Advertisement

Advertisement


Home > Politics - Andhra

విశాఖ రాజధాని...తమ్ముళ్ళు ఏమంటారు...?

విశాఖ రాజధాని...తమ్ముళ్ళు ఏమంటారు...?

విశాఖ రాజధాని అంటే విపక్షాలకు ఏ రకమైన భావన ఉందో తెలిసిందే. తెలుగుదేశం అయితే మొదట్లో అమరావతే మన రాజధాని అని చెబుతూ ఆందోళనలు చేసింది. లోకల్ బాడీ ఎన్నికల్లో ఫలితాలు తేడా కొట్టడంతో సైలెంట్ అయింది. అప్పటి నుంచి అమరావతి గురించి పెద్దగా బయటకు మాట్లాడింది లేదు. అదంతా వ్యూహాత్మకమే అని అందరికీ తెలుసు.

విశాఖ రాజధాని వద్దు అని చంద్రబాబు లాంటి వారు సైతం నేరుగా అనకుండా విశాఖను తాము అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామనే ఉత్తరాంధ్రా టూర్లో చెబుతూ వస్తున్నారు. ఇపుడు ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం గెలిచింది. మంచి మెజారిటీతో ఈ సీటు సొంతం అయింది. దాంతో ఉత్తరాంధ్రా ప్రజలు విశాఖలో రాజధానిని కోరుకోవడం లేదని ప్రచారం మొదలైంది.

జన జాగరణ సమితి పేరుతో కొందరు గో బ్యాక్ జగన్ సార్ బిల్డ్ అమరావతి కాపిటల్ అంటూ ఫ్లెక్సీలు పెట్టారు, పోస్టర్లు వేశారు. అంటే విశాఖ రాజధానిగా వద్దు అని అర్ధం చేసుకోవాలి. ఇంతటి ఘనమైన విజయంలోనూ తమ్ముళ్ళు మాత్రం విశాఖ రాజధాని వద్దు అన్న మాటను అయితే ఓపెన్ గా బయటకు చెప్పలేకపోతున్నారు. జన జాగరణ సమితి అంటే ఎవరా అని వైసీపీ నేతలు ఆరా తీస్తున్నారు.

ఇలా జగన్ మీద వ్యతిరేక పోస్టర్లు వేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ గా ఉన్న గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేశారు. అంతా కలిపి రెండు లక్షల ఓట్లు. ఉత్తరాంధ్రాలో దాదాపుగా కోటి మందికి దరిదాపులలో జనాభా ఉంది. మరి ఈ రెండు లక్షల ఓట్లేనా ప్రమాణం అన్నది మేధావులే జవాబు చెప్పాల్సి ఉంటుంది.

పైపెచ్చు ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం ఈ ఎన్నికలు విశాఖ రాజధానికి రెఫరెండమని ఎక్కడా చెప్పలేదు. అసలు మూడు రాజధాను అజెండా మీదనే ఈ ఎన్నికలు జరగలేదు. అలాంటిది విశాఖ రాజధాని వద్దు అని జనాలు అంటున్నారని, ఇదే వారి తీర్పు అని డైరెక్ట్ గా టీడీపీ నేతలు అనకుండా ఎవరెవరో ఫ్లెక్సీలు పెట్టి ప్రచారం చేస్తున్నారు అంటే ఈ రాజకీయం వెనక ఎవరున్నారు అన్నదే చూడాల్సి ఉంది అంటున్నారు.

సార్వత్రిక ఎన్నికలు ఇంకా ఏడాది టైం ఉంది. ఇప్పటి నుంచే విశాఖ రాజధాని వద్దు అమరావతి ముద్దు అని టీడీపీ బాహాటంగా జనంలోకి వెళ్ళి తీర్పు కోరితే 2024లో అన్ని వర్గాలు ఇచ్చే తీర్పు అంతిమం అవుతుంది. అంతే తప్ప ఒక పరిమితమైన సంఖ్యలో ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పుని మొత్తం జనరలైజ్ చేసేసి విశాఖ రాజధానిగా ఎవరూ కోరడం లేదని అంటే సబబేనా అన్నదే ఆలోచించాలి. 

ఇంత జరిగినా విశాఖ రాజధాని వద్దు అని టీడీపీ డైరెక్ట్ గా డేరింగ్ గా బయటకు చెబుతుందా అని వైసీపీ నేతల నుంచి వస్తున్న అసలైన సవాల్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?