టీఎస్పీఎస్సీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీంతో పాటు ఏఈఈ, డీఏవో పరీక్షలను సైతం రద్దు చేసింది.
మరోవైపు జూనియర్ లెక్చరర్ల పరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్ష షెడ్యూల్ ప్రకారం జూలైలో జరగాల్సి ఉంది. ప్రశ్నపత్రాల లీకేజీ కేసు నేపథ్యంలో ఈ పరీక్షను కూడా వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో జూనియర్ లెక్చరర్ల ప్రశ్నపత్రం కూడా ఉన్నట్లు గుర్తించారు.
ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఎ1 నిందితుడు ప్రవీణ్‌కు గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 103 మార్కులు రావడం తెలిసిందే. తనదగ్గరున్న పెన్‌డ్రైవ్‌లో ఈనెల 5వ తేదీన జరిగిన ఏఈ పరీక్షతో పాటు, 12వ తేదీన జరగాల్సిన టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్లు.. అంతేకాకుండా భవిష్యత్తులో జరగబోయే అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఉద్యోగ నియామక పేపర్లను పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగం చేస్తు ప్రవీణ్ చేసిన పనికి లక్షలాది నిరుద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్ణయిస్తారనేది తెలియల్సిఉంది.