ప‌వ‌న్‌ను కూచోపెట్టి…బుద్ధి చెప్పిన హ‌రిరామ జోగ‌య్య‌!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను కూచోపెట్టి మ‌రీ బుద్ధి చెప్పారు మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్య‌క్షుడు హ‌రిరామ జోగ‌య్య‌. మంగ‌ళ‌గిరిలో ఆదివారం కాపు సంక్షేమ సేన నేతృత్వంలో నిర్వ‌హించిన స‌మావేశంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాల్గొన్నారు. బీసీల…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను కూచోపెట్టి మ‌రీ బుద్ధి చెప్పారు మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్య‌క్షుడు హ‌రిరామ జోగ‌య్య‌. మంగ‌ళ‌గిరిలో ఆదివారం కాపు సంక్షేమ సేన నేతృత్వంలో నిర్వ‌హించిన స‌మావేశంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాల్గొన్నారు. బీసీల స‌ద‌స్సుకు గంట‌ల త‌ర‌బ‌డి ఆల‌స్యం చేసిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, త‌న సామాజిక వ‌ర్గం వారి స‌మావేశానికి మాత్రం స‌మ‌య పాల‌న‌ను పాటించ‌డం విశేషం. ఇందుకు ఆయ‌న అభినంద‌నీయుడు.

స‌రిగ్గా మ‌ధ్యా హ్నం 3.25 గంట‌ల‌కు ఆయ‌న స‌మావేశ మందిరంలోకి అడుగుపెట్టారు. రాగానే ప‌వ‌న్‌కు హ‌రిరామ జోగ‌య్య ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. పెద్దాయ‌న ఆశీస్సుల‌ను ప‌వ‌న్ స్వీక‌రించారు. అనంత‌రం “మేమే” టైటిల్‌తో సందేశాత్మ‌క షార్ట్ ఫిల్మ్‌ను ప్ర‌ద‌ర్శించారు. ఆ ల‌ఘుచిత్రంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు హిత‌బోధ చేసిన‌ట్టుగా వుంది. 80 శాతం జ‌నాభా క‌లిగిన తాము 20 శాతం ఓటు బ్యాంక్ క‌లిగిన వారిని ప‌ద‌వులు, నిధులు యాచించ‌డం ఏంట‌నేది ఆ షార్ట్ ఫిల్మ్‌లో క‌ల్యాణ్‌బాబు అనే హీరో క్యారెక్ట‌ర్ ప్ర‌శ్నిస్తారు.

యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎద‌గాల‌ని ఫైనల్‌గా ఆ సంక్షిప్త సినిమా ఒక స్ఫూర్తిదాయ‌క ప్ర‌శ్న ఆలోచింప‌చేస్తుంది. షార్ట్ ఫిల్మ్‌లో క‌ల్యాణ్‌బాబు క్యారెక్ట‌ర్ విజ‌య‌వంతంగా జ‌నంలో చైత‌న్యం తీసుకొస్తుంది. ఆ క‌ల్యాణ్‌బాబు మ‌రెవ‌రో కాదు… జ‌న‌సేనాని ప‌వ‌నే అని చివ‌రికి ఆయ‌న పిడికిలి బిగించి ఉన్న చిత్రం ద్వారా ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మ‌వుతుంది. ఈ షార్ట్ ఫిల్మ్‌లో ప‌దేప‌దే 20 శాతం జ‌నాభా ఉన్న అగ్ర‌వ‌ర్ణాల కింద అణిగి ఉండ‌డం ఏంట‌ని క‌ల్యాణ్ బాబు ప్ర‌శ్నిస్తున్నారు. 80 శాతం జ‌నాభా ఉన్న తాము హ‌క్కుల్ని, నిధుల్ని, అధికారాన్ని సాధిస్తాం, శాసిస్తాం అని క‌ల్యాణ్‌బాబు నిన‌దించ‌డం స‌మావేశానికి వ‌చ్చిన వారిలో జోష్ నింపింది.

ఇంత‌కూ 20 శాతం జ‌నాభా ఉన్న వారి అధికార ప‌ల్ల‌కీని మోయ‌డానికి సిద్ధ‌మైన రియ‌ల్ హీరో ప‌వ‌న్‌కల్యాణే అన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టికైనా షార్ట్ ఫిల్మ్ ద్వారా స్ఫూర్తి పొంది, 80 శాతం జ‌నాభా వైపు నిలిచేందుకు నిల‌బ‌డాల్సింది తానే అని ప‌వ‌న్ ఇప్ప‌టికైనా గ్ర‌హిస్తే మంచిది. ఎందుకంటే ఆ షార్ట్ ఫిల్మ్ కేవ‌లం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు బుద్ధి తెచ్చేందుకే అన్న‌ట్టుగా వుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.