Advertisement

Advertisement


Home > Politics - Andhra

వామపక్షాల మద్దతు ఏ పార్టీకి?

వామపక్షాల మద్దతు ఏ పార్టీకి?

నల్లగొండ జిల్లా అంటేనే పోరాటాల గడ్డ. నిజాంపై పోరాటం చేసిన ప్రాంతాల్లో ఈ జిల్లా మొదటి స్థానంలో ఉంటుంది. సుట్టూముట్టూ సూర్యాపేట ...నట్టనడుమ నల్లగొండ ...వాడుండేదైదరాబాదు ...అంటూ అలనాడు నిజాంపై ఉధృతంగా పోరాటం సాగించారు నల్గొండ జిల్లా ప్రజలు. ప్రజలను పోరాటానికి పురిగొల్పింది, నాయకత్వం వహించింది కమ్యూనిస్టు పార్టీలు. 

ఇప్పుడంటే ఆ పార్టీలకు ప్రజల్లో ఆదరణ తగ్గిందిగానీ ఒకప్పుడు ఎర్ర వీరుల హవా జోరుగా సాగింది. వారి హవా ఎంత తగ్గినా ఆ పార్టీల ప్రభావం అంతో ఇంతో ఉందనే చెప్పొచ్చు. అందుకే మునుగోడు ఉప ఎన్నికలో గెలుపుకోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కమ్యూనిస్టుల మద్దతు కోరుతున్నాయి. కమ్యూనిస్టులు తమకు మద్దతు ఇస్తారంటే తమకు మద్దతు ఇస్తారని ప్రచారం చేసుకుంటున్నాయి.

వామపక్షాలతో సంప్రదింపులు జరపాలని కేసీఆర్ ఆల్రెడీ తన పార్టీ నాయకులను ఆదేశించారు. సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులతో తాను కూడా సమావేశమవుతానని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీని ఓడించడానికి కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కోరారు. మరి ఎర్ర పార్టీలు ఏ పార్టీకి మద్దతు ఇస్తాయో చూడాలి. 

మునుగోడు గడ్డ మొదటి నుంచి పోరాటాలకు కేంద్రంగా నిలిచింది. మొదటి నుంచి కమ్యూనిస్టుల కోట. వామపక్ష ఉద్యమాలకు ఊపిరిపోసింది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఇక్కడి నేతలు కీలకంగా వ్యవహరించారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 27 వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 70 శాతం మంది ఓటర్లు బీసీ వర్గాలకు చెందినవారే. గౌడ్, యాదవ, పద్మశాలి, ముదిరాజ్ వర్గాల ఓటర్లు భారీగా ఉన్నారు.

ఎస్టీ ఓటర్లు కీలకమే. గిరిజన ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. రెడ్డి ఓటర్లు దాదాపు 15 వేల వరకు ఉన్నారు. నియోజకవర్గంలో రెడ్డీ నేతలదే హవా సాగుతోంది. మునుగోడు నుంచి ఇప్పటివరకు బీసీ నేతలు ఎమ్మెల్యే కాలేకపోయారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండు సార్లు బీసీ నేతను బరిలోకి దింపినా ఫలితం సాధించలేకపోయారు. మునుగోడు నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. 

చౌటుప్పల్,చండూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. 1967లో మునుగోడు నియోజకవర్గం ఏర్పడింది. అంతకుముందు కొండూరు నియోజకవర్గంలో భాగంగా ఉండేది. మునుగోడు అసెంబ్లీకి ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆరు సార్లు కాంగ్రెస్ గెలిచింది. ఐదు సార్లు కమ్యూనిస్టులు విజయం సాధించారు.

2014లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. మునుగోడు పేరు చెప్పగానే వినిపించేది మాజీ మంత్రి దివంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. ఆయన ఇక్కడి నుంచి ఆదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీపీఐ నుంచి ఉజ్జిని నారాయణరావు మూడు సార్లు గెలిచారు. ఆయన కుమారుడు యాదగిరి రావు ఒకసారి గెలిచారు. 2004లో సీపీఐ నుంచి పల్లా వెంకట్ రెడ్డి గెలిచారు. 2014లో టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచారు. 2018లో మాత్రం రాష్ట్రమంతా కేసీఆర్ హవా వీచినా మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 22 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు.  

మునుగోడు సీటు గెలుచుకోవడానికి తమ బలం చాలాదేమోనని కాంగ్రెస్, టీఆర్ఎస్ భయపడుతున్నాయి. కమ్యూనిస్టులు ధీమాగా ఉంటే గెలవగలమని ధీమాగా ఉన్నాయి. చూడాలి ఏమౌతుందో.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?