Advertisement

Advertisement


Home > Politics - Andhra

జ‌గ‌న్‌కు వైసీపీ కార్య‌క‌ర్త విన్న‌పం!

జ‌గ‌న్‌కు వైసీపీ కార్య‌క‌ర్త విన్న‌పం!

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన మూడేళ్ల త‌ర్వాత ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు ఎట్ట‌కేల‌కు కార్య‌క‌ర్తలు గుర్తొచ్చారు. సంతోషం.. అయితే కార్య‌క‌ర్త‌ల భేటీ పేరుతో నిర్వ‌హిస్తున్న స‌మావేశంలో మాట్లాడేందుకు అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డం ఆవేద‌న క‌లిగిస్తోంది. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో ఇలా వుండేది కాదు. వైఎస్సార్ ముఖ్య‌మంత్రి అయిన వెంట‌నే త‌న‌ను న‌మ్ముకున్న నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను మ‌ర‌వ‌కుండ శ‌క్తిమేర‌ మంచి చేశారు. 

మ‌రోవైపు రాష్ట్ర ప్ర‌జానికానికి తాను ఇచ్చిన హామీల‌ను వైఎస్సార్ నెర‌వేరుస్తూ ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందారు. ఇటు ప్ర‌జ‌లు, అటు కాంగ్రెస్‌ కార్య‌క‌ర్త‌ల యోగక్షేమాలను స‌మపాల‌ల్లో వైఎస్సార్ చూశారు. దీంతో ఆయ‌న అంద‌రి హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయారు. వైఎస్సార్‌ అకాల మ‌ర‌ణం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను శోకసంద్రంలో ముంచింది. అది వైఎస్సార్‌ అంటే ప్ర‌జ‌ల్లో ఉండే స్థానం.

జ‌నం త‌మ అభిమాన నాయకుడు వైఎస్సార్‌ను ఆయ‌న కుమారుడు వైఎస్ జ‌గ‌న్‌లో చూసుకున్నారు. జ‌గ‌న్‌ని కంటికి రెప్ప‌లా చూసుకున్నారు. కాంగ్రెస్ క‌క్ష క‌ట్టి జ‌గ‌న్‌ను జైల్లో పెట్టిన‌ప్ప‌టికీ ఆయ‌న‌పై అభిమానం త‌గ్గ‌లేదు. 2014 ఎన్నిక‌ల ముందు జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. కేవ‌లం  2 శాతం లోపు ఓట్ల తేడాతో అధికారాన్ని వైసీపీ చేజార్చుకుంది. చంద్ర‌బాబు నేతృత్వంలో టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది.  

2014 నుంచి 2019 వ‌ర‌కూ చంద్ర‌బాబు పాల‌న‌లో వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఎన్నో ఇబ్బందులు ప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్‌ను వీడ‌లేదు. ఎంతో మంది వైసీపీ సోష‌ల్ మీడియా వార‌ధులు, కార్య‌క‌ర్తలు జైలు, కోర్టుల చుట్టూ తిరిగారు. ఎంతో మంది త‌మ అస్తులు పోగొట్టుకొని గ్రామాల్లో టీడీపీకి దీటుగా నిల‌బడ్డారు. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ వెంట న‌డుస్తూ ప్ర‌జాద‌ర‌ణ పెరిగేలా కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు వ్య‌వ‌హ‌రించారు. 2019లో వైసీపీ ఘ‌న విజ‌యం సాధించ‌డానికి కార్య‌క‌ర్త‌లే ప్ర‌ధాన కార‌ణం. 

జ‌గ‌న్ సీఎం అయిన త‌ర్వాత క‌నీసం ఎమ్మెల్యేలు, కార్య‌క‌ర్త‌ల‌ను కూడా ప‌ట్టించుకోలేదు. కార్య‌క‌ర్త‌ల గోడు, టీడీపీ హ‌యాంలో పెట్టిన కేసుల‌ను ప‌ట్టించుకునే వారే క‌రువ‌య్యారు. స‌చివాల‌య వ్య‌వ‌స్థ తీసుకొచ్చి, వాలంటీర్ల‌ను నియ‌మించుకున్నారు. దీని వ‌ల్ల లాభంతో పాటు న‌ష్టం లేక‌పోలేదు. పార్టీ కోణంలో చూస్తే తీవ్ర‌న‌ష్ట‌మ‌నే చెప్పాలి. క‌నీసం అర్హులైన కార్య‌క‌ర్త‌ల‌కు పింఛ‌న్లు, త‌దిత‌ర సంక్షేమ ప‌థ‌కాల‌ను అందించే అధికారం కూడా గ్రామ‌నాయ‌కుల‌కు లేకుండా పోయింది. దీంతో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో నిస్తేజం నెల‌కుంది. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల చుట్టు తిరుగుతున్నా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. 

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న‌ వారికి ఏవైనా కాంట్రాక్ట్‌ ప‌నులు ఇవ్వ‌డం లాంటివి చేయ‌డం లేదు. ఒక‌వేళ ప‌నులు ఇచ్చినా బిల్లుల మంజూరు చేయ‌క‌పోవ‌డంతో మ‌రింత ఇబ్బందుల్లో ప‌డుతున్న ప‌రిస్థితి.  కొన్ని చోట్ల ఏకంగా ఎమ్మెల్యేలే బినామీల పేరుతో ప‌నులు చేస్తున్నారు.

పార్టీ ప్లీన‌రీలో నైనా కార్య‌క‌ర్త‌ల స‌మ‌స్య‌లు చ‌ర్చిస్తారా అనుకుంటే అది జ‌ర‌గ‌లేదు. జ‌గ‌న్ చుట్టూ ఉండే భ‌జ‌న బ్యాచ్ నాయ‌కుడికి ఏమీ తెలియ‌కుండా చేస్తోంది. ఇప్పుడు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గ కార్య‌క‌ర్త‌ల‌తో మీ కార్యాల‌యంలో మీతో కూర్చొని స‌మస్య‌లపై చ‌ర్చా వేదిక అంటే చాలా సంబుర‌ప‌డ్డాం. తీరా నిన్న జ‌రిగిన కుప్పం కార్య‌క‌ర్త‌ల మీటింగ్ లో కూడా మీరు చెప్పింది త‌ప్ప కార్య‌క‌ర్త‌ల నోటికి తాళం వేయ‌డం బాధ క‌లిగించింది.  

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రావాలంటే ఉచిత ప‌థ‌కాలు ఒక‌టే స‌రిపోవు. స‌రైన‌ కార్య‌క‌ర్తల అవ‌స‌రం చాలా ఉంది. ఎలాంటి లాభాపేక్ష‌లేకుండా ప‌నిచేసేది కార్య‌క‌ర్త మాత్ర‌మే. వారికి నిజాయ‌తీగా ద‌క్కాల్సిన‌వి కూడా లేకుండా చేస్తే మాత్రం వారి ఆగ్ర‌హానికి గురి కావాల్సి వ‌స్తుంది. కార్య‌క‌ర్త‌ల వైపు నుంచి కూడా అలోచిస్తే పార్టీ ప‌ది కాలాలు బ‌తుకుతుంది అని మిమ్మ‌ల్ని అభిమానించే కార్య‌క‌ర్త‌గా విన్నించుకుంటున్నా.

- మీ అభిమాని

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా