టీడీపీలో గుబులు రేపుతున్న పవ‌ర్ షేరింగ్‌!

ఎన్నిక‌ల ముంగిట టీడీపీకి రోజుకో త‌ల‌నొప్పి. తాజాగా పొత్తులో భాగంగా ప‌వ‌ర్ షేరింగ్ వుంటుంద‌నే ప్ర‌చారం టీడీపీలో ఆందోళ‌న క‌లిగిస్తోంది. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య పొత్తు ఖ‌రార‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే టీడీపీ,…

ఎన్నిక‌ల ముంగిట టీడీపీకి రోజుకో త‌ల‌నొప్పి. తాజాగా పొత్తులో భాగంగా ప‌వ‌ర్ షేరింగ్ వుంటుంద‌నే ప్ర‌చారం టీడీపీలో ఆందోళ‌న క‌లిగిస్తోంది. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య పొత్తు ఖ‌రార‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు అధికారికంగా ఖ‌రారైంది. అలాగే జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య చాలా కాలంగా పొత్తు వుంది. కానీ బీజేపీతో టీడీపీకి పొత్తు ఇప్ప‌టి వ‌ర‌కు లేదు.

కేంద్రంలో అధికారంలో వుంటున్న బీజేపీతో పొత్తు లేక‌పోతే, తామేమీ చేయ‌లేమ‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభిప్రాయం. అందుకే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు ఉండేలా తాను మాట్లాడ్తాన‌ని ప‌వ‌న్ ప‌దేప‌దే చెబుతూ వ‌చ్చారు. ఎట్ట‌కేల‌కు బీజేపీతో పొత్తు పెట్టుకోవాల‌న్న చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌య‌త్నాలు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయి. మూడు పార్టీల మ‌ధ్య పొత్తుపై త్వ‌ర‌లో క్లారిటీ వ‌స్తుంద‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కూడా ఇటీవ‌ల ప్ర‌క‌టించారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా పొత్తు, సీట్ల పంపిణీతో పాటు అధికారంలో భాగ‌స్వామ్యంపై స‌రికొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. పొత్తులో భాగంగా 40 నుంచి 50 అసెంబ్లీ సీట్లు, అలాగే 10కి త‌క్కువ కాకుండా లోక్‌స‌భ స్థానాలు బీజేపీ, జ‌న‌సేన‌ల‌కు ఇస్తార‌నే ప్ర‌చారమే టీడీపీ నేత‌ల గుండెల్లో గుబులు రేపుతుండ‌గా, ఇప్పుడు మ‌రొక‌టి పిడుగుపాటుగా మారింది. అధికారంలో కూడా జ‌న‌సేన‌, బీజేపీల‌కు భాగం ఇవ్వాల‌నే ష‌ర‌తు అమిత్‌షా త‌దిత‌ర పెద్ద‌లు విధించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

పొత్తు కార‌ణంగా ఎక్కువ సీట్లు మిత్ర‌ప‌క్షాల‌కు ఇవ్వ‌డాన్ని టీడీపీ నేత‌లు జీర్ణించుకోలేకున్నారు. మ‌ళ్లీ ప‌వ‌ర్ షేరింగ్ అంటుండంతో టీడీపీ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాగైతే అధికారంలోకి రావ‌డం క‌లే అని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌లు నిరుత్సాహంతో అంటున్నారు. చంద్ర‌బాబు ఐదేళ్లు సీఎంగా వుంటేనే ఏదైనా చేయ‌గ‌లుగుతార‌ని, ప‌వ‌న్ లేదా బీజేపీ నేత‌ల‌కు అధికారం అప్ప‌గిస్తే మ‌ళ్లీ జ‌గ‌న్ చేతిలో రాష్ట్రాన్ని పెట్ట‌డం ఖాయ‌మ‌ని టీడీపీ నేత‌లు వాపోతున్నారు. అస‌లెందుకు వారికి అధికారంలో భాగం ఇవ్వాల‌నే ప్ర‌శ్న టీడీపీ నేత‌ల నుంచి వ‌స్తోంది.