చంద్రబాబు నాయుడును భక్తులందరూ కూడా ‘దార్శనికుడు’ అనే పదంతో కీర్తిస్తుంటారు. ‘విజనరీ’ అని అంటుంటారు. దార్శనికుడు అంటే కొన్ని దశాబ్దాల ముందుకు చూసి, అప్పటికి తగినట్లుగా ఇప్పుడే చర్యలు తీసుకునే వ్యక్తి అని అర్థం! ఆయన భక్తులు భావించే ప్రకారం ఆయనలోని దార్శనికత ఉన్నదో లేదో మనకు తెలియదు కానీ, రాజకీయంగా తన కొడుకు భవిష్యత్తును సుస్థిరంగా తీర్చిదిద్దే క్రమంలో మాత్రం ఆయన స్పష్టమైన దార్శనికతను ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుత క్యాబినెట్ కూర్పులో లోకేష్ టీం కు తగు మాత్రం ప్రాధాన్యం ఉంటుందని విశ్వసనీయంగా తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందుగానే ఒక విషయాన్ని అంగీకరించారు. తనకు వార్ధక్యం పైన పడుతోందని, మరీ ఎక్కువ కాలం రాజకీయాలలోనైనా సేవలు అందించే పరిస్థితి లేదని ఆయన గ్రహించారు. అందుకే ప్రజల ఎదుట తనకు ముఖ్యమంత్రిగా సేవ చేయడానికి చివరి అవకాశం ఇవ్వాలని కోరారు. మొత్తానికి ఏ మాటలు ఫలించాయో గాని తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది.
తన చివరి ఛాన్స్ ముఖ్యమంత్రి పదవి పూర్తయ్యలోగా తన కొడుకు నారా లోకేష్ ను వారసుడిగా, ముఖ్యమంత్రి పదవికి అర్హుడిగా, ఆ మేరకు పార్టీలోనూ, ప్రజల్లోను బలం కలిగి ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందున్న ప్రథమ కర్తవ్యం.
ప్రస్తుతానికి తెలుగుదేశం జనసేన పొత్తుల్లోనే ఉన్నప్పటికీ భవిష్యత్తులో నారా లోకేష్ ను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించే పరిస్థితి వచ్చిన నాడు పవన్ కళ్యాణ్ ఇప్పటి మాదిరిగానే సహకరిస్తారని నమ్మకం లేదు. అందుకని లోకేష్‌ను స్వతంత్రంగా బలమైన నాయకుడిగా తయారు చేయడానికి చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు.
ప్రస్తుత క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉంటూ తన పార్టీకి చెందిన మరో నలుగురికి మంత్రి పదవులు తీసుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీకి రెండు క్యాబినెట్ స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. అదే తరహాలో యువశక్తికి ప్రాధాన్యం ఇస్తున్నాం- అనే ముసుగులో నారా లోకేష్ టీం గా భవిష్యత్తులో మరో 20 ఏళ్ల పాటు సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగలిగిన యువ నాయకులకు, లోకేష్ పట్ల విధేయత ఉండే నాయకులకు కూడా చోటు దక్కుతుందని తెలుస్తోంది. ఆ సంఖ్య నాలుగు కంటే ఎక్కువగా ఉంటుందని పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది.
వివిధ ప్రాంతాల నుంచి లోకేష్ టీం కు చెందిన బలమైన యువకులను మంత్రులు చేస్తే, వారు ఆయా ప్రాంతాలలో బలంగా పాతుకుపోవాలనేది వ్యూహం! తద్వారా చంద్రబాబునాయుడు తర్వాత కూడా నారా లోకేష్ ప్రభావం సుస్థిరంగా వెలుగొందడానికి అవకాశం ఉంటుందని ఆయన ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఏ విషయంలో వర్కవుట్ అయినా కాకపోయినా- లోకేష్ విషయంలో ఆయన దార్శనికత మాత్రం గొప్పగాన్నే కనిపిస్తోంది!