టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఖరారవుతున్న నేపథ్యంలో… బీజేపీ సీనియర్ ఐవైఆర్ కృష్ణారావు ఘాటు హెచ్చరిక చేయడం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తనవైన అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
“ఈ సారి అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే కుదరకపోవచ్చు. అన్ని అంశాలపై పూర్తి స్పష్టతతో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదా లాంటి అంశాలతో సహా. ఏరు దాటిన తరువాత కూడా నావతోనే పయనం చేయాల్సి ఉంటుంది”
ఎన్డీఏలో టీడీపీ చేరడానికి సిద్ధమైన వేళ ఏపీ బీజేపీ నేత హితవు చర్చనీయాంశమైంది. గతంలో ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి, ఆ తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ వైసీపీ ట్రాప్లో పడిన టీడీపీ, ఎన్డీఏ సర్కార్ నుంచి బయటికొచ్చిన సంగతి తెలిసిందే. మోదీ సర్కార్ను, బీజేపీని తీవ్రస్థాయిలో చంద్రబాబు విమర్శించారు. దేశానికి బీజేపీతో ప్రమాదం పొంచి వుందని చంద్రబాబు హెచ్చరించారు.
గతంలో బీజేపీతో అధికారంలో పంచుకుని, ఎన్నికల సమయంలో చంద్రబాబు యూ టర్న్ తీసుకుని విమర్శించడాన్ని దృష్టిలో పెట్టుకుని కృష్ణారావు తనదైన రీతిలో రియాక్ట్ అయ్యారు. గతంలో మాదిరి అవకాశ వాద రాజకీయాలకు పాల్పడకుండా వుంటేనే ఎన్డీఏలోకి రావాలని ఆయన హితవు చెప్పడం గమనార్హం. అందుకే తమతో పొత్తు కుదుర్చుకోడానికి ముందే, బాగా ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. గతంలో అవసరం తీరిన బీజేపీని విడిచి పెట్టారని గుర్తు చేస్తూనే, ఈ దఫా అట్లా కుదరదని ఆయన హెచ్చరించడం విశేషం.