దేశంలో అత్యంత తెలివిపరులు బీహార్‌వాసులని ఒక సర్వే పేర్కొంది. ఆ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారని సమాచారం. ఏపీ విషయానికి వస్తే తెలివైన వాళ్లు ఎక్కువగా చంద్రగిరిలో ఉన్నారని సరదాగా విశ్లేషిస్తుంటారు. చంద్రబాబునాయుడు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లాంటి నేతలను చూస్తూ… రాజకీయాలకు అతీతంగా తెలివైన నేతలంటూ కామెంట్స్ చేస్తుంటారు.
సరదాగా అంటున్నప్పటికీ, ఇదే నిజం. నారా చంద్రబాబునాయుడు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి… ఇద్దరూ ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన నేతలు. వీళ్లిద్దరి రాజకీయ ఎదుగుదలను గమనిస్తే, సాధారణ కుటుంబాల నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్లారు. చంద్రబాబునాయుడు రెండెకరాల నుంచి వేలాది కోట్లకు ఆసామి అయ్యారు. అలాగే చంద్రగిరిలో రాజకీయ, సామాజిక పరిస్థితుల రీత్యా ముప్పు పొంచి వుందని గ్రహించి…1983లో ఓటమి అనంతరం చిత్తూరు జిల్లాలో కర్నాటక సమీపంలోని కుప్పానికి మకాం మార్చారు.
పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ భవిష్యత్‌పై నమ్మకం లేక 1983లో చంద్రబాబునాయుడు చేరలేదు. పైగా ఇందిరమ్మ ఆదేశిస్తే మామపై పోటీ చేయడానికి కూడా వెనుకాడనని ఆయన ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. అబ్బో చంద్రబాబునాయుడికి పార్టీపై చాలా నిబద్ధత, ఇందిరాగాంధీ కుటుంబంపై విశ్వాసం ఉన్నాయని అనుకునేలా డైలాగ్స్ చెప్పారు.
1983లో టీడీపీ ప్రభంజనానికి కాంగ్రెస్ కొట్టుకుపోయింది. అందులో చంద్రబాబు కూడా ఉన్నారు. రాజకీయాల్లో వాతావరణాన్ని అనుసరించి మారకపోతే వాడు ఉత్త ఎదవ అనేది బాబు సిద్ధాంతం. దీంతో ఆయన టీడీపీలో చేరిపోయారు. ఆ పార్టీలో అంత వరకూ కీలకంగా వ్యవహరించిన ఒక్కొక్కరిని చంద్రబాబు తొక్కు కుంటూ ముందుకుపోయారు. రాజకీయాల్లోనూ, వ్యాపారంలోనూ ఇతరుల అణచివేతపైనే పునాదులు వేసుకోవాలని నమ్మిన నాయకుల్లో చంద్రబాబు ఉన్నారు.
టీడీపీలో ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబే అనే రేంజ్‌కు అనతికాలంలోనే ఎదిగారు. తన రాజకీయ ఎదుగుదలకు చంద్రగిరి నియోజకవర్గం అడ్డంకిగా తయారవుతుందని ఆయన భయపడ్డారు. దీంతో 1989 నుంచి కుప్పం ఎమ్మెల్యేగా వరుసగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 1989లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నాడు రాజకీయ కారణాలతో ఎన్టీఆర్ అసెంబ్లీకి వెళ్లకపోవడాన్ని చంద్రబాబు బాగా సద్వినియోగం చేసుకున్నారు.
ముఖ్యమంత్రి కావాలన్న కోరిక రోజురోజుకూ ఆయన మనసులో బలపడుతూ వచ్చింది. ఎన్టీఆర్ జీవించినంత కాలం చంద్రబాబు సీఎం కాలేరని అనుకున్నారు. ఎన్టీఆర్ అనంతరం బాబు సీఎం కావచ్చని చాలా మంది నమ్మారు. అయితే లక్ష్మీపార్వతిని అడ్డుపెట్టుకుని ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేసి, సీఎంగా చంద్రబాబు 1995లో మొదటిసారిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్ లాంటి ప్రజాదరణ కలిగిన నాయకుడిని గద్దె దించి చంద్రబాబు తట్టుకోవడమే గొప్ప.
