పశ్చిమ బెంగాల్ లో 2011లో అధికారంలోకి వచ్చారు మమతా బెనర్జీ. తన పార్టీకి, బెంగాల్ కు ఆమె సుప్రిమోగా కొనసాగుతూ ఉన్నారు. అనేక సందర్భాల్లో దీదీ దూకుడుగా వ్యవహరించారు. ఎంతలా అంటే.. అంతకు ముందు కమ్యూనిస్టులు చేసిన దూకుడైన రాజకీయానికి ధీటుగా టీఎంసీ వ్యవహరించింది.
సహజంగానే పదేళ్ల పాలన అంటే వ్యతిరేకత రానే వస్తుంది. అయితే బెంగాలీలు ఒకరికే ఎక్కువ కాలం అవకాశాలు ఇచ్చే టైపు. కమ్యూనిస్టు పార్టీలు దేశమంతా హరించుకుపోయినా బెంగాల్ లో మాత్రం రాజ్యమేలాయి. ఇప్పుడు అక్కడ అవి ఉనికి కోసం పోరాడే స్థితికి చేరిపోయాయి.
ఇక కాంగ్రెస్ పార్టీ కొన్నాళ్లు టీఎంసీతో, మరి కొన్నాళ్లు కమ్యూనిస్టులతో చేతులు కలుపుతూ ఉనికి పాట్లు పడుతూ ఉంది. పదేళ్ల పాలనతో ఇప్పుడు ప్రజాతీర్పుకు వెళ్లబోతోంది మమతా బెనర్జీ సర్కారు.
ఇప్పటికే బెంగాల్ లో రాజకీయ వేడి పతాక స్థాయికి చేరి నెలలు గడుస్తూ ఉన్నాయి. ఎలాగైనా మమతను ఓడించి బెంగాల్ లో పాగా వేయాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాల్లో ఉంది. లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన సానుకూల ఫలితాలు బీజేపీకి రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తూ ఉన్నాయి.
ఇక టీఎంసీకి వరస రాజీనామాలు నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉన్నాయి. ఒక్కొక్క నేతా ఆ పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నారు. తాజాగా మాజీ క్రికెటర్, మమత ప్రభుత్వంలో సహాయ మంత్రి లక్ష్మీ రతన్ శుక్లా రాజీనామా చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన తప్పుకున్నారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో శుక్లా రాజీనామాతో ఆయన పార్టీని కూడా వీడబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకటీ రెండు అంతర్జాతీయ క్రికెట్ సీరిస్ లు కూడా ఆడాడు శుక్లా. ఆయన ఎమ్మెల్యే పదవికి ఇంకా రాజీనామా చేయలేదు. ఆయనను చేర్చుకోవడానికి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పోటీ పడుతున్నాయట.
ఈ పరిస్థితుల్లో బయటకు స్పష్టం అవుతున్న విషయం.. మమతా బెనర్జీపై వ్యతిరేకత ఉందనేది. అది సొంత పార్టీలోనే ఉందని నేతల రాజీనామాల ద్వారా స్పష్టం అవుతోంది. అలాగే ఓట్ల చీలిక కూడా భారీగా ఉండబోతోంది. కమ్యూనిస్టులు- కాంగ్రెస్ కలిసి పోటీ చేసే ఉద్దేశంలో ఉన్నట్టున్నాయి. ఇక ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో ఒవైసీ రంగంలోకి దిగుతున్నాడు. టీఎంసీ కూడా ఈ పార్టీల ఓటు బ్యాంకులోనే మెజారిటీని పొందాలి.
బీజేపీ మాత్రం లౌకికం అనిపించుకునే పక్షాలను వ్యతిరేకించే ఓటు బ్యాంకు మీదనే కాన్సన్ ట్రేట్ చేసిందని వేరే చెప్పనక్కర్లేదు. స్థూలంగా మమతా బెనర్జీ మీదే వ్యతిరేకత ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు.
తమకు అనుకూల ఓటుకు తోడు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా బీజేపీ సొంతం చేసుకుంటే ఆ పార్టీ బెంగాల్ లో పాగా వేసే అవకాశాలు లేకపోలేదు. అయితే దీదీ శిబిరం మాత్రం ఇప్పటికీ చాలా కాన్ఫిడెన్స్ తోనే కనిపిస్తోంది. బీజేపీ చిత్తే అని, అధికారం మళ్లీ తమదే అని మమత కోటరీ విశ్వాసంతో చెబుతోంది. ఇలా ఆసక్తిని రేపుతున్నాయి బెంగాల్ రాజకీయాలు.