Advertisement

Advertisement


Home > Politics - Andhra

చిరంజీవ...చిరంజీవ...టీడీపీ పునరుజ్జీవం

చిరంజీవ...చిరంజీవ...టీడీపీ పునరుజ్జీవం

ఘనాపాటి నాయకులు అంతా అక్కడ ఉన్నారు. మేటి నేతలు, మేరు నగధీరులూ ఉన్నారు. పార్టీ వల్ల ప్రయోజం పొంది అధికార పదవులు అనుభవించిన వారూ ఉన్నారు. కానీ నాలుగేళ్ళుగా పసుపు పార్టీకి కళ తీసుకురాలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలో వరసబెట్టి ఓటములే ఎదురవుతున్నాయి. లోకల్ బాడీస్ లోనూ అదే పరాభవం పలకరించింది.

ఇపుడు మాత్రం సీన్ మారింది. ఆయన జనవరి 31 దాకా తెలుగుదేశానికి సంబంధంలేని వారు. ఆయన ఒక సాధారణ  ఉపాధ్యాయుడు. పోటీ పరీక్షలకు తర్ఫీదు ఇచ్చే విద్యావేత్తగా ఉన్నారు. ఆయనే వేపాడ చిరంజీవరావు. ఆయనను ఎలా పట్టుకున్నారో కానీ టీడీపీ దశ తిరిగింది అనే చెప్పాలి. వేపాడ చిరంజీవరావుకు మూడు జిల్లాలలో సొంతంగా నెట్ వర్క్ ఉంది.

యూత్ తో నేరుగా కనెక్షన్స్ ఉన్నాయి. ఆయన సొంత బలంతో పాటు ఆయన సొంత సామాజికవర్గం బలం కూడా కలసి వచ్చాయి. దానికి తెలుగుదేశం నాయకుల కసి కృషి తోడు కావడంతో ఉత్తరాంధ్రా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో మొట్టమొదటిసారి తెలుగుదేశం గెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు ఏడాది కాలంలో ఉన్న వేళ ఈ విజయం తెలుగుదేశానికి మంచి బూస్టింగ్ గానే భావించాలని అంటున్నారు.

పట్టభద్రుల నియోజకవర్గంలో తెలుగుదేశం గెలుపు ఘనత ఎవరిదీ అంటే అందరూ మేమే అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి అంతా కష్టపడ్డారు కానీ మేలిమి బంగారం లాంటి అభ్యర్ధి ఆ పార్టీకి దొరికారు. ఆయనకు టీడీపీతో అనుబంధం నలభై రోజుల క్రితం వరకూ లేకపోయినా ఆయన తన జాతకాన్ని మార్చుకుని తెలుగుదేశం జాతకాన్ని కూడా మార్చేశారు.

ఓటములతో ఎండమావిగా మారిన ఉత్తరాంధ్రా టీడీపీకి ఆయన ఊపిరి పోశారు. చిరంజీవ చిరంజీవ అని దీవిస్తూ టీడీపీకి పునరుజ్జీవం కలిగించారు. వాస్తవానికి టీడీపీ మొదటి క్యాండిడేట్ ఒక బీసీ మహిళ, ఆమె కార్పోరేటర్. చివరి నిముషంలో వచ్చిన చిరంజీవి తన లక్ తో తెలుగుదేశం లెక్క కూడా మార్చేశారు అని అంటున్నారు. ఈ దెబ్బతో విశాఖ సహా ఉత్తరాంధ్రా టీడీపీలో ఆయన పెద్ద నాయకుడిగా మారినా ఆశ్చర్యం లేదు, తప్పు అంతకంటే లేదు. ఆపదకాలంలో ఆదుకున్న వారే కదా వేలుపులు. అలా టీడీపీకి కలిసొచ్చే కాలన్ని తెచ్చిన చిరంజీవరావుని తెలుగుదేశం శ్రేణులు అంతా తెగ మెచ్చుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?