ఆ తర్వాత ఎన్టీఆర్ మానసిక క్షోభకు గురై ప్రాణాలు పోవడంతో, రాజకీయంగా చంద్రబాబుకు ప్రాణం లేచొచ్చిందని చెప్పక తప్పదు. 1999లో వాజ్‌పేయ్ ఎఫెక్ట్, అలాగే నాడు కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు వెరసి చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబునాయుడు రెండోసారి సీఎం అయ్యారు. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయ్యారు. ఇలా 14 ఏళ్లు సీఎంగా పని చేసిన ఘనత చంద్రబాబునాయుడికే దక్కింది.
ప్రజాకర్షణ లేని చంద్రబాబునాయుడు మూడుసార్లు సీఎం కావడం సామాన్య విషయం కాదు. అంతెందుకు, గత ఎన్నికల్లో ప్రధాని మోదీని, అలాగే బీజేపీని అమ్మనాబూతులు తిట్టిన చంద్రబాబును కేంద్రంలో అధికారం చెలాయిస్తున్నపార్టీ ఎప్పటికీ దగ్గరికి తీయదని అంతా అనుకున్నారు. సీబీఐని రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని చంద్రబాబు నాడు హెచ్చరించారు. అలాగే బాబు హయాంలోనే కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాపై తిరుపతిలో రాళ్ల దాడి జరిగింది. మోదీ తల్లి, భార్యపై కూడా చంద్రబాబు కామెంట్స్ చేయడం నాడు బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. అయినప్పటికీ పాతవన్నీ మరిచిపోయేలా చేసి, కొత్తగా చంద్రబాబునాయుడికి స్నేహ హస్తం ఇచ్చారంటే బాబు మామూలోడు కాదు.
ఇక చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విషయానికి వెళ్దాం. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రోత్సాహంతో తిరుపతి రూరల్ జెడ్పీటీసీగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలైంది. చెవిరెడ్డికి చొరవ ఎక్కువ. గాలైనా ఎక్కడైనా దూరడానికి ఇబ్బంది పడొచ్చేమో కానీ, చెవిరెడ్డి మాత్రం ఎక్కడికైనా దూసుకెళ్లే చాణక్యుడు. భూమన కరుణాకరరెడ్డి వేసిన చెవిరెడ్డి అనే రాజకీయ విత్తనం…నేడు భారీ వృక్షమవడానికి శరవేగంగా అడుగులు వేస్తోంది.
వైఎస్సార్ మరణానంతరం వైఎస్ జగన్‌కు చెవిరెడ్డి దగ్గరయ్యారు. 2014లో వైసీపీ టికెట్ దక్కించుకుని, పెద్ద నాయకురాలైన గల్లా అరుణకుమారిని ఓడించారు. పారిశ్రామికవేత్త, ధనవంతురాలైన అరుణకుమారిని ఓడించిన చెవిరెడ్డి విజయం ప్రతి రాజకీయవేత్తకు స్ఫూర్తిదాయకం అంటే అతిశయోక్తి కాదు. 2019లో మరోసారి చంద్రగిరి నుంచి విజయాన్ని దక్కించుకున్నారు.
వైసీపీ అధికారంలోకి రావడంతో ఇక ఆయన వెనుతిరిగి చూడలేదు. అయితే ఇక్కడో విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2014లో వైసీపీ అధికారంలో లేకపోవచ్చు కానీ, చెవిరెడ్డి మాత్రం కాదనేది గమనంలో పెట్టుకోవాలి. తెలంగాణలో అధికారంలో ఉన్న నాటి సీఎం కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీష్‌రావు, కవిత తదితర ముఖ్యులతో సన్నిహిత సంబంధాలు నెరిపారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తిరుమల సందర్శనకు వస్తే, వారంతా తప్పకుండా చెవిరెడ్డి ఇంటికెళ్లడం తెలిసిందే.
