ర‌ఘురామ కావాలో… నేనో తేల్చేకోండి!

ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉండి టీడీపీలో ముస‌లం పుట్టింది. టీడీపీకి కంచుకోట అయిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రాజుల మ‌ధ్య పోరు న‌డుస్తోంది. ఇప్ప‌టికే టీడీపీ అభ్య‌ర్థిగా సిటింగ్ ఎమ్మెల్యే రామ‌రాజు పేరు ప్ర‌క‌టించారు. ఈయ‌న‌కు…

ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉండి టీడీపీలో ముస‌లం పుట్టింది. టీడీపీకి కంచుకోట అయిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రాజుల మ‌ధ్య పోరు న‌డుస్తోంది. ఇప్ప‌టికే టీడీపీ అభ్య‌ర్థిగా సిటింగ్ ఎమ్మెల్యే రామ‌రాజు పేరు ప్ర‌క‌టించారు. ఈయ‌న‌కు టికెట్ ఇవ్వ‌డంతో మాజీ ఎమ్మెల్యే శివ‌రామ‌రాజు స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో దిగుతానంటూ నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా ప్ర‌చారం చేసుకుంటున్నారు.

ఈ స‌మ‌స్య‌తోనే స‌త‌మ‌తం అవుతున్న టీడీపీకి న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు చేరిక‌తో అద‌న‌పు గొడ‌వ తోడైంది. ర‌ఘురామ‌కృష్ణంరాజుకు టికెట్ ఇస్తార‌నే ప్ర‌చారంతో సిటింగ్ ఎమ్మెల్యే రామ‌రాజు, ఆయ‌న అనుచ‌రులు భ‌గ్గుమంటున్నారు. ఒక‌వేళ సిటింగ్ ఎమ్మెల్యే అయిన త‌న‌కు కాద‌ని ర‌ఘురామకృష్ణంరాజుకు సీటు ఇస్తే, పార్టీ మారుతాన‌నే సంకేతాలు రామ‌రాజు పంపారు.

రామ‌రాజు త‌న అనుచ‌రుల‌తో వ‌రుస‌గా ఆత్మీయ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. రెండు రోజుల క్రితం నిర్వ‌హించిన ఆత్మీయ స‌మావేశంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పోటీలో వుండాలంటూ ఆయ‌న‌పై అనుచ‌రులు ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆయ‌న బ‌రిలో దిగేందుకు మాన‌సికంగా సిద్ధ‌మ‌య్యారు. గురువారం సాయంత్రం మ‌రోసారి రామ‌రాజు నేతృత్వంలో ఆత్మీయ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. టీడీపీ అధిష్టానానికి ఫైన‌ల్ వార్నింగ్ ఇచ్చే అవ‌కాశాలున్న‌ట్టు స‌మాచారం.

ర‌ఘురామ‌కృష్ణంరాజు, ఐదేళ్లుగా టీడీపీని కాపాడుకొస్తున్న త‌న‌లో ఎవ‌రు కావాలో తేల్చుకోవాల‌నే హెచ్చ‌రిక‌ను చంద్ర‌బాబుకు పంప‌డానికి రామ‌రాజు సిద్ధ‌మైన‌ట్టు తెలిసింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఉండి అభ్య‌ర్థిని మారుస్తున్న‌ట్టు టీడీపీ అధిష్టానం ప్ర‌క‌టించ‌లేదు. కానీ ర‌ఘురామ‌కృష్ణంరాజును టికెట్ ఇస్తామనే హామీతోనే చేర్చుకున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ర‌ఘురామ చేరిక టీడీపీలో ర‌గ‌డ‌కు దారి తీసింది.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో విభేదించి నాలుగేళ్లుగా టీడీపీకి నైతికంగా ర‌ఘురామ అండ‌గా నిలిచార‌ని ఆ పార్టీలోని కొంద‌రు బ‌లంగా వాదిస్తున్నారు. ర‌ఘురామ‌కు టికెట్ ఇవ్వ‌క‌పోతే టీడీపీపై నెగెటివ్ సంకేతాలు పోతాయ‌నే వాద‌న నేప‌థ్యంలో ఎలాగైనా ఆయ‌నకు టికెట్ ఇవ్వాల‌ని చంద్ర‌బాబు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అయితే ఉండిలో క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు రివ‌ర్స్ అయ్యాయి. ఈ ప‌రిణామాలు ఎలాంటి ప‌రిస్థితుల‌కు దారి తీస్తాయో అనే భ‌యం టీడీపీని వెంటాడుతోంది. అందులోనూ ఉండి టీడీపీకి కంచుకోట‌. అలాంటి నియోజ‌క‌వ‌ర్గాన్ని పోగొట్టుకోవ‌డం ఎంత మాత్రం ఇష్టం లేదు.