Advertisement

Advertisement


Home > Politics - National

రిషి సునాక్ మాటలు మన నేతలకు వినబడుతున్నాయా?

రిషి సునాక్ మాటలు మన నేతలకు వినబడుతున్నాయా?

స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు ఏ రకమైన ఎన్నికలొచ్చినా సరే (ఉప ఎన్నికలు కూడా) మన నాయకులు హామీలతో రెచ్చిపోతుంటారు. అరచేతిలో స్వర్గం చూపిస్తుంటారు. బమ్మిని తిమ్మిని చేస్తామంటారు. 

నలభై ఏళ్ళ అనుభవం ఉన్న నాయకులు కావొచ్చు, పదేళ్ల అనుభవం ఉన్న నేతలు కావొచ్చు వెనుకా ముందు ఆలోచించకుండా, రాష్ట్రానికి లేదా దేశానికి ఉన్న ఆర్ధిక వనరులేమిటన్నది ఆలోచించకుండా హామీలు ఇస్తుంటారు. తీరా అధికారంలోకి వచ్చి హామీలు నెరవేర్చాల్సి వచ్చేసరికి మీనమేషాలు లెక్కపెడతారు. అనేక కతలు వినిపిస్తారు.

ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వనివి కూడా నెరవేర్చామంటూ కల్లబొల్లి మాటలు చెబుతారు. చాలామంది నాయకులు అభివృద్ధిని మర్చిపోయి ఉచిత పథకాల బాట పట్టారు. బటన్ నొక్కుడు కార్యక్రమాలు మొదలు పెట్టారు. కుటుంబానికి ఎంత డబ్బు ఇచ్చామని చూస్తున్నారేగానీ ఎంత మేరకు అభివృద్ధి పనులు చేశామని చూడటం లేదు. భావి తరాల భవిష్యత్తును పట్టించుకోవడంలేదు. ఇలాంటి నాయకులంతా బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న, భారతీయ మూలాలు ఉన్న, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడైన రిషి సునాక్ చెప్పిన మాటలు వినాలి. వింటే ఏం ప్రయోజనం? మార్పు వస్తుందా? పాడా? వింటే బాగుంటుందని మన ఆశ. అంతే. 

ఇంతకూ రిషి సునాక్ ఏం చెప్పాడు? తప్పుడు వాగ్దానాలతో గెలవడం కంటే ఓడిపోవడమే మేలు అన్నాడు. ఏం చేసైనా ఎన్నికల్లో గెలవాలని మనోళ్లు తాపత్రయ పడుతుంటే ఆ మాటలు ఎందుకు ఆలకిస్తారు? బ్రిటన్‌ ప్రధాని పీఠం కోసం కన్జర్వేటివ్ నేతలు రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్ మధ్య పోరు తీవ్రంగా సాగుతున్న విషయం తెలిసిందే కదా. దేశ ప్రజలను ఆకట్టుకునే ఎత్తుగడలతో విజయ తీరాలకు చేరేందుకు వీళ్లిద్దరూ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో వార్తా సంస్థ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషి సునాక్‌ మాట్లాడారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తప్పుడు వాగ్దానాలతో విజయం సాధించడం కంటే ఓడిపోవడం మేలని అభిప్రాయపడ్డారు. 

అలాగే జీవన వ్యయాలు పెరగడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కుటుంబాలను ఆదుకోవడానికి తాను కట్టుబడి ఉన్నానని ఈ సందర్భంగా వెల్లడించారు. తన ప్రత్యర్థి లిజ్‌ ట్రస్ పన్నుల్లో కోతలు విధిస్తానంటూ ఇచ్చిన హామీ గురించి రిషి సునాక్‌ ప్రస్తావించారు. దీనివల్ల అవసరంలో ఉన్నవారి కంటే ధనవంతులకే మేలు జరుగుతుందన్నారు. 'ఇలాంటి తప్పుడు వాగ్దానాలతో నేను గెలవడం కంటే ఓడిపోవడమే మేలు. ఈ గడ్డు పరిస్థితుల్లో ప్రజలకు సహకరించాలని నిశ్చయించుకున్నాను. ప్రజల డబ్బు తీసుకోకుండా ఉండేందుకే నేను ప్రాధాన్యత ఇస్తాను' అని వెల్లడించారు. తాను ప్రధానమంత్రిగా ఎన్నికైతే ..ఇప్పటికే చెప్పినవాటికంటే మెరుగైన నిర్ణయాలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

'ప్రజలు ద్రవ్యోల్బణం గురించి ఆందోళన చెందుతున్నారు. పెరిగిన విద్యుత్‌ ఛార్జీల గురించి కంగారు పడుతున్నారు. ప్రధాని అయితే ఆ కుటుంబాలను ఆదుకోవడానికి మరిన్ని తగిన నిర్ణయాలు తీసుకుంటాను. నేను గతంలో కొన్ని చర్యలు ప్రకటించాను. కానీ అప్పటితో పోల్చుకుంటే ప్రస్తుతం పరిస్థితి దిగజారింది. అందుకు తగిన విధంగా ముందుకు వెళ్తాను' అని చెప్పారు. 

ఇప్పటివరకు వెలువడిన సర్వేల ప్రకారం సునాక్‌ కంటే ట్రస్‌ మెజార్టీలో ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీల్లో సునాక్‌కు అధిక మద్దతు ఉన్నప్పటికీ.. టోరీల్లో ఎక్కువ మంది ట్రస్‌ వైపు మొగ్గుచూపుతున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను