చారిత్రక పాలనలో చరిత్రాత్మక బిల్లు

అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ, చరిత్రను తిరగరాసేలా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తన హయాంలో మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు మరింత భద్రత కల్పిస్తూ,…

అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ, చరిత్రను తిరగరాసేలా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తన హయాంలో మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు మరింత భద్రత కల్పిస్తూ, ఆడపడుచులకు అండగా నిలబడే విధంగా కీలక బిల్లుకు ఇవాళ్టి కేబినెట్ భేటీలో ఆమోదముద్ర వేశారు. మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన తాజా బిల్లు ప్రకారం.. ఇకపై అత్యాచార కేసుల్లో 21 రోజుల్లోనే నిందితుడిని దోషిగా నిర్థారిస్తూ, అతడికి ఉరిశిక్ష ఖరారుచేస్తూ తీర్పు ఇవ్వొచ్చు

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ ఘటనతో ఏపీ సర్కార్ ముందుజాగ్రత్త చర్యలకు సిద్ధపడింది. చట్టాల్ని మరింత కఠినతం చేయాల్సిన అవసరం ఉందని అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి, ఆ దిశగా చట్టసవరణ చేస్తూ సరికొత్త బిల్లును కేబినెట్ భేటీలో ఆమోదించారు. ఐపీసీ సెక్షన్-354 సవరణ బిల్లుకు 354-Eను చేర్చింది. ఈ చట్ట సవరణ ఆధారంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనల్లో రెడ్ హ్యాండెడ్ గా ఆధారాలుంటే 21 రోజుల్లో ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వొచ్చు.

ప్రస్తుతం ఈ సెక్షన్ కింద విచారణ సమయం 4 నెలలు ఉంది. దీన్ని 21 రోజులకు కుదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ఈ చట్ట సవరణ కింద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయడం తో పాటు.. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే జైలు శిక్షలు కూడా విధించొచ్చు.

ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసి, దీనికి దిశా చట్టం అనే పేరు పెట్టాలని జగన్ ఆలోచిస్తున్నారు. ఇది చట్టంగా రూపుదాల్చితే.. విచారణ వేగవంతం అవ్వడంతో పాటు శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి. చిన్నారుల్ని లైంగికంగా వేధిస్తే 14 ఏళ్ల వరకు జైలుశిక్ష, ఇదే కేసులో మరింత తీవ్రత ఉంటే జీవిత ఖైదు విధించే వెసులుబాటు కూడా కలుగుతుంది. ఇలాంటి కఠినమైన చట్టాలు తీసుకురావడం ద్వారా మహిళా భద్రతకు పూర్తి భరోసా ఇస్తున్నారు జగన్.