ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేక ఫలితాలు వస్తుండడంతో ప్రతిపక్షాలు విమర్శలకు పదును పెట్టాయి. ఈ సందర్భంగా వైసీపీ పాపులర్ డైలాగ్‌తో ఆ పార్టీని టీడీపీ, జనసేన నేతలు వ్యంగ్య ధోరణిలో చితక్కొడు తున్నాయి. ఇందుకు సంబంధించి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తాయో చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమ నాయకుడు వైఎస్ జగన్ సింహంలాంటోడని, సింగిల్‌గానే వస్తారని, పందులే గుంపుగా వస్తాయంటూ ప్రతిపక్ష పార్టీలను వైసీపీ నేతలు ఎద్దేవా చేసే సంగతి తెలిసిందే. ఈ డైలాగ్‌ను తీసుకుని ప్రతిపక్షాలు దెప్పి పొడుస్తున్నాయి.
“కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు. సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కడి సరదా తీరుస్తుంది. నేను సింహం, సింగల్‌గా వస్తాననంటూ ప్రతోడి మీదకి వెళ్తూ వుంటే ఇలాగే వుంటుంది” అని వైసీపీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు సెటైర్స్ పేల్చుతున్నాయి.
ఈ సందర్భంగా సింహాన్ని అడవి దున్న కొమ్ములతో కుమ్మే ఫొటో, దాని పక్కన వైసీపీ నేతల చిత్రాలను పెట్టడం ఆకట్టుకుంటోంది. చాలా కాలం తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేదు ఫలితాలతో ప్రతిపక్షాల చేతికి వైసీపీ చిక్కినట్టైంది. అందుకే సోషల్ మీడియాలో ఆ పార్టీని ప్రతిపక్షాలు ఆడుకుంటున్నాయి.