Advertisement

Advertisement


Home > Politics - Andhra

మ‌హిళా సీఐ తీరు జుగుప్సాక‌రం!

మ‌హిళా సీఐ తీరు జుగుప్సాక‌రం!

మ‌హిళా సీఐపై మ‌హిళా క‌మిష‌న్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దీన్నిబ‌ట్టి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పోలీసుల తీరు ఏ స్థాయిలో వ్య‌తిరేక‌త మూట‌క‌ట్టుకున్న‌దో అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌భుత్వం ఇస్తున్న మితిమీరిన స్వేచ్ఛ వ‌ల్ల సామాన్యుల‌పై పోలీసులు దాడులు చేస్తూ నియంతృత్వం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు బ‌లం చేకూర్చేలా మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యురాలి ఆగ్ర‌హం ప్ర‌ద‌ర్శించారు. తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి మ‌హిళా సీఐ అంజూయాద‌వ్ జులుం గురించి మ‌హిళా క‌మిషన్ స‌భ్యురాలు జీవీ ల‌క్ష్మి చెప్పుకొచ్చారు. మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యురాలి మాట‌ల్లో అంజూయాద‌వ్ అరాచ‌కం గురించి...

"తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తిలో ఒక చిరు బండి నిర్వహిస్తున్న మహిళ మీద ఇవాళ శ్రీ‌కాళహస్తి సీఐ అంజూ యాదవ్ ప్రవర్తించిన తీరు జుగుప్సాకరంగా ఉంది. రక్షించాల్సిన రక్షకభ‌టులే భ‌క్షించే పరిస్థితికి చేరార‌నేందుకు నిదర్శనంగా శ్రీ‌కాళ‌హ‌స్తి మహిళా సీఐ ప్రవర్తన ఉంది. మహిళ అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా... మోకాళ్ళ వరకూ ఆమె చీర లాగింది. ఎద‌పై చీర కూడా లాగేసి వివస్త్రను చేసి జీపులో తోసి దారుణంగా ప్రవర్తించింది. ఇలాంటి మహిళా సీఐలు ఉన్నారంటే సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి. గతంలో కూడా ఒక మ‌హిళ ఫిర్యాదు ఇవ్వడానికి వెళితే బూటు కాలుతో తన్నిన చరిత్ర ఆ సీఐది. గతంలో ఎస్పీకి విన్న‌వించాం. ఈవిడ తీరు ఎప్పటికీ మారేలా క‌నిపించ‌డం లేదు. ఈ సీఐ మీద తగిన‌ చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సీఐలుంటే పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోవాల్సి వస్తుంది. సభ్య సమాజం సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్న అంజూయాదవ్ మీద చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారికి ఫిర్యాదు చేశాం" అని జీవీ ల‌క్ష్మి ఆవేద‌నతో కూడిన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మోకాళ్ల వ‌ర‌కూ చీర‌లాగి, ఎద‌పై వ‌స్త్రం కూడా లాగేయ‌డంతో వివ‌స్త్ర‌ను చేసి జీపులో చిరు వ్యాపారి అయిన మ‌హిళ‌ను జీపులో కుక్కార‌ని ఏ ప్ర‌తిప‌క్ష నాయ‌కురాలో ఆరోపించ‌డం లేదు. మ‌హిళ‌ల హ‌క్కుల్ని కాపాడాల్సిన బాధ్య‌త‌ల్ని భుజాన మోస్తున్న ఏపీ మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యురాలే త‌న ఫేస్‌బుక్ ఖాతాలో ఎంతో ఆవేద‌న‌తో పోస్టు పెట్ట‌డాన్ని జ‌గ‌న్ స‌ర్కార్ సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. లేదంటే ఈ వ్య‌వ‌హారం ప్ర‌తిప‌క్షాల‌కు అస్త్రంగా ఉప‌యోగ‌ప‌డే ప్ర‌మాదం ఉంది.

సీఐ తీరుపై కానిస్టేబుల్ సైతం...

చిరు వ్యాపారి అయిన మ‌హిళ విష‌యంలో శ్రీ‌కాళ‌హ‌స్తి సీఐ అంజూయాద‌వ్ దుశ్శాస‌న ప‌ర్వానికి దిగ‌డంపై అన్ని వ‌ర్గాల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ ఘ‌ట‌న ప‌లువుర్ని క‌దిలించిది. ఇలా మ‌న‌సు చ‌లించి సీఐ దుర్మార్గాన్ని ప‌లువురికి తెలియ‌జేయ‌డానికి అర‌ణ్య శేఖ‌ర్ అనే పేరుతో ఫేస్‌బుక్ ఖాతా క‌లిగిన కానిస్టేబుల్ సైతం ముందుకొచ్చారు. స‌ద‌రు మ‌హిళా వ్యాపారిపై సీఐ దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్న వైనాన్ని, అలాగే మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యురాలి ఆగ్ర‌హానికి సంబంధించిన స‌మాచారాన్ని అర‌ణ్య శేఖ‌ర్ అనే కానిస్టేబుల్ షేర్ చేయ‌డం ప్ర‌శంస‌లు అందుకుంటోంది. అన్యాయాన్ని వ్య‌తిరేకించే క్ర‌మంలో మ‌న‌, త‌న అనే తార‌త‌మ్యాలు లేకుండా కానిస్టేబుల్ శేఖ‌ర్ సామాజిక చైత‌న్యంతో ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ప‌లువురు అభినందిస్తున్నారు. 

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా