భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంతరంగానికి, ఆయన పైకి మాట్లాడుతున్న అంశాలకు పూర్తి విరుద్ధంగా ఉంది. కానీ ఆయన మాటలు మనసులో ఏమున్నదో చెప్పకనే చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి, దాని ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో మునుగోడుకు ఉప ఎన్నిక రానుంది.
అయితే తమ్ముడి రాజీనామా అన్న వెంకటరెడ్డికి ఇబ్బందిగా మారింది. తమ్ముడితో పాటు అన్నను కాంగ్రెస్ నుంచి వెళ్లగొట్టడానికి ఇదే మంచి తరుణమని కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యతిరేకులు వ్యూహాలు రచిస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పరుష వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఆయనకు సన్నిహితులైన కాంగ్రెస్ నాయకులు పనిలో పనిగా వెంకటరెడ్డిని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ పరిణామాలు వెంకటరెడ్డికి జీర్ణించుకోలేకున్నాయి.
అయితే తమ్ముడిలా రాజీనామాల జోలికి వెంకటరెడ్డి వెళ్లదలుచుకోలేదు. కాంగ్రెస్ పార్టీనే తనకు తానుగా వెళ్లగొట్టాలని ఆయన కోరుకుంటున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే వుంటూ, రేవంత్‌రెడ్డి, ఇతర నాయకుల అంతు తేలుస్తానని ఆయన హెచ్చరిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక విషయమై పార్టీ పెద్దలెవరూ తనతో మాట్లాడ్డం లేదన్నారు. పార్టీ నుంచి తనను వెళ్లగొట్టాలని అనుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
తనను పంపి కాంగ్రెస్‌ను ఖాళీ చేయాలని అనుకుంటున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తనది కాంగ్రెస్ రక్తమన్నారు. తాను మొదటి నుంచీ కాంగ్రెస్‌లోనే వుంటున్నానని, మూడునాలుగు పార్టీలు మారలేదని పరోక్షంగా రేవంత్‌రెడ్డిని దెప్పి పొడిచారు. రాహుల్, సోనియాగాంధీల వద్దే తేల్చుకుంటానని వెంకటరెడ్డి హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి తనను తరిమేయాలని, తద్వారా సానుభూతి పొందాలని ఆయన కోరుకుంటున్నారు. అలాగే రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత ప్రముఖులంతా కాంగ్రెస్ నుంచి వెళ్లగొడుతున్నారనే సంకేతాల్ని పంపాలని ఆయన ఎత్తుగడ వేసినట్టు కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలకే పుణ్యకాలం కాస్త కరిగిపోతోంది.