Advertisement

Advertisement


Home > Politics - Andhra

వైఎస్ అవినాష్ యాక్టీవ్ అయితేనే...!

వైఎస్ అవినాష్ యాక్టీవ్ అయితేనే...!

క‌డ‌ప వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి యాక్టీవ్ అయితేనే, ఆయ‌న పార్ల‌మెంట్ ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార పార్టీ విజ‌యం సులువు అవుతుంది. అవినాష్‌రెడ్డి ఎప్ప‌ట్లాగే జ‌నం ఓట్లు వేస్తార్లే అని నిర్ల‌క్ష్యం వ‌హిస్తే మాత్రం రాజ‌కీయంగా న‌ష్టం జ‌రుగుతుంద‌ని వైసీపీ శ్రేణులు హెచ్చ‌రిస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా ప్రొద్దుటూరు, మైదుకూరు, క‌మ‌లాపురం, జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గాల‌పై అవినాష్ ప్ర‌త్యేక దృష్టి సారించాల్సిన అవ‌స‌రం వుంది.

జ‌మ్మ‌ల‌మ‌డుగులో సిటింగ్ ఎమ్మెల్యే, ప్ర‌స్తుత అభ్య‌ర్థి డాక్ట‌ర్ సుధీర్‌రెడ్డి తీరుతో పార్టీకి చాలా న‌ష్టం జ‌రిగింది. వైసీపీ అదృష్టం కొద్ది జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి బీజేపీ పోటీ చేస్తోంది. టీడీపీ అభ్య‌ర్థి భూపేష్‌రెడ్డి బ‌రిలో నిలిచి వుంటే, సుధీర్‌రెడ్డి ఓడిపోయే వార‌ని వైసీపీ నేత‌లు కూడా చెబుతున్నారు. అలాగ‌ని ఇప్పుడంతా సుర‌క్షిత‌మ‌ని కాదు. గ‌త ఎన్నిక‌ల్లో 50 వేల‌కు పైగా మెజార్టీతో గెలిచిన జ‌మ్మ‌ల‌మ‌డుగులో వైసీపీ గెలుస్తుంద‌ని ధీమాగా చెప్ప‌లేక‌పోవ‌డ‌మే, ఆ పార్టీ ప‌తనాన్ని ప్ర‌తిబింబిస్తోంది.

జ‌మ్మ‌ల‌మ‌డుగులో కేడ‌ర్‌ను ఎమ్మెల్యే గాలికి వ‌దిలేశార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. కొండాపురం మండ‌లంలో గండికోట జ‌లాశ‌యం ముంపు వాసుల‌కు రూ.10 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం అంద‌జేస్తాన‌ని ఎన్నిక‌ల ముందు వైఎస్ జ‌గ‌న్ ఆర్భాటంగా ప్ర‌క‌టించారు. ఆ సొమ్ము ఇంత వ‌ర‌కూ ఇవ్వ‌లేదు. దీంతో ఆ మండ‌లంలో ప్ర‌జ‌లు ర‌గిలిపోతున్నారు. ఇక్క‌డ భారీ డ్యామేజీ త‌ప్ప‌దు. అలాగే ముద్ద‌నూరు మండ‌లంలో మేన‌మామ మునిరాజారెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌గా, ఆయ‌న నాశ‌నం చేశార‌నే విమ‌ర్శ సొంత పార్టీ శ్రేణుల నుంచి వ‌స్తోంది.

జ‌మ్మ‌ల‌మ‌డుగు, మైల‌వ‌రం మండ‌లాల్లో ఆదినారాయ‌ణ‌రెడ్డి, భూపేష్‌రెడ్డి ఎంతోకొంత ఆధిక్య‌త క‌న‌బ‌రిచే అవ‌కాశాలున్నాయి. పెద్ద‌ముడియం మండ‌లంలో స్వ‌ల్ప ఆధిక్య‌త‌ను వైసీపీ క‌న‌బ‌రిచే అవ‌కాశాలున్నాయి. ఇక వైసీపీకి చెప్పుకోద‌గ్గ స్థాయిలో ఎర్ర‌గుంట్ల మండ‌లంలో మెజార్టీ రావ‌చ్చ‌ని అంచ‌నా. అయితే జ‌మ్మ‌ల‌మ‌డుగులో మొద‌టి నుంచి వైఎస్సార్ కుటుంబానికి ఆద‌ర‌ణ వుంది. వైఎస్ అవినాష్‌రెడ్డి చొర‌వ చూపి, ఆ నియోజ‌క‌వ‌ర్గంలో న‌ష్ట‌నివార‌ణ చర్య‌లు చేప‌డితే సత్ఫ‌లితాలు వుంటాయి. సుధీర్‌రెడ్డిపైనే వ‌దిలేస్తే, రానున్న ఎన్నిక‌ల్లో ఏమైనా జ‌రగొచ్చు.

