రాజగురువు రూట్ మార్చారా?

విశాఖ శారదా పీఠానికి చెందిన స్వరూపానందేంద్ర స్వామి సడెన్ గా ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ అధినేత చంద్రబాబుని తెగ పొగుడుతూ పోయారు. అకస్మాత్తుగా స్వామిలో వచ్చిన మార్పుని చూసిన వారు స్వామీ ఇది…

విశాఖ శారదా పీఠానికి చెందిన స్వరూపానందేంద్ర స్వామి సడెన్ గా ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ అధినేత చంద్రబాబుని తెగ పొగుడుతూ పోయారు. అకస్మాత్తుగా స్వామిలో వచ్చిన మార్పుని చూసిన వారు స్వామీ ఇది ఏమీ అని విస్తుపోతున్నారు.

స్వామీజీ పీఠం అంటే వైసీపీ నేతలతో కిటకిటలాడేది. జగన్ అయిదేళ్ల పాటు పీఠానికి ప్రతీ ఏటా వచ్చి పూజలలో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. జగన్ కి రాజ గురువుగా మారిన స్వరూపానందేంద్ర స్వామి వైసీపీ నేతలకు పూజనీయులుగా అయిపోయారు.

జగన్ విశాఖ రాజధానిని చేసుకోవాలని సూచించింది స్వామి అని అంటారు. దాని వల్ల వైసీపీ కోల్పోయినది ఏమిటి అన్నది తాజా ఎన్నికలు వెల్లడించాయి. స్వామి ముహూర్తాలు యాగాలు హోమాలు వైసీపీని ఈసారి బతికి బట్ట కట్ట నీయలేదు.

అయితే జగన్ మాత్రం స్వామిని పూర్తిగా విశ్వసించారు. కానీ రాజకీయం ఏపీలో మారింది. టీడీపీ అప్రతిహితంగా విజయం సాధించి కొలువు తీరబోతోంది. దాంతో స్వామి తాను ధర్మం వైపు ఉన్నాను తప్ప పీఠానికి ఎలాంటి రాజకీయాలు లేవు అని స్పష్టం చేశారు.

తాను ఎవరికో భయపడి ప్రెస్ మీట్ పెట్టడం లేదని చంద్రబాబు అంటే తనకు అభిమానం ఉన్నాయని చాటుకున్నారు. ఈ నెల 12న చంద్రబాబు సీఎం గా ప్రమాణం చేస్తున్న ముహూర్తం అద్భుతం అని స్వామి కొనియాడారు. బాబు హయాంలో ఏపీ ప్రగతిపధంలో సాగుతుందని కూడా జోస్యం చెప్పారు.

తనకు టీడీపీకి చెందిన మురళీమోహన్ వంటి వారితో మంచి పరిచయాలు ఉన్నాయని ఆయన చెప్పుకున్నారు. అయితే స్వామి ఈ విధంగా మాట్లాడడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అయితే స్వరూపానందేంద్ర వ్యాఖ్యల మీద ఏపీ సాధు పరిషత్ నేత శ్రీనివాసానంద సరస్వతి నిప్పులు చెరిగారు.

స్వరూపానందేంద్రకు ధర్మం ముఖ్యం కాదని ధనం ముఖ్యమని మండిపడ్డారు. ఆయన పీఠాన్ని పూర్తిగా రాజకీయమయం చేశారని వైసీపీకి నిలయం చేశారని ఇపుడు బాబు మీద అభిమానం కురిపిస్తున్నారని దుయ్యబెట్టారు. ముప్పయ్యేళ్ళుగా పీఠాన్ని పెట్టి హిందూ ధర్మానికి స్వరూపానందేంద్ర చేసింది ఏంటి అని ఆయన ప్రశ్నించారు. రాజకీయాలకు దూరం అని చెబుతూనే స్వరూపానందేంద్ర రాజకీయ నేతలతోనే ఉన్నారని విమర్శించారు. ఆయన మాటలను జనాలు ఎవరూ నమ్మరని అన్నారు.