రాజకీయాలు అంటే ఆయారామ్.. గయారామ్ అన్నది ఒకప్పటి మాట. కానీ కాలం మారుతోంది. యువతరం రాజకీయాల్లోకి వచ్చింది. పంతాలు, పట్టుదలలు పదింతలు ప్రదర్శిస్తోంది. ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అన్నది పక్కన పెడితే ఒకసారి దూరం జరిగిన వాళ్లను, ఒకసారి ఎదురు తిరిగిన వాళ్లను మళ్లీ దగ్గర తీసుకోవడానికి అంతగా ఇష్టపడడం లేదు. ముఖ్యంగా వైరి పార్టీలో వున్నా, మౌనంగా, వాళ్ల పని వాళ్లు చేసుకున్న వాళ్లకు సమస్య కాదు. నోరు పెట్టుకుని చెలరేగపోవడమో, లేదా వ్యతిరేక ప్రచారం భయంకరంగా చేయడమో చేసిన వాళ్లకు అస్సలు తలుపులు తీయడం లేదు.
ఇది నిజానికి జగన్ దగ్గరే ప్రారంభమైంది. వైఎస్ జమానా వేరు. పద్దతి వేరు. బండబూతులు తిట్టిన వాడైనా దగ్గరకు వచ్చి క్షమించమని కోరితే, భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకునే పద్దతి వుండేది. కానీ జగన్ అలా కాదు. జస్ట్ ఇగో హర్ట్ చేస్తే చాలు, దూరం జరిగితే చాలు ఇక డోర్స్ బంద్.
ఇప్పుడు లోకేష్ కూడా ఇదే పద్దతి అవలంబిస్తున్నారని తెలుస్తోంది. జగన్ కు అండగానో, మద్దతుగానో నిలిచిన కొందరు పెద్దలు, ఎన్నికల అనంతరం లోకేష్ కు దగ్గర కావాలనో, ఓసారి కలవాలనో ప్రయత్నిస్తే, నో అని చెప్పేస్తున్నారట. మధ్యవర్తుల ద్వారా కలుస్తామని కబురు చేస్తే, అసలు ముందు ఆ మధ్యవర్తులనే కట్ చేసేస్తున్నారట లోకేష్.
నిజానికి ఇలా చేయడం ఓ విధంగా మంచిదే. పార్టీని కష్టకాలంలో కూడా నమ్ముకున్న వారు సంతోషిస్తారు. అధికారం అందగానే ఎవరెవరో వచ్చి మళ్లీ కుదురుకుంటే, కష్టపడిన వారికి బాధగా వుంటుంది. కానీ రాజకీయపరంగా చూసుకుంటే కాస్త పట్టు విడుపు అవసరం అనిపిస్తుంది. కొన్ని సార్లు, కొన్ని చోట్ల బలమైన వర్గాలు దగ్గరకు వస్తాము అంటే, గతం లెక్కలు తీసి, దూరంగా వుంచడం కన్నా, దగ్గరకు తీసి, పక్కన వుంచుకోవడమే బెటర్.
ఈ ఈక్వేషన్లు అన్నీ చూసుకుని ముందుకు వెళ్తేనే బెటర్. మరీ జగన్ మాదిరిగా తాను పట్టిన కుందేలు మూడే కాళ్లు అనే పద్దతి మంచిది కాదు.