మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిది రాజకీయంగా విచిత్ర పరిస్థితి. ఇప్పటికి వరుసగా ఐదుసార్లు ఓటమిపాలయ్యారు. వరుసగా మూడు సార్లు ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు సీట్లు ఇచ్చేది లేదని టీడీపీ మహానాడులో యువ నాయకుడు లోకేశ్ బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమిరెడ్డికి ఇక టికెట్ లేనట్టే అని అప్పట్లో చర్చ జరిగింది. తాజాగా లోకేశ్‌ను ఆకాశమే హద్దుగా సోమిరెడ్డి పొగడడంతో… ఊరుకో సామి యువ నాయకుడు సిగ్గుపడతారనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి.
1999లో చివరిసారిగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఆయన్ను గెలుపు దూరం పెడుతూ వస్తోంది. 2004, 2009, 2014, 2019లలో వరుసగా నాలుగుసార్లు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఓడిపోతూనే వచ్చారు. 2012లో కోవూరులో జరిగిన ఉపఎన్నికలో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తన సమీప బంధువైన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ టీడీపీ అధికారంలోకి రాగానే సోమిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడంతో పాటు వ్యవసాయశాఖ మంత్రిత్వ బాధ్యతల్ని చంద్రబాబు అప్పగించారు. అయితే పార్టీకి భారంగా మారిన సోమిరెడ్డి లాంటి వాళ్లను విడిపించుకోడానికి లోకేశ్ కసరత్తు చేస్తున్నారని సమాచారం.
అయితే లోకేశ్‌ను ప్రసన్నం చేసుకుంటే, వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం వుందని ఆయన నమ్ముతున్నారు. లోకేశ్ పాదయాత్రను పురస్కరించుకుని, ఇంతకంటే మంచి తరుణం రాదనే ఉద్దేశంతో కాబోలు యువనాయకుడిపై సోమిరెడ్డి పొగడ్తలకు దిగారు. సోమిరెడ్డి పొగడ్తలకు లోకేశ్ సిగ్గుపడతారనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. లోకేశ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ యువ నాయకుడిగా లోకేశ్ అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పుకొచ్చారు.
రాణించడం అంటే ఏ విధంగానో ఆయనే సమాధానం చెప్పాలి. లోకేశ్ పాదయాత్రను సాహసయాత్రగా సోమిరెడ్డి అభివర్ణించడం గమనార్హం. ఏ కోణంలో సాహసయాత్ర అని చెబుతున్నారో సోమిరెడ్డికే తెలియాలి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్, చంద్రబాబు నాయుడు, వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ పాదయాత్రలు చేశారు. వైఎస్ షర్మిల తెలంగాణలో ఇప్పుడు కూడా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ సర్కార్ అడ్డంకులు సృష్టించడంతో అర్ధంతరంగా పాదయాత్ర ఆగింది. తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ఏదో ఒక సాకు చెప్పి వరంగల్ పోలీసులు ఆమెను తిరగనివ్వడం లేదు. ఈ నేపథ్యంలో లోకేశ్ పాదయాత్ర సాహసయాత్ర అని చెప్పడం వెనుక వ్యంగ్యం ఏమైనా దాగి వుందా? అని కొందరు అనుమానిస్తున్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు జగన్ చేసిన పాదయాత్రలు కేవలం రాజకీయ యాత్రలు మాత్రమే అని సోమిరెడ్డి అన్నారు. కానీ అందుకు భిన్నంగా లోకేశ్ పాదయాత్ర ప్రత్యేకత ఏంటో సోమిరెడ్డి చెప్పాల్సి వుంది. ఏపీలో అరాచకాలను ఎదుర్కోవాలంటే లోకేశ్ పాదయాత్ర అవసరమని ఆయన సెలవిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 5 కోట్ల మంది ప్రజలు, లోకేశ్ పాదయాత్ర కోసం ఎదురు చూస్తున్నారని సోమిరెడ్డి చెప్పిన మాటలకు ఎవరైనా పడిపడి నవ్వకుండా ఉంటారా? లోకేశ్ గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపోయి, రానున్న రోజుల్లో గెలుస్తారో, లేదో కూడా తెలియని పరిస్థితి. ఓడిపోయిన లోకేశ్ అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరిస్తుండడం, ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు సోమిరెడ్డి లాంటి సీనియర్ నేతలు సాగిల పడడం చూస్తే… ఏం ఖర్మరా బాబు అని అనుకోవాల్సిన పరిస్థితి.