హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వైసీపీకి తలనొప్పిగా మారింది. సమర్థించాలో, చర్యలు తీసుకోవాలో తెలియక వైసీపీ గందరగోళానికి గురైంది. ఈ లోపు పుణ్యకాలం కాస్త మించిపోయింది. గోరంట్ల మాధవ్‌తో పాటు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర డ్యామేజీ చేశాయి. మరోవైపు తనపై టీడీపీ కుట్ర చేసినట్టు మాధవ్ ఆరోపించారు.
మార్ఫింగ్ వీడియా అంటూ తనపై వస్తున్న ఆరోపణలను మాధవ్ కొట్టి పడేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, న్యాయ పోరాటం చేస్తానని మాధవ్ ధీమాగా చెప్పారు. కానీ సొంత పార్టీ , అలాగే ప్రభుత్వం నుంచి ఆయనకు ఆశించిన స్థాయిలో మద్దతు దొరకలేదు. మాధవ్ వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్‌గా ఉన్నట్టు వార్తలొచ్చాయి.
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ మాధవ్ న్యూడ్ వీడియోపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందన్నారు. మార్ఫింగ్ వీడియో కాదని తేలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో సదరు వీడియో మాధవ్ చెబుతున్నట్టు నకిలీదా లేదా ఒరిజినల్ అనేది ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ తేల్చాల్సి వుంది. అందరూ ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు.
కాసేపటి క్రితం నివేదిక సీఎం జగన్ చెంతకు చేరినట్టు వార్తలొస్తున్నాయి. ఫేక్ కాదని ఫోరెన్సిక్ విభాగం నివేదిక ఇచ్చినా నమ్మే పరిస్థితి లేదు. అధికార పార్టీ తమ ఎంపీని వెనకేసుకొస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతాయి.
ఒకవేళ ఒరిజినల్ అని తేలితే ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? లేక బహిష్కరణ వేటు వేస్తారా? అనేది జగన్ నిర్ణయంపై ఆధారపడి వుంది.