Advertisement

Advertisement


Home > Politics - Andhra

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జ్.. ఇద్ద‌రూ సైలెంట్‌!

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జ్.. ఇద్ద‌రూ సైలెంట్‌!

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో రాజ‌కీయం వేడెక్కింది. వైసీపీ త‌ర‌పున రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి పోటీ చేస్తున్నారు. టీడీపీ ఇన్‌చార్జ్ జీ.ప్ర‌వీణ్‌కుమార్‌రెడ్డి టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డారు. అలాగే మ‌రో మాజీ ఎమ్మెల్యే మ‌ల్లెల లింగారెడ్డి కూడా టీడీపీ టికెట్ ఆశించి నిరాశ‌కు గుర‌య్యారు. టీడీపీ క‌ష్టకాలంలో ఆ పార్టీ జెండా మోసిన త‌మ‌కు కాద‌ని , ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌చ్చిన వ‌ర‌ద‌రాజుల‌రెడ్డికి టికెట్ ఇవ్వ‌డాన్ని ఆ ఇద్ద‌రు నాయ‌కులు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌వీణ్‌రెడ్డి, మ‌ల్లెల లింగారెడ్డి టీడీపీ అభ్య‌ర్థి వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారానికి దూరంగా వుంటున్నారు. కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇద్ద‌రు నాయ‌కులు మౌనంగా వుండ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌వీణ్‌పై కేసులు కూడా ఉన్నాయి. రాచ‌మ‌ల్లుపై ప్ర‌వీణ్ పోరాడే స‌మ‌యంలో వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి ఎక్క‌డున్నారో ఎవ‌రికీ తెలియ‌దు. ప్ర‌వీణ్ మాత్రం ప‌లు ద‌ఫాలు జైలు పాల‌య్యారు.

క‌డ‌ప సెంట్ర‌ల్ జైల్లో ఉన్న ప్ర‌వీణ్‌ను ప‌రామ‌ర్శించ‌డానికి నారా లోకేశ్ వెళ్లారు. ఆ స‌మ‌యంలో ప్రొద్దుటూరు టీడీపీ అభ్య‌ర్థి ప్ర‌వీణే అని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో భాగంగా ప్రొద్దుటూరుకు లోకేశ్ వెళ్లిన‌ప్పుడు... యువ నాయ‌కుడే ఇక్క‌డ పోటీ చేస్తార‌ని ప్ర‌క‌టించి, ప‌రోక్షంగా ప్ర‌వీణ్ అభ్య‌ర్థిత్వంపై సానుకూల ప్ర‌క‌ట‌న చేశారు. ఇవ‌న్నీ రాజ‌కీయంగా ప‌నులు చేయించుకోడానికే అని కాలం గ‌డిస్తే త‌ప్ప ప్ర‌వీణ్, లింగారెడ్డికి అర్థం కాలేదు.

ఈ నేప‌థ్యంలో తాము మోస‌పోయామ‌ని గ్ర‌హించిన ప్ర‌వీణ్‌, లింగారెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారానికి దూరంగా వున్నారు. కేవ‌లం ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌చ్చిన వ‌ర‌ద‌రాజుల‌రెడ్డికి చంద్ర‌బాబు టికెట్ ఇవ్వ‌డంపై గుర్రుగా ఉన్నారు. అయితే వాళ్లిద్ద‌రూ ప్ర‌చారం చేయ‌నంత మాత్రాన త‌మ‌కొచ్చే న‌ష్టం ఏదీ లేద‌ని వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి అనుచ‌రులు చెబుతున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?