బాబు నిస్స‌హాయ‌త‌పై సెటైర్స్‌

కేవ‌లం రాజ‌కీయంగా నిస్స‌హాయ స్థితిలోనే బీజేపీతో పొత్తు పెట్టుకోడానికి చంద్ర‌బాబు ఆస‌క్తి చూపుతున్నార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లి అమిత్‌షాతో చంద్ర‌బాబునాయుడు చ‌ర్చించి వ‌చ్చారు. బీజేపీతో టీడీపీ పొత్తు దాదాపు ఖ‌రారైన‌ట్టు ప్ర‌చారం…

కేవ‌లం రాజ‌కీయంగా నిస్స‌హాయ స్థితిలోనే బీజేపీతో పొత్తు పెట్టుకోడానికి చంద్ర‌బాబు ఆస‌క్తి చూపుతున్నార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లి అమిత్‌షాతో చంద్ర‌బాబునాయుడు చ‌ర్చించి వ‌చ్చారు. బీజేపీతో టీడీపీ పొత్తు దాదాపు ఖ‌రారైన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారానికి అమిత్‌షా కామెంట్స్ బ‌లం క‌లిగిస్తున్నాయి. ఎన్డీఏ కూట‌మిలోకి కొత్త పార్టీలు వ‌స్తున్నాయ‌ని, ఏపీలో పొత్తుల‌పై త్వ‌ర‌లో తేలుస్తామ‌ని ఆయ‌న అన్నారు.

ఈ నేప‌థ్యంలో మ‌న‌స్ఫూర్తిగా బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డం ఇష్టం లేక‌పోయినా, రాజ‌కీయ, వ్య‌క్తిగ‌త అవ‌స‌రాలు, భ‌యంతో బీజేపీతో పొత్తు పెట్టుకోడానికి సిద్ధ‌మైన చంద్ర‌బాబుపై సోష‌ల్ మీడియాలో సెటైర్స పేలుతున్నాయి. బాబు ఎంత నిస్స‌హాయ స్థితిలో ఉన్నారో నెటిజ‌న్లు వ్యంగ్య ధోర‌ణిలో ఆవిష్క‌రిస్తుండ‌డం విశేషం. బీజేపీకి చంద్ర‌బాబు సీట్లు ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని, టీడీపీకే ఆ పార్టీ ఇస్తుంద‌ని దెప్పి పొడ‌వ‌డం గ‌మ‌నార్హం.

15 నుంచి లోక్‌స‌భ స్థానాల్లో బీజేపీ, జ‌న‌సేన అభ్య‌ర్థులు పోటీ చేస్తార‌ని చంద్ర‌బాబుకు అమిత్‌షా తేల్చి చెప్పిన‌ట్టు పోస్టులు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. అలాగే రెండున్న‌రేళ్ల పాటు అధికారంలో తాము వుంటామ‌ని కూడా బాబుకు అమిత్‌షా చెప్పిన‌ట్టు నెటిజ‌న్లు వెట‌క‌రిస్తున్నారు. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి అధికారంలోకి వ‌స్తే, ఎవ‌రు మొద‌ట ముఖ్య‌మంత్రిగా ఉండాల‌నేది కూడా తామే నిర్ణ‌యిస్తామ‌ని అమిత్‌షా చెప్పిన‌ట్టు సోష‌ల్ మీడియాలో పోస్టులు క‌నిపిస్తున్నాయి.

అలాగే టీడీపీకి ఆరేడు మంత్రి ప‌ద‌వులు మాత్ర‌మే ఇస్తామ‌ని కూడా అమిత్‌షా ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు నెటిజ‌న్లు త‌మ‌దైన రీతిలో చంద్ర‌బాబును ఆడుకుంటున్నారు. ఎన్నిక‌ల మొత్తం ఖ‌ర్చు టీడీపీనే పెట్టుకోవాల‌ని అమిత్‌షా ఆదేశించిన‌ట్టు నెటిజ‌న్లు ఆడుకోవ‌డాన్ని చూడొచ్చు. బాబును ఇంత‌గా హింసించ‌డం కంటే ఆయ‌న నుంచి టీడీపీని క‌లిపేసుకోవ‌చ్చు క‌దా అని నెటిజ‌న్ల కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

చంద్ర‌బాబుకు రాజ‌కీయ చ‌ర‌మాంకంలో ఇదేం గ‌తి అంటూ మ‌రికొంద‌రు సానుభూతి చూప‌డం విశేషం. త‌న‌కు తానుగా పొత్తు కోసం వెంప‌ర్లాడ‌డం వ‌ల్లే బీజేపీ చేతిలో చంద్ర‌బాబు కీలు బొమ్మ అయ్యార‌నేది అంద‌రి అభిప్రాయం.