Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఎమ్మెల్సీ ఫలితాలు...ఎమ్మెల్యేల‌కు హెచ్చరిక!

ఎమ్మెల్సీ ఫలితాలు...ఎమ్మెల్యేల‌కు హెచ్చరిక!

శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బోల్తా కొట్టింది. ప్ర‌ధాన ప్రతిపక్ష టీడీపీ అనూహ్యమైన విజయం సాధించింది. దీంతో తెలుగుదేశం పుంజుకుందని, వైసీపీ పని అయిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ ఫలితాలు 2024 సాధారణ ఎన్నికలకు సంకేతంగా నిలుస్తున్నాయని, ఇలాంటి ఫలితాలే రానున్న ఎన్నికల్లో పునరావృత్తం అవుతాయని విశ్లేషిస్తున్నారు. అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అపజయానికి కారణాలేంటి? ఇది తెలుగుదేశం పార్టీ విజయమా? అధికార పార్టీ వైఫల్యమా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ వైఫల్యానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలే ప్రధాన బాధ్యులుగా కనిపిస్తారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోలేదు. ఓటర్ల నమోదు నుంచి పోలింగ్‌ దాకా ఈ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాల‌ని అడిగిన నాథులు లేరంటే ఆశ్చర్యం వేయకమానదు. కనీసం కరపత్రం కూడా ఓటర్లకు చేరలేదనేది వాస్తవం. వైసీపీకి ఓటు వేయాలనుకున్నా, ఆ పార్టీ అభ్యర్థి ఎవరో కూడా తెలియని దుస్థితి.

గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం వీరోచితంగా పోరాడిన యువకులకూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు లేవంటే నమ్మకపోవచ్చు గానీ, ఇది పచ్చినిజం. గ్రామాల్లో, వార్డుల్లో వైసీపీకి కచ్చితంగా ఓట్లు వేసేవాళ్లు ఎవరున్నారు, వారిని ఓటర్లుగా చేర్చడం ఎలా అనేది ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. కొన్నిచోట్ల నాయకులు దరఖాస్తులు సమీకరించి, అధికారులకు అందజేశారు. అలా దరఖాస్తులు ఇచ్చిన వారికి ఓటు వచ్చిందా రాలేదా, అధికారులు ఎందుకు తిరస్క‌రించార‌నేది కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. తమ సొంత ఆసక్తి కొద్దీ దరఖాస్తు చేసుకుని, ఓటు హక్కు సంపాదించుకున్నా....వారి ఇళ్లకు వెళ్లి వైసీపీకి ఓటు వేయమని అడిగే దిక్కే లేకుండా పోయింది. కనీసం కరపత్రమైన ఓటర్లందరికీ చేర్చిన దాఖలాలు లేవు. వైసీపీ కుటుంబాల్లోని వారికే ఓట్లు లేవంటే నమ్మకం కుదరకపోవచ్చుగానీ, ఇది వాస్తవం.

ఇక ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేలు పాల్గొనడం గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఒకరిద్దరు మినహా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఒక్క రోజు కూడా స్వయంగా ప్రచారంలో పాల్గొనలేదు. వైసీపీ గ్రామస్థాయి కేడర్‌లో ఒక విధమైన నిర్లిప్తత నెలకొంది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతో వుంటూ, పార్టీని గెలిపించడం కోసం డబ్బులు ఖర్చు పెట్టుకుని, కేసులు ఎదుర్కొని నిలబడిన తృతీయ శ్రేణి కార్యకర్తలను ఎమ్మెల్యేలు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.

ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగాలి. ఎమ్మెల్సీ ఫలితాలపై లోతైన సమీక్ష చేపట్టాలి. గ్రామ స్థాయి నుంచి వైసీపీకి అనుకూలమైన ఓటర్లు ఎందరున్నారు, ఎందుకు ఈ ఎన్నికల్లో ఓట్లు నమోదు చేసుకున్నారు, ఎందరు చేసుకోలేదు, దరఖాస్తు చేసుకున్నా ఎంత మందికి ఓటు వచ్చింది, రాకుంటే ఎందుకు రాలేదు, అధికారులు ఎవరైనా కావాలనే తొలగించారా, ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారా, కనీసం కరపత్రమైనా చేర్చారా, ఎమ్మెల్యేలు ఎన్ని రోజులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు...త‌దిత‌ర‌ అంశాలపైన సమీక్షించాలి. అప్పుడే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణాలు తెలుస్తాయి. క్షేత్రస్థాయిలో ఏం జ‌రుగుతున్న‌దో తెలుస్తుంది. 2024 ఎన్నికలకు ఇంకా ఏ విధంగా సమాయత్తమవ్వాలో అర్థమవుతుంది.

ఇదే సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్రామ స్థాయి వరకు తమ ఓటర్లను గుర్తించి, వారిని ఓటర్లుగా చేర్పించింది. ఈ పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లును కలిశారు. ఓటు వేయమని అభ్యర్థించారు. ఆ శ్ర‌మే ఇప్ప‌టి ఫలితాల‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?