
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ భయమే నిజమైంది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఇంటి పేరుకు తగ్గట్టే ...గట్టి పంచ్ విసిరారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ చావు దెబ్బతీసింది. దీంతో వైసీపీ గింగరాలు తిరుగుతోంది. ఇటీవల పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ అప్రమత్తంగా లేకపోవడం వల్ల మూడు చోట్ల ఓడిపోయిందని భావించారు. వైసీపీపై కేడర్‌లో అసంతృప్తి వుందని, ఒకసారి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో సొంత పార్టీ శ్రేణులే వ్యతిరేకంగా ఓట్లు వేశారని సర్ది చెప్పుకున్నారు.
అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరికి ఎమ్మెల్యేల్లో కూడా జగన్‌పై వ్యతిరేకత వుందని టీడీపీ గెలుపు ద్వారా రుజువైంది. ఇది వైసీపీకి అతిపెద్ద షాక్. ఏ ఒక్క ఎమ్మెల్యే తమ నుంచి జారిపోకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కోరినట్టుగా నిధుల కేటాయింపు, అలాగే అడిగిన పనులన్నీ చేస్తామని హామీ ఇచ్చారు.
అయినప్పటికీ వైఎస్ జగన్‌ను కొందరు ఎమ్మెల్యేలు నమ్మలేదు. నిజానికి టీడీపీ బలం 19 మాత్రమే. కానీ టీడీపీ అభ్యర్థి అనురాధ గెలుపునకు ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు అవసరమైంది. వీరిలో ఇప్పటికే ఇద్దరు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మద్దతు పలికినట్టు తేలిపోయింది. వీరితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడం వైసీపీకి షాక్ ఇచ్చే అంశం.
టీడీపీ ఒకరి మద్దతు చాలనుకుంటే, ఏకంగా ఇద్దరు అండగా నిలవడం విశేషం. తాజా ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంతో జగన్‌పై సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత వుందనేది స్పష్టమైంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ వ్యూహం ఎలా వుండనుందో చూడాలి. ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ గెలుపుతో టీడీపీ నేతలు, కార్యకర్తలు మరోసారి సంబరాల్లో మునిగిపోయారు. రానున్న రోజుల్లో అధికారం మాదే అని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా