వైసీపీ విషయంలో విశాఖ హ్యాట్రిక్

విశాఖ అందమైన నగరం. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు. విశాఖకు ఒకసారి వచ్చిన వారు వదిలిపోరు. అలాంటి విశాఖ ఎవరినీ కాదు అని అనుకోదు. కానీ విశాఖ మాత్రం ఒక పార్టీని అదే పనిగా…

విశాఖ అందమైన నగరం. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు. విశాఖకు ఒకసారి వచ్చిన వారు వదిలిపోరు. అలాంటి విశాఖ ఎవరినీ కాదు అని అనుకోదు. కానీ విశాఖ మాత్రం ఒక పార్టీని అదే పనిగా వద్దు అని అంటోంది. ఆ పార్టీ పట్ల ఎందుకు విశాఖ అలా వ్యవహరిస్తోంది అన్నది మాత్రం అంతు పట్టని ప్రశ్నగానే ఉంది. విశాఖ ఒకసారి కాదు మూడు సార్లు వైసీపీని ఓడించి హ్యాట్రిక్ కొట్టింది. 2014లో విశాఖ ఎంపీ సీటు సహా నగరంలోని నాలుగు దిక్కులా ఓడించేసింది.

జగన్ ప్రభంజనంలో ఉమ్మడి విశాఖ జిల్లా అంతటా వైసీపీ గెలిచినా మళ్ళీ ఆ నాలుగు దిక్కులా ఫ్యాన్ రెక్కలు ఆగిపోయాయి. విశాఖ వైసీపీ దూకుడుకు ఆ విధంగా అడ్డుకట్ట వేసింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో విశాఖ సిటీతో పాటుగా ఎంపీ సీటులో రూరల్ జిల్లా మొత్తం వైసీపీని ఓడించేసి క్లీన్ స్వీప్ చేసింది. ఇంతలా విశాఖ వైసీపీని పగబట్టినట్లుగా ఓడించడం వెనక కారణాలు ఏమిటి అంటే చెప్పుకుంటే బోలెడు ఉన్నాయి.

వాటితో పాటుగా బలమైన పార్టీ నాయకత్వం కొరత మొదటి నుంచి వైసీపీకి ఉంది. సామాజిక వర్గాల పరంగా చూస్తే టీడీపీదే పై చేయిగా ఉంది. దాంతో పాటుగా విశాఖలో రాజకీయం అంతా టీడీపీ చేతులలోనే దశాబ్దాలుగా ఉంటూ వస్తోంది. అధికారంలో వైసీపీ ఉన్నా విశాఖలో టీడీపీని ఏ మాత్రం కదల్చలేకపోయింది.

లోకల్ లీడర్ షిప్ ని డెవలప్ చేయకపోగా ఎక్కడ నుంచో వచ్చిన నాయకులను కో ఆర్డినేటర్లుగా పెట్టడం వల్ల కూడా వైసీపీ రాజకీయంగా దెబ్బ తిన్నది అని విశ్లేషిస్తున్నారు.