Advertisement

Advertisement


Home > Politics - Andhra

టీడీపీ ఆశ‌ల‌న్నీ ఆ న‌లుగురు వైసీపీ ఎమ్మెల్యేల‌పైన్నే!

టీడీపీ ఆశ‌ల‌న్నీ ఆ న‌లుగురు వైసీపీ ఎమ్మెల్యేల‌పైన్నే!

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల బ‌రిలోకి టీడీపీ దిగడం వెనుక ప‌క్కా వ్యూహం క‌నిపిస్తోంది. టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పంచుమ‌ర్తి అనురాధ‌ను ఎమ్మెల్సీ బ‌రిలో నిల‌బెట్టాల‌ని నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 23న ఏడు ఎమ్మెల్సీ స్థానాల‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఒక్కో ఎమ్మెల్సీ అభ్య‌ర్థి గెల‌వాలంటే 23 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు అవ‌స‌రం. ప్ర‌స్తుతం టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు మాత్ర‌మే ఉంది. నిజానికి టీడీపీ త‌ర‌పున 23 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నిక‌య్యారు. అయితే టీడీపీని విభేదించి న‌లుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి అండ‌గా నిలిచారు.

ఈ నేప‌థ్యంలో త‌గినంత బలం లేక‌పోయినా టీడీపీ బ‌రిలో నిల‌బ‌డ‌డంపై వైసీపీ ఒకింత షాక్‌కు గురి అవుతోంది. ఏడు ఎమ్మెల్సీ స్థానాల‌ను తామే ద‌క్కించుకుంటామ‌నే ధీమాలో వైసీపీ వుండింది. కానీ రాజ‌కీయ స‌మీక‌ర‌ణలు మారుతున్నాయి. అస‌లు టీడీపీ ఏ ధైర్యంతో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న‌ద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ప్ర‌ధానంగా వైసీపీకి చెందిన న‌లుగురు అభ్య‌ర్థులు త‌మ‌కు మ‌ద్ద‌తు ఇస్తార‌నే ఆశ‌తో పోటీ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

రానున్న ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్క‌ద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన అధికార పార్టీకి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేలు త‌మ‌కు ఓట్లు వేస్తార‌ని టీడీపీ న‌మ్మ‌కంగా వుంది. ఇప్ప‌టికే నెల్లూరు రూర‌ల్, వెంక‌ట‌గిరి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, ఆనం రామనారాయ‌ణ‌రెడ్డి సొంత పార్టీపై తిరుగుబాటు బావుగా ఎగుర‌వేసిన సంగ‌తి తెలిసిందే. వీళ్లిద్ద‌రితో పాటు నెల్లూరు జిల్లాకే చెందిన మ‌రో ఎమ్మెల్యే, అలాగే రాజ‌ధాని ప్రాంతానికి చెందిన మ‌హిళా ఎమ్మెల్యే త‌మ‌కు అండ‌గా ఉంటార‌ని టీడీపీ గ‌ట్టి న‌మ్మ‌కంతో వుంది. నెల్లూరు జిల్లాలోని ఒక ఎమ్మెల్యే వ్య‌క్తిగ‌త జీవితంలో వివాదాల‌తో త‌ర‌చూ ర‌చ్చ‌కెక్కుతున్నారు.

ఆయ‌న వైఖ‌రిపై సీఎం జ‌గ‌న్ తీవ్ర అస‌హ‌నంగా ఉన్న‌ట్టు తెలిసింది. అలాగే రాజ‌ధాని ప్రాంతంలోని ఒక మ‌హిళా ఎమ్మెల్యే తీరుపై కూడా సీఎం ఆగ్ర‌హంగా ఉన్నారు. స‌ద‌రు ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గానికి స‌హ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ను కూడా నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. వైసీపీకి న‌లుగురు టీడీపీ ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తుగా నిలిస్తే, అంతే సంఖ్య‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేల‌ను త‌మ వైపు తిప్పుకుని దెబ్బ‌కు దెబ్బ తీయాల‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వ్యూహాత్మ‌కంగా న‌డుచుకుంటోంది. నామినేష‌న్ వేయ‌డానికి 13వ తేదీ గ‌డువు. ఎన్నిక‌లు 23న జ‌ర‌గ‌నున్నాయి. తెలిసి తెలిసి న‌ష్ట‌పోవ‌డానికి వైఎస్ జ‌గ‌న్ సిద్ధంగా ఉండ‌రు. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ వ్యూహం ఎలా వుంటుందో అనే ఆస‌క్తి నెల‌కుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?