హైవేపై కారు ఆపి రీల్స్ చేసింది, చివరికి…

నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే హైవే అది. ఆ హైవేపై కారులో వెళ్తోంది వైశాలి చౌదరి. సడన్ గా ఆ ప్లేస్ ఎందుకో ఆమెకు బాగా నచ్చింది. వెంటనే కారు నడిరోడ్డుపై ఆపేసింది. కారులోంచి…

నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే హైవే అది. ఆ హైవేపై కారులో వెళ్తోంది వైశాలి చౌదరి. సడన్ గా ఆ ప్లేస్ ఎందుకో ఆమెకు బాగా నచ్చింది. వెంటనే కారు నడిరోడ్డుపై ఆపేసింది. కారులోంచి దిగి సెల్ ఫోన్ కెమెరా తీసి ఓ వీడియో చేసింది. ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ గా ఆ వీడియోని పోస్ట్ చేసింది. ఇన్ స్టా ఇన్ ఫ్లూయెన్సర్ వైశాలి చేసిన ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఆమెకు మంచి వ్యూస్ కూడా వచ్చాయి. దానితో పాటు 17వేల రూపాయల చలానా కూడా వచ్చింది.

బిజీ రోడ్డులో కారు ఆపి ఆమె చేసిన రీల్స్ వీడియో పోలీసులను కూడా ఆకట్టుకుంది. ఘజియాబాద్ పోలీసులు ఆమెకు 17వేల రూపాయలు చలానా కట్టాలంటూ నోటీసులు పంపించారు. ఇకపై రోడ్లమీద ఇలాంటి వేషాలు వేయొద్దని హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్ లోని సహిదాబాద్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఘజియాబాద్ పోలీసులు ఆమె రీల్స్ లో పోస్ట్ చేసిన వీడియోని, ఆమెకు పంపించిన చలానాని కూడా ట్విట్టర్లో షేర్ చేశారు. దీంతో వైశాలి మరింత పాపులర్ అయింది.

ఎక్కడ పడితే అక్కడ రీల్స్..

గతంలో ఢిల్లీ మెట్రోలో రీల్స్ చేసిన ఓ యువతి ఇలాగే చీవాట్లు తిన్నది. అంతకు ముందు పబ్లిక్ ప్లేస్ లలో టిక్ టాక్ చేస్తూ చాలామంది, తమ తోటివారిని ఇబ్బంది పెట్టేవారు. యూనిఫామ్ లో టిక్ టాక్ చేసి కొంతమంది పోలీసులు కూడా క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్నారు. టిక్ టాక్ ని నిషేధించడంతో ఆ వ్యసనం తగ్గిపోయి, ఇప్పుడంతా ఇన్ స్టా రీల్స్ పై పడ్డారు.

రీల్స్ వీడియోలతో ఎక్కువమందిని ఆకట్టుకుని సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లుగా మారేందుకు యువత తంటాలు పడుతోంది. ఈ క్రమంలోనే ఇలాంటి సాహసాలతో కొంతమంది అమ్మాయిలు పోలీసు నోటీసులు అందుకుంటున్నారు. పాజిటివ్ గా అంతంతమాత్రంగా ఉన్న క్రేజ్ ని ఇలాంటి నెగెటివ్ విషయాలతో అమాంతం పెంచేసుకుంటున్నారు. ఒకరకంగా 17వేల రూపాయల జరిమానా.. వైశాలికి అంతకు మించి పబ్లిసిటీ తెచ్చిపెట్టిందనే చెప్పుకోవాలి.