టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చాలా పెద్ద తప్పు చేశారని, ఇకపై ఆయన మొహం చూడనని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల క్రితం కూడా రేవంత్‌రెడ్డిపై వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డిపై రాజకీయ విమర్శలకు బదులు, వ్యక్తిగత తమ కుటుంబ బ్రాండ్‌ను కించపరిచే వ్యాఖ్యలు చేశారని రేవంత్‌పై ధ్వజమెత్తారు. రేవంత్ మాటలు తనను బాధించాయని, క్షమాపణ చెప్పాలని వెంకటరెడ్డి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఇవాళ మరోసారి రేవంత్‌పై రాజకీయ దాడిని వెంకటరెడ్డి కొనసాగించారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో చేర్చుకున్నారు. తెలంగాణ ఇంటిపార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. తనకు తెలియకుండా చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ఏంటని రేవంత్‌రెడ్డిని వెంకటరెడ్డి నిలదీశారు.
తనను ఓడించాలని అనుకున్న వ్యక్తిని రేవంత్‌రెడ్డి ఆదరించడం ఏంటని ఆయన నిలదీశారు. గతంలో నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. తన ఓటమికి చెరుకు సుధాకర్ కారణమని వెంకటరెడ్డి భావన.
ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌లో రేవంత్ చేర్చుకున్నారు. తెలంగాణ పోరాటంలో చెరుకు సుధాకర్ కీలక పాత్ర పోషించారు. పీడీ యాక్టు కింద జైలు జీవితం గడిపారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన చెరుకు సుధాకర్‌ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీసీలను తమ వైపు తిప్పుకోవచ్చని రేవంత్‌రెడ్డి ఆలోచన. మునుగోడు నియోకవర్గంలో గౌడ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.
బీసీల మొత్తం ఓట్లు లక్షకు పైగా ఉన్నాయి. చెరుకు సుధాకర్‌ను చేర్చుకోవడం ద్వారా బీసీల ఓట్లను దక్కించుకుని సులువుగా విజయం సాధించొచ్చనే ఎత్తుగడ రేవంత్‌ది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజా వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గ రాజకీయాలు ఊపందుకున్నాయి.