తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసైడ్ అయ్యారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా విపక్షాలకు మద్దతుగా ఆయన మరోసారి నిలిచారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి మార్గరేట్ అల్వాకు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థికి టీఆర్ఎస్ ఓటు వేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ మోదీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా వుండగా మార్గరేట్ అల్వా కాంగ్రెస్ నాయకురాలు. అయినప్పటికీ విపక్షాల తరపున ఆమె పోటీ చేస్తుండడంతో మద్దతు ఇచ్చేందుకు టీఆర్ఎస్ ముందుకు రావడం గమనార్హం. ఈ నిర్ణయం రాజకీయంగా తనను ఇరకాటంలో పడేస్తుందని తెలిసినా కేసీఆర్ వెనకడుగు వేయలేదు.
కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఒకటే అనే ప్రచారానికి తెలంగాణ బీజేపీ శ్రీకారం చుట్టనుంది. ఎందుకంటే నిన్నమొన్నటి వరకూ కాంగ్రెస్ నాయకురాలైన మార్గరేట్కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించడాన్ని బీజేపీ అవకాశంగా తీసుకుంటుంది.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలతో టీఆర్ఎస్ పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఆ రెండు పార్టీలు కూడా అధికార పార్టీకి ప్రత్యర్థులే. అయితే జాతీయ స్థాయి రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
మొత్తం 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు మార్గరెట్ అల్వాకు ఓటు వేయనున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, ఆ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు మద్దతు ప్రకటనను విడుదల చేశారు.