చంద్రగిరిలో చెవిరెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నిత్యం ఏవో ఒకటి తన నియోజకవర్గ ప్రజానీకానికి పంచుతూనే వుంటారు. ఇందుకోసం కోట్లాది రూపాయలను ఆయన వెచ్చిస్తుంటారు. చెవిరెడ్డికి డబ్బు ఎలా వస్తున్నదో అని అందరూ అనుకుంటుంటారు కానీ, ఆయన ఎట్ల సంపాదించినా అంతా దాచుకోలేదు కదా, మనకూ కొంత పంచుతున్నాడనేది ప్రజల నుంచి వచ్చే మాట.
2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా ప్రత్యర్థులపై విమర్శలకు ఆయన దూరంగా ఉన్నారు. తన సంపాదన, రాజకీయం అంతా చాపకింద నీరులా చేసుకుంటూ పోతున్నారు. తన పెద్ద కుమారుడు మోహిత్‌రెడ్డిని తిరుపతి రూరల్ మండలాధ్యక్షుడిని చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా చంద్రగిరి బరిలో తన కుమారుడినే నిలిపాలని అనుకున్నారు. దీంతో మోహిత్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా అందరికంటే ముందు చెవిరెడ్డి బహిరంగంగా ప్రకటించుకున్నారు. అనంతరం తుడా చైర్మన్‌గా తాను తప్పుకుని, ఆ స్థానంలో మోహిత్‌కు ఇప్పించుకున్నారు. ఇదీ చెవిరెడ్డి కెపాసిటీ.
ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నానని, జగనన్నకు ఎన్నికల సమయంలో అండగా వుంటానని తాడేపల్లికి మకాం మార్చుకున్నారు. వైసీపీ అభ్యర్థుల ఎంపిక నేపథ్యంలో ఒంగోలు సీటు విషయమై వివాదం తలెత్తింది. సిటింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డిని పక్కన పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. దీంతో ఆ స్థానంలో రాజకీయాల నుంచి తప్పుకున్నానని ప్రకటించుకున్న చెవిరెడ్డి పేరు తెరపైకి రావడం విశేషం.
అంతెందుకు ఒంగోలు పార్లమెంట్ పరిధి వరకూ ఇటీవల చెవిరెడ్డికి బాధ్యతల్ని సీఎం అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఒంగోలు పార్లమెంట్‌తో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్‌గా కూడా చెవిరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. జగన్ దగ్గర తన సమర్థతను చాటుకోవడంలో చెవిరెడ్డి సక్సెస్ అయ్యారు. నిజానికి రాజ్యసభ సభ్యుడిగా వెళ్లాలని చెవిరెడ్డి భావించారు. అయితే అంతకు ముందే ఒంగోలు ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇక అధికారిక ప్రకటనే మిగిలి వుంది. చెవిరెడ్డి ఎదుగుదల అంటే గిట్టని వారు ఆయనపై ఎన్నైనా విమర్శలు చేయొచ్చు. కానీ ఆయనో సక్సెస్ ఫుల్ పొలిటీషియన్.
రాజకీయాలను శాసించేది ఏదో ఆయన పసిగట్టారు. ఆ వనరులన్నీ ఆయన పుష్కలంగా సమకూర్చుకున్నారు. దీంతో రాజకీయాలపై స్వారీ చేస్తున్నారు. రాజకీయాల్లో చంద్రబాబు, చెవిరెడ్డి ఒకే నియోజకవర్గం నుంచి రావడం విశేషం. చంద్రగిరి నీళ్లలో ఏదో ప్రత్యేకత వుందని కొందరు సరదా కామెంట్స్ చేస్తుంటారు. అనుకున్నది సాధించడంలో చంద్రబాబు, చెవిరెడ్డి ఇద్దరు ఇద్దరే. ఆల్ ది బెస్ట్ చెవిరెడ్డి.