బీజేపీ వాడకం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఏ రాష్ట్రంలో చూసినా బీజేపీ బాగోతం బయటపడుతుంది. ఇప్పుడు ఏపీలో కూడా బీజేపీ తన మార్క్ రాజకీయం మొదలుపెట్టింది. స్వయంగా కాపు నాయకుడితో పొత్తు కొనసాగిస్తూ, అదే కాపు నేతను ఆ కమ్యూనిటీకి దూరం చేసే స్కెచ్ రెడీ చేసింది.
కాపు కమ్యూనిటీకి చెందిన పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. కానీ ఆయన కాపుల గురించి మాట్లాడకూడదు. బీజేపీ మాత్రమే మాట్లాడుతుంది. కాపులకు విద్య-ఉద్యోగ అవకాశాల్లో 5 శాతం రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేస్తుంది. డెడ్ లైన్ కూడా పెట్టింది. మార్చి 15 లోపు రిజర్వేషన్ల అంశం తేల్చాలంటూ డిమాండ్ చేస్తుంది. కానీ పొత్తులో ఉన్న పవన్ మాత్రం దీనిపై మాట్లాడకూడదు. బీజేపీనే మాట్లాడాలి. అవసరమైతే ఢిల్లీ నుంచి వచ్చిన గడ్కరీ మాట్లాడతారు కానీ పక్కనే ఉన్న పవన్ మాత్రం మాట్లాడరు. ఇదే బీజేపీ మార్కు రాజకీయం.
ఏపీలో 28శాతం కాపులున్నారు. 2014లో కాపుల్లో మెజార్టీ ఓట్లు టీడీపీ-బీజేపీ కూటమికి పడ్డాయి. అప్పుడు పవన్ కల్యాణ్ కూడా అదే టీమ్ కావడం విశేషం. కానీ చంద్రబాబు రిజర్వేషన్ పేరుతో దారుణంగా వంచించారు. పోరాటం చేస్తున్న కాపు నాయకుల్ని అరెస్ట్ చేయించారు. 2019లో కాపు ఓట్ల టీడీపీకి పడవని గ్రహించిన బాబు, పవన్ ని వేరుగా పోటీ చేయమన్నారు, కాపు ఓట్లను చీల్చాలనే ప్లాన్ వేశారు. కానీ అది వర్కవుట్ కాలేదు.
రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పినా కూడా జగన్ పై నమ్మకంతో వారు వైసీపీ వైపు నిలబడ్డారు. రిజర్వేషన్లు ఇవ్వలేదు కానీ, పాలనలో కాపులకు పెద్దపీట వేశారు జగన్. కాపునాయకులపై పెట్టిన కేసులన్నీ ఎత్తేశారు. ఇప్పటికీ ముద్రగడ వంటి వారు జగన్ పై సింపతీతో ఉంటారు, చంద్రబాబుని ద్వేషిస్తారు.
ఇక దేశవ్యాప్తంగా మత రాజకీయాలు చేస్తున్న బీజేపీకి ఏపీలో అలాంటి సబ్జెక్ట్ దొరకడంలేదు. అందుకే కుల రాజకీయాలకు తెరతీసింది. కాపుల ఓట్లన్నీ తమకే కావాలనుకుంటోంది. కానీ కాపు నాయకుడు పవన్ కల్యాణ్ ని ఆ విషయంలో ముందుకెళ్లనివ్వడం లేదు. కాపుల మద్దతంతా బీజేపీకే కావాలనుకుంటోంది.
విచిత్రం ఏంటంటే.. కాపు నాయకుడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు కానీ.. ఏపీ బీజేపీలో రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ కనిపిస్తుంది. కమ్మ సామాజిక వర్గం వారు ఉన్నా.. వారి దృష్టి అంతా ఎప్పుడూ టీడీపీపైనే. మరిక్కడ కాపులకు ప్రాధాన్యం లేదనే విషయం స్పష్టం. కానీ కాపుల ఓట్లు మాత్రం బీజేపీకి కావాలంట.
పవన్ ని కాపులకు దూరం చేస్తూ..
కాపులను ఆకర్షించే క్రమంలో భాగంగా.. పవన్ కల్యాణ్ ని కాపులకు దూరం చేస్తోంది బీజేపీ. దీనివల్ల రెండు లాభాలు. ఏపీలో కాపులకు మద్దతిచ్చే ఏకైక పార్టీ బీజేపీ అనే పేరు వస్తుంది, అదే సమయంలో పవన్.. బీజేపీతో ఉన్నా లేకపోయినా నష్టం లేదు.
ఇలా ముందస్తు ఆలోచనలతో బీజేపీ స్కెచ్ వేసింది. కాపుని పక్కన పెట్టుకుని మరీ కుళ్లు రాజకీయం మొదలు పెట్టింది.