Advertisement

Advertisement


Home > Politics - Andhra

మెట్రో రైలు కూతకు కుంటి సాకులెందుకు....?

మెట్రో రైలు కూతకు కుంటి సాకులెందుకు....?

విశాఖ ఏపీలోనే మెగా సిటీ. ఏపీ ప్రభుత్వం రాజధానిగా ప్రతిపాదించినా కాకపోయినా విశాఖ సరిసాటి సిటీ మరోటి ఏపీలో లేదు అన్నది అందరికీ తెలిసిన పచ్చి నిజం. దేశంలో మెట్రో సిటీలలో మెట్రో రైలు కూత పెడుతోంది. విశాఖ విషయంలో మాత్రం ఎందుకో ఆ సౌభాగ్యం లేకుండా పోయింది.

దీనికి పాలకుల శీతకన్ను కారణం అన్నది అందరూ గుర్తెరిగిన వాస్తవం. వేరే రాష్ట్రాలకు మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం వేల కోట్లు కుమ్మరిస్తున్న కేంద్రం ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం కుంటి సాకులు చెబుతోంది. ఇప్పటికి పదేళ్ళ నుంచి మెట్రో రైలు అన్నది కేవలం కాగితాలకే పరిమితం అయింది. నోటి మాటలకే కట్టుబడిపోయింది. ఇలా ఎందువల్ల అంటే ఏవేవో చెబుతూ వస్తున్నారు. ఈ విషయం మీద బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ ప్రశ్న వేసి కేంద్రం నుంచి జవాబు రాబట్టి ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్ట్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది అని జీవీఎల్ అంటున్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు ఏవీ కేంద్రానికి వెళ్ళలేదని ఆయన అంటున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి హర్దీప్ పూరీ ఇచ్చిన సమాధానం జీవీఎల్ పట్టుకుని అక్కడికి తామేదో వేల కోట్లు ఏపీకి ఇచ్చి మరీ మెట్రో రైలు కూత పెట్టించాలనుకుంటే కాదనుకుంటున్నారు అన్నట్లుగా చెబుతున్నారు.

అప్ప ఆరాటమే అన్నట్లుగా ఏపీ నుంచి ఎన్నో ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్ళినా అక్కడ నుంచి ఆశించిన కార్యాచరణ ఏమైనా వచ్చిందా అంటే నిరాశే జవాబుగా ఉంటుంది. ప్రత్యేక హామీ పోలవరం ప్రాజెక్ట్ విభజన హామీకి సంబంధించిన ఆచరణ గురించి కేంద్రం విషయంలో ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది అన్నట్లుగానే పరిస్థితి ఉంది.

మెట్రో రైలు ప్రాజెక్ట్ విషయంలో అంత చురుకుగా ఆలోచించే కేంద్రం ఈపాటికే ఆ దిశగా సరైన చర్యలు తీసుకుని ఉండేదని అంటున్నారు. రైల్వే జోన్ విషయంలో అంతా అయిపోయింది అని చెప్పి ఇప్పటికి నాలుగేళ్ల పుణ్య కాలం గడిపేసిన కేంద్రానికి మెట్రో రైలు ప్రాజెక్ట్ గురించి ప్రేమ ఉందని బీజేపీ నేతలు చెబితే విని ఊరుకోవాల్సిందే.

అయినా విశాఖ మెట్రో ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్తగా డీపీయార్ ని రెడీ చేసిందని చెబుతున్నారు. కేంద్ర పెద్దలు ప్రతిపాదనలు రాలేదు అని అంటున్నారంటే ఎక్కడ గ్యాప్ వచ్చిందో చూసుకోవాల్సిందే. కేంద్రం బులపాటం ఏంటో చూసేందుకైనా డీపీయార్ ని ఇవ్వడంలో తప్పులేదు. ఇలా డీపీయార్ ఇస్తే అలా ప్రాజెక్ట్ కి ఓకే చెబుతామంటున్న కేంద్రం తీరు కూడా అచ్చంగా జనాలకు తెలుస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?