Advertisement

Advertisement


Home > Politics - Andhra

అసలు వద్దు’.. ‘20 మించి ఇవ్వొద్దు’!

అసలు వద్దు’.. ‘20 మించి ఇవ్వొద్దు’!

పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రావడం అనేది.. ఆ పార్టీకి లాభమో నష్టమో అర్థం కావడం లేదు! ఈ ఎన్నికల ఫలితాల పుణ్యమా అని ఆ పార్టీలో కొత్త లుకలుకలు పుడుతున్నాయి. 

తమ పార్టీ అపరిమితంగా బలపడిపోయిందని, ఇక ఎవరినీ ఖాతరు చేయవలసిన అవసరం లేదని కొందరు నాయకులు తలపోస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి ఇతర పార్టీలతో కలిసి సమిష్టిగా పోటీ చేయాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం వైఖరికి-- పార్టీ నాయకుల శ్రేణుల మనోభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. ఇది పార్టీలో ముసలం పుట్టడానికి కారణమయ్యేలా కనిపిస్తోంది!

వచ్చే ఎన్నికల సమయానికి తెలుగుదేశం జనసేనతో చట్టపట్టాలు వేసుకుని జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ‘జనసేనకు ఎన్ని సీట్లు పంచాలి’ అనే దగ్గరే ఆ రెండు పార్టీల పంచాయితీ ఇంకా తెగడం లేదు. 

చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రాథమిక చర్చలలో కేవలం 20 సీట్లు మాత్రం పవన్ కళ్యాణ్ కు కేటాయించడానికి చంద్రబాబు అంగీకరించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే కేవలం 20 సీట్లు అంటే చాలా అవమానకరంగా ఉంటుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తమ పార్టీ తరఫున వారికి ఇంకా అధికారిక మద్దతు ప్రకటించలేదు. వారితో కొత్తగా పొత్తు బంధం పెట్టుకోబోతున్నట్లుగా అధికారికంగా వెల్లడించలేదు. 

‘‘కేవలం 20కి నేను ఒప్పుకుంటానా? సీట్ల సంఖ్య ఇంకా మాట్లాడలేదు’’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆయన బేరసారాలలో ఇంకొద్దిగా సీట్లు ఎక్కువ లబ్ధి పొందడానికి వ్యవహారాన్ని సాగదీస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో వచ్చిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీ నాయకులలో కొత్త పొగరును తయారు చేశాయి. ఈ ఎన్నికలలో తెలుగుదేశం ఎవరితోనూ పొత్తు లేకుండానే తలపడింది.

లోపాయికారీగా ఏమైనా ఉంటే ఉండవచ్చు కానీ, జనసేన నుంచి కూడా అధికారిక పొత్తుగాని మద్దతు గానీ లేవు. ఇలా ఎవరి మద్దతు లేకుండానే నూటికి నూరు శాతం సీట్లను గెలుచుకున్న తమ పార్టీ అసలు ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని వారు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో కూడా పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్తే తమకు ఇంకా గౌరవప్రదంగా ఉంటుందని వాదిస్తున్నారు.

అయితే మెజారిటీ తెలుగుదేశం నాయకుల్లో మాత్రం పొత్తు పెట్టుకోవాలనే కోరిక ఉంది. ఇదంతా వారి స్థానిక రాజకీయాలలో ఉండే బలహీనతల పర్యవసానం.

ఒకవేళ చంద్రబాబు నాయుడు ఔదార్యంగా వ్యవహరించి జనసేనతో పొత్తు పెట్టుకోవడం పార్టీకి అవసరం అని తనకు తాను చెప్పుకుంటే .. గరిష్టంగా ఆ పార్టీకి 20 సీట్లకు మించి ఇవ్వడానికి వీల్లేదని ఆ పార్టీలో పలువురు రంగం సిద్ధం చేస్తున్నారు. మరి తామే బలవంతమైన పార్టీగా ఉన్నాము కనుక 20 సీట్లకు మించి ఇచ్చేది లేదని తెలుగుదేశం గట్టిగా భీష్మించుకుంటే జనసేన ఏం చేస్తుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?