ‌లంతా సాలిడ్ గా జ‌న‌సేన‌కు వేసేస్తారనుకోవ‌డం భ్ర‌మ‌! ఇప్ప‌టికీ బ‌లిజ‌లు అన్ని పార్టీల వైపూ ఉన్నారు. కొంద‌రు తెలుగుదేశం కూడా! మెజారిటీ బ‌లిజ‌లు తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారు రాయ‌ల‌సీమ‌లో! అనంత‌పురం అర్బ‌న్ ప‌రిస్థితి కూడా ఇంతే. అర‌వై వేల బ‌లిజ ఓట్ల‌లో మెజారిటీ పొందేది తెలుగుదేశం పార్టీనే. ఈ ఓట్లే అనంత‌పురం అర్బ‌న్ లో టీడీపీకి పునాది. ఎమ్మెల్యే ప‌ద‌వులు, మున్సిప‌ల్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వులు.. ఇలాంటి ప‌ద‌వుల‌న్నీ క‌మ్మ వాళ్లకే సొంతం అవుతాయి. అయితే అనంత‌పురంలో టీడీపీకి ఊపిరి మాత్రం బ‌లిజ‌లే.

బీసీలు, ఎస్సీ-ఎస్టీ, మైనారిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్ర‌ధాన ఓటు బ్యాంకు. తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థులు క‌మ్మ వాళ్లేఅయినా టౌన్లో క‌మ్మ వాళ్ల జ‌నాభా రెండు మూడు శాతం కూడా ఉండ‌దు. బ‌లిజ‌ల‌కు తెలుగుదేశం పార్టీ ఛాన్సు ఇచ్చి కూడా చాలా కాలం అయ్యింది. బ‌లిజ అయిన మ‌హాల‌క్ష్మీ శ్రీనివాస్ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున ఒక ద‌శ‌లో భారీగా ఖ‌ర్చులు పెట్టుకున్నారు. అయితే ఆయ‌న తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున నెగ్గ‌లేక‌పోయారు. 2009 ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. ఆ త‌ర్వాత టీడీపీ ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టేసింది. దీంతో ఆయ‌న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇలా అనంత‌పురం అర్బ‌న్ లో బ‌లిజ‌ల జ‌నాభా భారీగా ఉన్నా తెలుగుదేశం పార్టీకి వారు చాలా వ‌ర‌కూ మ‌ద్ద‌తుగా నిలుస్తున్నా.. మెజారిటీ ఓట‌ర్లు జై తెలుగుదేశ‌మే అంటున్నా.. నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో మాత్రం వారికి అవ‌కాశం ద‌క్క‌లేదు. అయిన‌ప్ప‌టికీ తెలుగుదేశాన్నే వారు అట్టిపెట్టుకుని ఉన్నారు.

మ‌రి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో వేరే బ‌లిజ‌ల‌కు అవ‌కాశం ద‌క్క‌నివ్వ‌ని ప్ర‌భాక‌ర్ చౌద‌రి, ఇప్పుడు త‌న‌కు టికెట్ వ‌ద్ద‌ని సైతం చెబుతూ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఎమ్మెల్యే టికెట్ ను ఆఫ‌ర్ చేశారు. మ‌రి ఈ చౌద‌రి ఆఫ‌ర్ ను  ప‌వ‌న్ క‌ల్యాణ్ స్వీక‌రిస్తారేమో చూడాలి! ఒక‌వేళ అనంత‌పురం అర్బ‌న్ నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీకి ప్ర‌భాక‌ర్ చౌద‌రితో పాటు చంద్ర‌బాబు కూడా అవ‌కాశం ఇచ్చినా ప‌వ‌న్ క‌ల్యాణ్ గెలుపు వ‌న్ సైడెడ్ కాక‌పోవ‌చ్చు. ఎందుకంటే పొత్తులో భాగంగా ఈ సీటు జ‌న‌సేన‌కు ద‌క్కితే బ‌లిజ‌ల ఓటింగ్ గ‌ట్టిగా ప‌డినా, సంప్ర‌దాయ టీడీపీ ఓట్లు మాత్రం ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ప‌డే అవ‌కాశాలు ఉండ‌వు!.

టీడీపీ మ‌ద్ద‌తు ఉండి పోటీ చేసినా అనంత‌పురం అర్బ‌న్ లో గెలుపు కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ళ్లీ చాలా పాట్లే ప‌డాల్సి వ‌స్తుంది. మ‌రో గాజువాక రిజ‌ల్ట్ వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేదు. ఏతావాతా అనంత‌పురం అర్బ‌న్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఏ ర‌కంగా చూసినా సేఫ్ బెట్ కాదు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?