
ఒకవైపు 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. మరోవైపు ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీదే గెలుపు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌పై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి బెంగ. దిక్కుతోచని స్థితిలో టీడీపీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు ఊపిరిపోశాయి. పొత్తులు లేకుండా వైసీపీని ఎదుర్కోవడం సాధ్యం కాదనే ఆందోళనలో ఉన్న టీడీపీకి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వజ్రాయుధాన్ని అందించినట్టైంది.
ఒక్కసారిగా టీడీపీ లెక్కలు మారాయి. ఇదే సందర్భంలో వైసీపీ ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుంది. ఉత్తరాంధ్రతో పాటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. కానీ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో వైసీపీ అభ్యర్థి కేవలం 2 వేలకు లోపు మెజార్టీతోనే కొనసాగుతున్నారు. దీంతో ఇక్కడ రెండో ప్రాధాన్యం ఓట్లతో తామే గెలుస్తామని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ ఫలితాల ఆధారంగా టీడీపీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాము తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంటామని చెబుతోంది. టీడీపీ చెబుతున్న లాజిక్ ఆసక్తికరంగా వుంది. మూడు పట్టభద్రుల స్థానాలను పరిశీలిస్తే మొత్తం 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరిగాయి. మొత్తం ఏడు లక్షల ఓటర్లకు తక్కవ కాకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల జరిగిన ప్రాంతాలను పరిశీలిస్తే... పరిపాలన రాజధాని ఇస్తామన్న ఉత్తరాంధ్రలో టీడీపీకి పట్టభద్రులు బ్రహ్మరథం పట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
అలాగే న్యాయ రాజధాని ఇస్తామన్న రాయలసీమలో కూడా మెరుగైన ఫలితాలు సాధించామంటున్నారు. రాజధాని ఆశలు కల్పించిన ప్రాంతాల్లోనే అధికార పార్టీని తిరస్కరిస్తున్నారని, అలాంటప్పుడు ఆల్రెడీ ఉన్న రాజధానిని మరెక్కడికో తరలించిన ప్రజానీకం ఆగ్రహం ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చని హెచ్చరిస్తున్నారు. రాజధాని తరలింపుతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తమకు నష్టం జరగొచ్చని వైసీపీ నేతలు చెబుతున్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అలాగే ఎటూ పవన్‌కల్యాణ్ తమతో కలుస్తారని, అలాంటప్పుడు అధికార పార్టీకి ఎదురు గాలి వీస్తున్న తరుణంలో ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్కటంటే ఒక్క సీటు వచ్చే అవకాశం లేదని వారు ధీమాగా చెబుతున్నారు.
రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో పూర్తిగా రెడ్ల ఆధిపత్యం వుంటుందని, అదే జగన్‌కు ప్రధాన బలమని టీడీపీ నేతలు అంటున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో కొంత మేరకు సీఎం సామాజిక వర్గం ప్రభావం వుంటుందని చెబుతున్నారు. అలాంటి చోట కులం చూడకుండా కమ్మ సామాజిక వర్గానికి చెందిన శ్రీకాంత్ చౌదరికి పట్టం కట్టాలని అనుకున్నారంటే, ఇక మిగిలిన ప్రాంతాల్లో వైసీపీపై ఏ స్థాయిలో వ్యతిరేకత వుంటుందో అంచనా వేయ వచ్చని టీడీపీ నేతలు విశ్లేషణ చేస్తున్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా అనూహ్యంగా వైసీపీతో టీడీపీ నువ్వానేనా అని పోటీ పడుతుండడాన్ని గుర్తు చేస్తున్నారు.
పైగా ఈ ఎన్నికల్లో టీడీపీ కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, ఇదే అధికార పార్టీ కోట్లాది రూపాయలను వెచ్చించిందని గుర్తు చేస్తున్నారు. నవరత్నాల పేరుతో రూ.1.70 లక్షలకు పైబడి జనానికి పంచానని, అదే తనను గెలిపిస్తుందని పదేపదే చెబుతున్న జగన్...డబ్బు కొంత వరకే పని చేస్తుందని, వ్యతిరేకత వుంటే ఏదీ ఆపలేవనే వాస్తవాన్ని ఈ ఎన్నికల ద్వారా తెలుసుకుంటే మంచిదని టీడీపీ నేతలు లెక్కలేసి మరీ చెబుతున్నారు. టీడీపీ నేతలు మాత్రం రానున్నది మన ప్రభుత్వమే అనే ఊహల్లో తేలాడుతున్నారు. అందుకు తాజా ఫలితాలు కిక్కు ఇస్తున్నాయనడంలో సందేహం లేదు.