ప్రొద్దుటూరులో కూడా ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి తీరుతో వైసీపీకి బాగా న‌ష్టం జ‌రిగింది. వైఎస్సార్ కుటుంబానికి స‌న్నిహితులైన నాయ‌కులు కూడా పార్టీకి దూరం అయ్యారు. ప్రొద్దుటూరులో ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో విజ‌యం ఎవ‌రిదో ధీమాగా చెప్ప‌లేని ప‌రిస్థితి. అయితే ముస్లిం ఓట‌ర్లు, విజ‌యం కోసం ఎందాకైనా అనే ఎమ్మెల్యే ప‌ట్టుద‌ల‌పై వైసీపీ ఆశ‌లు పెట్టుకుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో విభేదాల‌ను ప‌రిష్క‌రించ‌డంలో క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి అట్ట‌ర్ ప్లాప్ అయ్యారు.

మైదుకూరులో ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌కు మొగ్గు క‌నిపిస్తూ వుంటుంది. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక జోక్ కూడా వుంది. ఎన్నిక‌ల జ‌రిగే వ‌ర‌కూ పుట్టా గెలుస్తాడు, ఎన్నిక‌ల ఫ‌లితాల్లో మాత్రం ర‌ఘురామిరెడ్డి గెలుస్తాడ‌నే స‌ర‌దా కామెంట్స్ మైదుకూరులో వినొచ్చు. మైదుకూరుపై కూడా ఎంపీ ప్ర‌త్యేక దృష్టి సారించాలి.

క‌మ‌లాపురంలో క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఎంత ఎక్కువ దృష్టి పెడితే అంత మంచిది. క‌మ‌లాపురం సిటింగ్ ఎమ్మెల్యే, అభ్య‌ర్థి ర‌వీంద్ర‌నాథ‌రెడ్డి తీరు ఎలా వుందంటే... ఏ ప్ర‌యోజనాలు ఆశించ‌కుండా పార్టీలోకి రావాల‌ని కోరుకుంటున్నారు. అయితే గ్రామ‌స్థాయి నాయ‌కుల అభిప్రాయాలు వేరేలా ఉన్నాయి. ర‌వీంద్ర‌నాథ‌రెడ్డి ప్ర‌యోజ‌నాల కోసం తామెందుకు ఊరికే వెళ్తామ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో వైసీపీలోకి వెళ్లాల‌ని అనుకుంటున్న గ్రామ స్థాయి నాయ‌కులు ఎమ్మెల్యే, ఎంపీకి లేని ఆత్రుత‌, మ‌న‌కెందుకు అని సైలెంట్ అయిపోతున్నారు. దీంతో రాజ‌కీయంగా ల‌బ్ధి పొందే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ, దాన్ని సొమ్ము చేసుకోవ‌డంలో వైసీపీ విఫ‌ల‌మ‌వుతోంద‌న్న చ‌ర్చ‌కు తెర‌లేచింది.

కావున ఇప్ప‌టికైనా క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి చొర‌వ చూపాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది. త‌న అన్న వైఎస్ జ‌గ‌న్ అప్ప‌గించిన బాధ్య‌త‌ల్ని విజ‌య‌వంతంగా నిర్వ‌ర్తించ‌డానికి వ్యూహాత్మ‌కంగా న‌డుచుకోవాలి. జ‌మ్మ‌ల‌మ‌డుగు, క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థులు చూసుకుంటార్లే అని వ‌దిలేస్తే, మెజార్టీ త‌గ్గుతుంద‌ని గ్ర‌హించాలి. ఏం చేస్తారో చూద్దాం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?